Thursday 29 September 2011

Egypt - Luxor


 లగ్జర్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్

  సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి లగ్జర్లో  ఈస్ట్ బ్యాంకులో దేవుడి గుళ్ళు,  పశ్చిమాన్న అస్తమిస్తాడు కాబట్టి వెస్ట్ బ్యాంకులో మార్చురీ గుళ్ళు కట్టారు.

       పొద్దున్నే అయిదింటికి లేచి రెడీ అయిపోయాం. అయిదున్నరకి ఫోనొచ్చింది రైడ్ ఉంది, ఆరింటికల్లా రిసెప్షన్ దగ్గర వెయిట్ చెయ్యమని.  ఆరింటికల్లా  వాన్ వచ్చేసింది.  హోటల్స్ దగ్గర ఆగుతూ వచ్చేవాళ్ళందరినీ  ఎక్కించుకుని  ఫెర్రీ పాయింట్ దగ్గర దింపింది.  పడమర ఒడ్డుకు వెళ్ళాలంటే  ఫెర్రీలోనే వెళ్ళాలి.  వెస్ట్ బ్యాంకుకి వెళ్లేసరికి ఏడైంది.  అప్పటికే ఒకొక్క బెలూనూ ఎగరటం మొదలుపెట్టాయి.  మా వంతు వచ్చేటప్పటికి ఎనిమిదయ్యింది.   రైడ్ నలభై అయిదు నిమిషాలు.   

     ముందు బెలూన్ తీసి  బాస్కెట్కి కట్టి  నెమ్మదిగా ఇన్ఫ్లేట్  చేసారు.  తరువాత మమ్మల్ని బాస్కెట్ లోకి  ఎక్కించారు. మొత్తం ఇరవై మందిమి. ఇంకా పైలెట్. బాస్కెట్ లో అయిదు క్యూబికల్స్/ కంపార్టుమెంట్లు ఉన్నాయి. ఇటు రెండు, అటు రెండు, మధ్యలో పెద్దది ఒకటి. నాలుగు కుబికల్స్ లో అయిదుగురు చొప్పున ఎక్కించారు. మధ్యలోని పెద్ద కుబికల్ లో పైలెట్, గ్యాస్ సిలిండర్లు.
 


బెలూన్ టేక్ఆఫ్ అయ్యేటప్పుడు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఛీర్ చేసారు.


   

  వెస్ట్ బ్యాంకు లో ఉన్నవన్నీ సమాధులే కాబట్టి valley of kings, valley of queens, valley of nobles, mortuary temple of Hatsepsut, colossi of Memnon చూడచ్చు.   ఫారోలన్దరికీ  valley of kings లో, వాళ్ళ భార్యా పిల్లలకి   valley of queens లో,   ఆస్థానంలోని ముఖ్యమైన వాళ్ళకి valley of nobles లో సమాధులు ఉంటాయి.       
 

Colossi of Memnon


       పేరుకి memnon అనున్నా ఇవి Amenhotep the third  విగ్రహాలు.  ఇప్పుడు సమాధి ఏమీ లేదు.  ఈ రెండు విగ్రహాలు మాత్రమే మిగిలాయి.  ట్రోజన్ యుద్ధంలో ఆఫ్రికా రాజు మెంనన్ని ఎఖిలిస్ చంపేసాడు.  మెంనన్ ఎఖిలిస్ అంత బలవంతుడుట.  అందుకని గ్రీకులు, రోమన్లు ఈ విగ్రహాల్ని మెంనన్ గా గుర్తించటం మొదలు పెట్టారు. 


valley of kings 
 




Mortuary Temple of Hatsepsut


Hatsepsut రాణే అయినా, తను ఫారో లాగా దాదాపు ఇరవై ఏళ్ళు పాలించింది కనక ఆవిడ సమాధి కూడా valley of kings లోనే ఉంది. దాన్నే Mortuary temple of Hatsepsut అంటారు.



valley of queens







Carter's house

హోవార్డ్ కార్టర్ ఇంగ్లండ్ కి చెందిన ఈజిప్టాలజిస్ట్.  ముప్పై ఏళ్ళు కష్టపడి టూటన్ఖామున్ సమాధి కనిపెట్టాడు. 
     రైడ్ అయిపోయిన తరువాత మా పైలెట్ మొహమ్మద్ అందరికీ సర్టిఫికేట్  ప్రెసెంట్ చేసారు.  




 రైడ్ అయిపోయిన తరువాత మళ్ళీ ఫెర్రీలో ఈస్ట్ బ్యాంకుకి వచ్చి,  వాన్లో హోటల్కి పదింటికల్లా వచ్చేసాం.  టిఫిన్ చేసేసి లగ్జర్ టెంపుల్ కి బయల్దేరాం. 


లగ్జర్  టెంపుల్ ( Luxor Temple )

Luxor Temple

    Hatsepsut , ఆవిడ కొడుకు Tuthmosis the third థేబిస్ కి చెందిన ముగ్గురు దేవుళ్ళకి   మూడు చిన్న గుళ్ళు కట్టించారు.  ఇక్కడ దేవుడి బొమ్మలేమి ఉండవు. వాళ్ళని ఊరేగించే  పడవలు మాత్రం పెడతారు.   ఆ ముగ్గురిని ' Triad of Thebes' అంటారు.  వీళ్ళు ఆమున్, అతని భార్య మూట్ (Mut), వాళ్ళ కొడుకు ఖోంసు ( Khonsu).

Shrine for the sacred boats of the Triad of Thebes



తర్వాత కాలం లో చాలా మంది ఫారోలు గుడిని పెంచుకుంటూ పోయినా,  ముఖ్యమైన వాళ్ళు మాత్రం Amenhotep the third, రెండో రామస్సేస్ , Nectanabo.

colonnade of Amenhotep

Sun Court of Amenhotep the third


         పిల్లర్ల   పైన ఉన్న కప్  లాంటి ఆకారం పెపైరస్ (papyrus) అనే చెట్టు మొగ్గ.  ఈ పెపైరస్ నించే పేపర్ కూడా తయారు చేసేవారు.  పెపైరస్ దిగువ ఈజిప్ట్ (lower Egypt) ని సూచిస్తుంది.  తామర పువ్వు ఎగువ ఈజిప్ట్ ( upper Egypt) ని సూచిస్తుంది.  కట్టడాల మీద ఉండే పువ్వు ఆకారం బట్టి ఆ ఫారో దేనికి రాజో చెప్పచ్చు. 
 
           గుడి పైలాన్, ఒబెలిస్క్ రెండో రామస్సేస్ కట్టించాడు.  గుడి ముందర కూర్చుని, నించుని ఉన్న విగ్రహాలన్నీ రామస్సేస్వే. మొత్తం ఆరు విగ్రహాలు, రెండు ఒబెలిస్క్లు ఉండాలి.  ప్రస్తుతం మూడు విగ్రహాలు, ఒక ఒబెలిస్క్ మిగిలాయి.  పంతొమ్మిదో శతాబ్దంలో ఈజిప్ట్ రాజు మొహమ్మద్ ఆలి, ఫ్రెంచ్ రాజు ఐదో లూయి బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు.  ఆలి ఒబెలిస్క్ ఇస్తే, లూయి గడియారం ఇచ్చాడు.  రెండో ఒబెలిస్ కూడా ఇద్దామనుకున్నాడుట.  కాని దాన్ని తీసుకెళ్ళటం కష్టమయ్యింది.  అందుకని ఒకటన్నా మిగిలింది.  లూయి ఇచ్చిన గడియారం ఒక్క రోజు కూడా పనిచేయ్యలేదుట.
       
          రామస్సేస్ కోర్టులో ఉన్న పిల్లర్ల మీద కూడా పెపైరస్ మొగ్గ చూడచ్చు.  కూర్చున్న రామస్సేస్  విగ్రహాల వెనకాల ఉన్న పొడుగు స్తంభాలు అమెనోతెప్ కట్టించినవి.  వాటి పైన ఉన్నవి పెపైరస్ పూలు.


Great court of Ramasses the second with his statues


Sphinx Avenue
 



నేక్టేనబో స్పింక్స్ ఎవెన్యు కట్టించాడు.  ఈ స్పింక్స్ లతో ఉన్న దారి మూడు కిలోమీటర్లు పొడుగు ఉండి లగ్జర్, కార్నాక్ గుళ్ళని కలుపుతుండేది. ప్రతీ సంవత్సరం ఒపెట్ అనే పండుగ ( opet festival ) జరిగేది. కార్నాక్ లో ఉన్న మూడు విగ్రహాలు ఊరేగింపుగా తీస్కొచ్చి ఇరవై రోజుల పాటు లక్షర్ గుడి లో పెట్టవారు. ఆ ఒరేగింపు స్పింక్స్ దారి నుండే జరిగేది. కాలక్రమేనా కొన్ని పడయిపోయాయి, వరదలు తుఫాన్లకి కొన్ని భూస్థాపితమైపోయాయి. ఇప్పుడు తవ్వకాలు మొదలుపెట్టారు. కాస్త ముక్కులు, మూతులు పోయి  దొరికినవాటిని రిపేరు చేసి, అసలు మొత్తానికే పాడయిపోయిన  వాటి స్థానంలో కొత్తవి పెట్టి మళ్ళీ ఆ మూడు కిలోమీటర్ల దారి స్పింక్స్లతో అలంకరించాలని ప్లానుట. 2030 సంవత్సరానికి ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని చూస్తున్నారు.  ఈజిప్ట్ టూరిజం మీదే ఆధారపడింది కాబట్టి ఇదొక మంచి అట్రాక్షన్ అవుంతుంది
కాని దారిలో ఉన్న ఇళ్ళు, కొట్లు, స్కూళ్ళు ఇంకా ఏముంటే అవన్నీ పడకోట్టేయ్యాలి కాబట్టి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి. చూడాలి ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో.
  అలేక్జాండర్  దండయాత్ర తరువాత తను కూడా ఫారో నేనని, తనని కూడా దేవుడిలాగే చూడాలని తనకి కూడా ఒక గుడి కట్టుకున్నాడు.  క్రైస్తవ మతం వచ్చిన తరువాత ఈ గుళ్ళన్నిటినీ  చర్చీలు గా మార్చేసి, గోడలమీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు.   ఐస్లాం కూడా వచ్చాక శిధిలాల  మీదే మసీదు కూడా కట్టుకున్నారు.

లక్షర్ లో గుర్రబ్బళ్ళు చాలా ఉన్నాయి.  చక్కగా అయిదు పౌండ్లు ఇచ్చి కర్నాక్ గుడికి వెళిపోయాం. 

కార్నాక్ టెంపుల్ ( Karnak Temple )
Karnak Temple
కార్నాక్  ప్రపంచంలోనే పెద్ద గుడి.  ఇంచు మించు 250  ఎకరాలు.  ఇక్కడ  ముగ్గురు తేబిస్ దేవుళ్ళూ ఉంటారు.
Shrine for Amun, Mut n Khonsu
  అంచెలంచెలుగా చాలా మంది ఫారోలు కట్టారు.  ముఖ్యమైన వాళ్ళు నేక్తేనేబో, సెటి, అతని కొడుకు రెండో రామస్సేస్, హత్సేప్సట్, ఆవిడ కొడుకు Tutmosis , Amenhotep  . 
    
      స్పింక్స్ ఎవేన్యు నేక్తేనబో కట్టించాడు.  ఇక్కడ స్పింక్స్లకి శరీరమేమో సిమ్హానిది, మొహం పోట్టేలుది.  ఇది ఆమున్ కి గుర్తు.  
Ram headed sphinx




స్పింక్స్ గడ్డం కింద జాగ్రత్తగా చూస్తే ఒక మనిషి ఆకారం కనిపిస్తుంది.  అది రామస్సేస్సే.   దాని అర్థమేమిటో.  ఆమున్  తనని కాపాడుతున్నాడనా  లేకపోతే తను, ఆమున్ ఒకటేననా.
కింద ఫోటోలో రామస్సేస్ పాదాల దగ్గర ఉన్నది అతని  పట్టపురాణి నేఫర్తరి.

Obelisk of Hatsepsut

Ramasses the second




Hypostyle Hall


మొత్తం 134 స్తంభాలున్న ఈ హాలు సెటి మొదలుపెడితే, రామస్సేస్ పూర్తి చేసాడు. 

గుడి లోని మెయిన్ ఎట్రాక్షన్ మాత్రం స్కరాబ్ (scarab beetle).  పేడ పురుగు.  ఎడ్ఫు, కొం ఓంబో గుళ్ళలో కూడా గోడల మీద దీన్ని చెక్కారు.  ఇది వాళ్ళకి చాలా పవిత్రమైంది.  చేతికి బ్రేస్లేట్ లానో, పెండెంట్ లానో వేసుకునేవాళ్ళు.  దీని వల్ల దిష్టి తగలదని వాళ్ళ నమ్మకం.  కార్నాక్ లో ఉన్న స్కరాబ్ చుట్టూ ఏడు సార్లు తిరిగితే కోరుకున్న వన్నీ జరుగుతాయిట.



  కార్నాక్ గుడి నించి మళ్ళీ  హోటల్ కి గుర్రబ్బండి తీసుకున్నాం. చవకకి చవక సరదాకి సరదా.  రాత్రి కైరోకి ట్రైను.  ఇంకా చాలా టైముంది.   అయిదింటికి లగ్జర్  మమ్మిఫికేషన్ మ్యుజియంకి వెళ్లాం. ఫారోల కాలంలో మనుషులతో పాటు వాళ్ళ పెంపుడు జంతువులని కూడా మమ్మిఫై చేసి వాళ్ళతో బాటు పెట్టేవారు.  పిల్లులు, మొసళ్ళు, కోతులు, చాపలు, తాబేళ్లు, కుక్కలు  ఇలా చాలా జంతువులని ఎమ్బాం చేసారు.  ఇంకా మమ్మిఫికేషన్ ప్రక్రియ, మనిషి పోయిన తరువాత వాళ్ళు అనుసరించే పద్ధతులు తెలుకుకోవచ్చు.

           రాత్రి గీజా (Giza) కి ట్రైన్ తీసుకున్నాం.  ఫస్ట్ క్లాస్ కూపేలో రాత్రి భోజనం మళ్ళీ పొద్దున్నే టిఫిను వాళ్ళే ఇస్తారు.   కైరోలో హోటల్  బుక్ చేసుకున్నాం.  కైరోలో దిగితే హోటల్ నించి గీజా బాగా దూరమైపోతుంది కాబట్టి గీజా స్టేషన్ కే డైరెక్ట్ గా వాన్ తీసుకువచ్చేస్తానంది మా గైడ్.  తరవాత రోజు పిరమిడ్ల టూరు. 


        ఖర్చులు                                       యుఎస్ డాలర్లలో       ఈజిప్టియన్ పౌనలో

      హాట్ ఎయిర్ బల్లూన్ రైడ్                         260                         ___

      గైడ్, లగ్జర్  టెంపుల్                                 ___                          50
               

Saturday 3 September 2011

Egypt - Aswan

 
  
 
ప్రతి సంవత్సరం న్యు ఇయర్  కి ఏదో ఒక కొత్త  ప్రదేశం చూడటం అలవాటు.  అలాగే ఈ ఏడాది కూడా చూడాలనుకున్న ప్రదేశాల లిస్టు  తాయారు చేయటం మొదలు పెట్టగానే నన్ను చూడలేదంటే నన్ను చూడలేదని పక్కనున్న నేపాల్ నించి ఎక్కడో వున్న బ్రజిల్ దాక కొట్టుకోవటం మొదలెట్టాయి.  

         ఏ ముహూర్తాన తాజ్ మహల్ తో మొదలు పెట్టామో కాని,  అప్పటి నించి ఏక బిగిన ఏడేళ్ళుగా చూసిన సమాధి చూడకుండా  సమాధులు  చూస్తూనే ఉన్నాం.   ఇన్నేళ్ళుగా వస్తున్న పరంపర కొనసాగించకపోతే బావుండదు కనక ఇసారి సమాధులకి  రారాజైన ఈజిప్ట్ కి వోటేసాం. 
                 
        అంతే.  వెంటనే గూగులాంబ నన్ను ఆవహించింది. లేడికి లేచిందే పరుగు సామెతలా లేప్టాప్ దగ్గరికి పరిగెత్తి  ఈజిప్ట్ లో చూడదగ్గ ప్రదేశాల దగ్గరనించి, హోటల్స్ ఆఖరికి తెచ్చుకోవాల్సిన సువనీర్స్  దాక వెతికేసా.  డెసర్ట్ సఫారి  చెయ్యాలనుకున్నా కాబట్టి లోకల్ గైడ్ మెయిల్ ఐడి కూడా వెతికి పట్టి నేననుకున్న ప్రేదేశాలన్ని చూపించకలడో లేదో కనుక్కుందామని ఒక మెయిల్ పడేసా.  ఈ ప్రహసనం ఓ వారం రోజులు నడిచింది. మంచి క్లారిటీ వచ్చింది. గూగులాంబ శాంతించింది. నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చా. పాపం మా ఆయన వారం నించి తిండి లేక డొక్కలు అతుక్కుపోయి సోమాలియాని సాక్షత్కారిమ్పచేసారు.  ఓరి బాబోయ్ ఇదేమిటి ఈజిప్ట్ అనుకుంటే సోమాలియా ప్రత్యక్షమైంది అని భయపడి వారం తిండి ఒక్క రోజులోనే తినిపించేసి ఎలా అయితేనే మళ్ళి మామూలు రూపానికి తెచ్చేసా.  ఇంక ఈజిప్ట్ వెళ్ళటమే తరువాయి.

       ఆస్వాన్, లక్షర్, కైరోలని బేస్ గా పెట్టుకున్నాం.  ప్రయాణంతో కలిపి మొత్తం తొమ్మిది రోజుల ట్రిప్పు.  గల్ఫ్ ఎయిర్ లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నాం. డిసెంబెర్ చివరి వారం ప్రయాణం .  పొద్దున్న నాలుగింటికి చెన్నైలో విమానం ఎక్కాం .   బహ్రెయిన్ లో మూడు గంటల స్టాప్ ఓవర్ తర్వాత కైరోకి విమానం మారాలి.  అక్కడ నాలుగు గంటల స్టాప్ ఓవర్.  కైరో నించి డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుని ఆస్వాన్ చేరుకున్నాం. ఆస్వాన్ చేరేసరికి లోకల్ టైం రాత్రి ఏడైంది.  మా ఒళ్ళు  పులుసైంది....      

              ఈజిప్ట్ ఇండియా కంటే మూడున్నర గంటల వెనకాల ఉంది.  ' Isis corniche' హోటల్ లో చెకిన్  చేసాం.   ఫ్రెషప్ అయి బయట రొట్టెలు, నిమ్మకాయ ఊరగాయ ( ఊరపెట్టిన నిమ్మకాయలు అనాలేమో ), ఊరపెట్టిన కూరగాయ ముక్కలు, పెరుగు కొనుక్కుని  డిన్నర్ తిన్నాం.

     తర్వాతి రోజు పొద్దున్నే అబూ సిమ్బెల్ కి గైడెడ్ టూర్.     ఈజిప్ట్ లో టూర్లన్నీ కైరోలో ఉన్న గోల్డెన్ టూర్ ఆపరేటర్స్  ద్వారానే తీసుకున్నాం. 
 
డే 0         :  ఆస్వాన్
డే 1         :   ఆస్వాన్ - అబూ సిమ్బెల్, ఫిలె టెంపుల్, హై డాం
డే 2         :   ఆస్వాన్ - ఎడ్ఫు, కొం ఓంబో
డే 3         :   ఆస్వాన్ -  న్యూబియన్ విలేజ్
డే 4         :   లక్షర్    
డే 5, డే 6  :   కైరో
డే 7, డే 8  :   బహారియా ఒయాసిస్
 
 

  అబూ సిమ్బెల్ - Abu Simbel
            
                అబూ సిమ్బెల్ కి సొంతంగా వెళ్ళటానికి లేదు. పోలీసు కాన్వోయ్ తోటే వెళ్ళాలి. పొద్దున్న నాలుగున్నరకి ఒక కాన్వాయ్, పదకొండింటికి ఒక కాన్వాయ్  బయల్దేరతాయి.  సూడాన్ బోర్డర్ దగ్గర ఉండటంతో ఈ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. పొద్దున్నే మూడుమ్పావుకల్లా వాన్  వచ్చేసింది. హోటల్ వాళ్ళే టిఫిన్ ప్యాక్ చేసి ఇస్తారు.  కాన్వాయ్ తో వెళ్ళాల్సిన బళ్ళన్నీ ఒక పాయింటు దగ్గర చేరాయి.   అక్కడ దాదాపు గంట సేపు వెయిట్ చేసాం.

Meeting Point for all the vehicles
                

            కాఫీ స్టాల్ దగ్గర కాఫీలు, టీలు తాగాం.  నాలుగున్నరకి కాన్వాయ్ బయలు దేరింది.


Sunrise



అబూ సిమ్బెల్ చేరేసరికి 8.30అయింది.  చుర్రుమని మొహం మాడిపోయే ఎండ.  ఎడారిలో ఇదే విచిత్రం. రాత్రంతా చలి, పగలంతా ఎండ. అసలే అంత పొద్దున్నే ఎండ వల్ల చిరాగ్గా ఉంటే, గైడ్ కాస్తా ఎగ్గొట్టేసాడు.  గైడ్ ఏడని మా టూర్ ఏజెంట్ కి ఫోన్ చేసి అడిగితే , ఆపద్ధర్మ గైడ్ ని కుదిర్చారు. అతను మామీదేదో మెహర్బానీ చూపించినట్లు పావుగంటలో గడగడా అప్పచెప్పేసి తుర్రుమన్నాడు. మా డ్రైవర్ చుట్టూ చూడటానికి గంటన్నర టైము ఇచ్చాడు . ఆ టైము తరవాత కాన్వాయ్ తో బాటు మళ్ళీ తిరుగు ప్రయాణం. .    


Abu Simbel Temple


       క్రీస్తుపూర్వం  పదమూడవ శతాబ్దంలో అప్పటి ఫారో రామసెస్-2 ( Ramases ) కట్టించాడు.  ఇరవై  ఏళ్ళు పట్టిందిట కట్టడానికి.  "ర" ( Ra - Sun god ), "ఆమున్ " ( Amun - king of gods - great god of Thebes), "ట " ( Ptah - creator god of Memphis) అనే ముగ్గురు దేవుళ్ళని ప్రతిష్టించాడు. నైల్ నది ఒడ్డున కట్టారు. కొండల్లోకే విగ్రహాలన్నీ చెక్కారు. ఆస్వాన్ హై డాం కట్టినప్పుడు నాసర్ (Nasser ) అనే చెరువు ఏర్పడింది.  దాంట్లో  ఈ గుడి కాస్తా మునిగిపోయింది. యునెస్కో ప్రోద్బలంతో గుడిని ముక్కలుగా విరగ్గొట్టి, నెంబర్లు వేసి వెలికి తీసి పక్కనే కాస్త ఎత్తుగా ఉన్నచోట మళ్లీ నెంబర్ల ప్రకారం ముక్కలన్నిటిని పేర్చారు. కొండ ముక్కల్ని వేలికితీయటం కష్టం కాబట్టి విగ్రహాల వెనకాల ఆర్టిఫీషియల్ గా ఓ కొండని తాయారు చేసేసారు.

    


 పేరుకి సూర్యుడి గుడే అయినా అంతా రామసెస్ మయం. గుడి బయట కనిపించే విగ్రహాలన్నీ రామసెస్ వే. అతని కాళ్ళ మధ్యలో ఉన్న చిన్న విగ్రహాలు పట్టపురాణి అంటే నెఫర్టరి ( Nefertari ) , రాజ మాత, కొడుకులు, కూతుళ్ళవి. గుడి లోపలి హాలులో మళ్ళీ రామసెస్ విగ్రహాలు రకరకాల దేవుళ్ళ రూపాల్లో దర్శనమిస్తాయి. గోడల నిండా రామసెస్ యుద్ధాలు, విజయాలు, దేవుళ్ళు ప్రసన్నమయిపోయి అతన్నిదీవించటం, అతన్నే రాజుగా పట్టాభిషేకం చేయటం లాంటి బొమ్మలు చెక్కారు.

     గర్భగుడిలో ముగ్గురు దేవుళ్ళూ , రామసెస్ పక్కపక్కనే కూర్చున్న విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫెబ్ ఇరవై ఒకటిన, అక్టోబర్ ఇరవై ఒకటిన విగ్రహాల మీద సరాసరి సూర్యకిరణాలు వచ్చి పడతాయి.( గుడి తూర్పు ముఖంగా ఉంటుంది). ఆ రోజుల ప్రాముఖ్యత తెలీదు కాని, రామసెస్ పుట్టినరోజు, పట్టాభిషేకం అయిన రోజు అయిఉన్దచ్చు అని గైడ్ చెప్పాడు. ఇప్పుడు గుడి పోసిషన్ మారింది కాబట్టి సూర్య కిరణాలు ఒక రోజు ఆలస్యం గా పడతాయి. విచిత్రం ఏమిటంటే నాలుగు విగ్రహాలు పక్కపక్కనే ఉన్నా, ptah మాత్రం చీకట్లోనే ఉంటాడు. అతను గాడ్ అఫ్ అండర్ వరల్డ్ ట.  అంటే నా ఉద్దేశం పోయిన తరవాత జరిగే ప్రయాణానికి దేవుడేమో.


  తన గుడి పక్కనే తన భార్య నెఫర్టరికి కూడా ఓ గుడి కట్టి పెట్టాడు. దాన్ని టెంపుల్ అఫ్ హాతోర్ ( Temple of Hathor ) అంటారు.  హాతోర్  కౌ గాడెస్ (cow goddess ) ట.  ఈ గుడి బయట కూడా రామసెస్, హాతోర్ రూపంలో ఉన్న నేఫెర్తరి విగ్రహాలు ఉన్నాయి. 


Temple of God Ra n Ramasses -2 and Temple of Hathor n Nefertari

      ఇచ్చిన  టైము గంటన్నర అయిపోయాక  ఆస్వాన్ కి తిరుగు ప్రయాణం అయ్యాం.  మళ్ళీ నాలుగు గంటల ప్రయాణం.


Enroute to Aswan from Abu Simbel

ఆస్వాన్ వెళ్ళేసరికి రెండైంది. ఇంకా  చూడాల్సిన ప్రేదేశాలు ఉన్నాయి. మా డ్రైవర్ తనే లంచ్ కొని తేచ్చేసాడు. వాన్ లోనే కూర్చుని తినేసి, కాళ్ళు కాస్త సాగతీసుకుని , తిరిగి ఇంకో చెత్త గైడ్ సారీ కొత్త గైడ్ తో బయల్దేరాం.
           
                     ఇంకా చూడాల్సినవి- పూర్తి అవ్వని ఒబెలిస్క్ (unfinished obelisk) , ఆస్వాన్ హై డాం, ఫిలె టెంపుల్.  ముందు డాం, గుడి చూసేద్దాం తరవాత టైం ఉంటే ఒబెలిస్క్ చూద్దాం అన్నాం గైడ్ తో. మా టూర్ నాలుగింటి కల్లా అయిపోతుంది. అలా కాదు ముందు ఒబెలిస్కే చూపిస్తా అది చూడకపోతే మీ జీవితమే  వృధా అన్నట్టు మాట్లాడింది. కుదరదని మేము మొండికేస్తే  ఇంక గతి లేక  dam  కి తీసికెళ్ళింది. ఫోటోలు తీస్తానని మొదలుపెట్టింది. ఇంక  తీసిన ఫోటోలు చాలు, కాస్త dam గురించి చెప్పవమ్మా అంటే అప్పుడు తెలిసింది ఈవిడ గారికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదనీ.    this is high dam ok, this is this ok, that is this  ok.    ok ok అనుకుంటూ ఇంకా  ఏదో చెప్పింది కాని ఓకే తప్ప ఒక్క ముక్కా వినిపించల అర్థం కాల. దీనికి తోడు గైడ్ గా ఉద్యోగం లో మొదటి రోజో ఏమో  టెన్షన్ లో పళ్ళు తోముకోవటం మర్చిపోయినట్టుంది. ఆ అమ్మాయికి ఓ దండం పెట్టి అక్కడున్న బోర్డు మీద రాసింది చదువుకుని కాస్త ఇన్ఫో రాబట్టాం.  

ఆస్వాన్ హై డాం ( Aswan High Dam )







1952 లో అప్పటి ప్రెసిడెంట్ నాసర్ డాంకి ప్రపోసల్ పెట్టాడు. సాంకేతికంగా, ఆర్థికంగా  సహాయం చేయమని పశ్చిమ దేశాలని కోరాడు. వాళ్ళ నించి ఎటువంటి సహాయం రాలేదు. చివరికి సోవియెట్ యునియన్ సహాయంతో 1960  లో మొదలు పెట్టాడు. 1971 కల్లా పూర్తయింది. దీని ఎత్తు 111 మీ, పొడుగు మూడున్నర కిలోమీటర్లు, వెడల్పు ఒక కి.  ఇది జల విద్యుత్ కేంద్రమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు  కదా.  దీని వల్ల సాగు భూమి 30 % పెరిగింది. కరంటు సప్లయ్ కూడా రెట్టింపయ్యింది. 
              
              ఈ dam  వల్ల ఏర్పడిందే నాసర్ చెరువు ( lake Nasser ).  మనిషి ఏర్పరచిన చెరువుల్లో ఇది ప్రపంచం లోనే పెద్దది.   500 కి పొడవు, 35 కి వెడల్పు. 


ఫిలె టెంపుల్ ( Philae Temple )


          ఇది ఈసిస్ ( Isis - goddess of magic ) గుడి.  మొదట ఫిలె ద్వీపంలో ఉండేది కనుక ఆ పేరు వచ్చింది.  ఆస్వాన్  డాం కట్టినప్పుడు ఈ గుడి కూడా మునిగిపోయింది. యునేస్కో పదేళ్ళు కష్టపడి  దీనిని కూడా చిన్నముక్కలుగా విడగొట్టి, పక్కనే ఎత్తుగా ఉన్న ఎగిల్కియా ద్వీపాన్ని ఫిలె లా కనిపించేటట్టు తాయారు చేసి, ముక్కల్ని  అక్కడ అసెంబుల్ చేసింది. 










Goddess Isis nursing her son Horus

   ద్వీపం కాబట్టి బోటులో తీసుకువెళతారు.  పన్నెండో టోలమీ ( Ptolemy the 12th ) కట్టించాడు.  మొత్తం రెండు pylons.  మొదటి పైలాన్ మీద టోలమీ దేవతలకి నైవేద్యం ఇస్తున్నట్టు,  శత్రువుల మీద దాడి చేస్తున్నట్టు  చెక్కారు.  లోపల పెద్ద సావిడి , చిన్న గుళ్ళు చాల ఉన్నాయి.  ఈసిస్, ఒసైరిస్, హతోర్, బెస్ కి గుళ్ళు ఉన్నాయి.   ఒక మమిస్సి కూడా ఉంది. అంటే పురిటి గది.  ఈసిస్, ఒసైరిస్ కొడుకు హోరస్ పుట్టిన గది.  ఈ గుడి ఒసైరిస్ సమాధి కూడా. 



      ఖర్చులు                         యుఎస్  డాలర్లలో                ఈజిప్టియన్ పౌన్లలో

     టూర్                                        280                                   __

     గైడ్ టిప్                                    ___                                   100 * 2  గైడ్లు

    డ్రైవర్ టిప్                                  ___                                 100


Edfu, Kom Ombo


   వీటి గురించి చెప్పే ముందు కొంచెం ఈజిప్టియన్ దేవుళ్ళ గురించి చెప్తా.




 Ra (సన్ గాడ్) మన  బ్రహ్మ దేవుడి లాగా సృష్టికర్త.   జబ్, నూట్ లని సృష్టించాడు. వాళ్ళకి నలుగురు పిల్లలు. ఈసిస్, ఒసైరిస్, సెత్, నెఫ్తిస్.  ఈజిప్ట్ లో రాజ్యం బైటవాళ్లకి వెళ్ళకుండా పూర్వం అక్కా తమ్ముళ్ళు, అన్నాచెల్లెళ్ళు పెళ్ళి చేసుకునే ఆచారం ఉంది.  ఈసిస్ తన తమ్ముడు ఒసైరిస్ ని, సెత్ తన చెల్లి నెఫ్తిస్ ని పెళ్ళి చేసుకోవాల్సొచ్చింది. ఈసిస్, ఒసైరిస్ కి హోరస్ అనే కొడుకు పుట్టాడు.  సెత్ కి పిల్లలు లేరు.  రాజ్యం లేదు, వారసులు లేరు,  దానికి తోడు ఈసిస్ బావుంటుందిట.   నెఫ్తిస్ కోతిలా ఉంటుందిట. దీంతో సెత్ కి ఒసైరిస్ అంటే కుళ్ళు.  ఒసైరిస్ని ముక్కలు ముక్కలుగా నరికేసి నైల్ లో విసిరేసి తను రాజైపోయాడు.  ఈసిస్ ముక్కలన్నిటిని వెతికి ఫిలె గుడిలో సమాధి చేసింది. ఫిలెలో ఒసైరిస్ సమాధి కూడా ఉందని చెప్పా కదా.

   పసిపిల్లాడ్ని చంపటానికి చేతులు రాక  భటులు హోరస్ ని ఎడారిలో వదిలేస్తారు.  అక్కడ హాతోర్ ( cow goddess) హోరస్ కి పాలిచ్చి పెంచుతుంది. హోరస్ పెద్దయ్యాక తన మేనమామని చంపి పగ తీర్చుకుంటాడు.  ఈ యుద్ధంలో హోరస్ కి ఓ కన్ను పోయింది.  దేశ రక్షణ కోసం కన్నుని అంకితం చేసాడు కనక ' horus eye ' కి చాలా  సీన్ ఉంది.

 ఈ కధంతా వింటుంటే కృష్ణుడు, కంసుడు కధ గుర్తొస్తోంది కదా. 


ఎడ్ఫు ( Edfu ) :

Edfu


ఈ హోరస్ గుడిని మూడో టోలమీ ( Ptolemy the third) కట్టించాడు.  బైట పైలాన్ మీద చెక్కిన బొమ్మలు యుద్ధం చేస్తున్న టోలమీ, దీవిస్తున్న హోరస్, హాతోర్ వి.   హోరస్, సెత్ యుద్ధం ఈ ప్రదేశం లోనే జరిగిందని చెప్తారు.         


         గుమ్మానికి కుడివైపున ఉన్న డేగ శిల్పమే హోరస్.



జాగ్రత్తగ్గా చూస్తే గుమ్మం పైన బంతి లాంటి ఆకారం కనిపిస్తుంది.




బంతి లాంటి ఆకారం సూర్యగోళం (అంటే god Ra ), రెండు పాములు, రెక్కలు. రెక్కలు రాబందుని సూచిస్తుంది. ఇది టోలమీ కాలం నాటి రాజ ముద్రిక ( government emblem). రాబందు ఎగువ ఈజిప్ట్ (upper egypt) ని సూచిస్తుంది. అంటే టోలమీ తను ఎగువ ఈజిప్ట్ కి రాజుని అని చెప్పుకోవటం.

Ptolemy sprinkling salt on the construction site to ward off evil eye

       గుడి లోపల గోడల మీద టోలమీ  బొమ్మలు చాలా చెక్కారు.




Ptolemy carrying bricks



 

Goddess with flower on her head is goddess of architecture, blessing Ptolemy
 
 

 
 హోరస్ విగ్రహం  గర్భగుడి లో పెడతారు. హోరస్ ని ఊరేగించే పడవ కూడా అక్కడే పెడతారు. ప్రస్తుతం దాని రెప్లికా మాత్రమే ఉంది.  ఒరిజినల్ పడవ, హోరస్ విగ్రహం కైరో ముజియం లో ఉన్నాయి. 
 

Stairway through which the diety was carried upstairs

 
పూజర్లని చూసారా. మెట్లకి రెండు వైపులా ఉన్నవాళ్ళు.  అచ్చు మన పూజార్లలానే ఉన్నారు కదా. 
 


Horus's Eye which he lost in the war with Seth


 
ఇంకా గుడిలో చాలా స్టోర్రూమ్స్  ఉన్నాయి.  వాటిల్లో బంగారం, వెండి నగల దగ్గరనించి, మందులు,  బట్టలు, తిండి, వైన్, తేనె, నీళ్ళు లాంటి పదార్ధాల దాకా అన్నీ దాచేవారు.  ఆ గదిలో పెట్టే పదార్థాలను బట్టి గోడల మీద బొమ్మలు చెక్కారు.  
 
ఇంకా అప్పటి రాజ్యం మ్యాప్ ( ఇళ్ళు, నైల్ తో సహా) కూడా చూడచ్చు.  
 
 
Map dipicting Nile, houses, canals, fields

 
 మన నదులన్నీ స్త్రీలింగాలే.  కాని నైల్ ని  మాత్రం masculine, feminine రెండూ రూపాల్లో  చెప్తారు. 
 

Male and Female figures dipicting the masculine and feminine forms of Nile


 
Heiroglyph
 
 
ఇది ఫారోనిక్ భాష.   మనుషుల, జంతువులు, పక్షులు, వస్తువుల రూపాల్లో సృష్టించుకున్న భాష.  దీన్ని మామూలుగా కుడి నించి ఎడమవైపుకి చదవాలిట.   కాని కొన్ని సందర్భాలలో మాత్రం ఎడం నించి కుడికి చదువుతారు.   పక్షులు, జంతువులు, మనుషులు ఎటు వైపు చూస్తూఉంటారో అటు నించి మొదలు పెట్టాలి.

క్రైస్తవ మతం  వచ్చిన తరువాత  non christian worship ని  ban  చేసి గుడిని  పాడుచేసేసారు.  అప్పటి నుంచి గుడి నిరుపయోగంగా పడుంది.



కోం ఓంబో (Kom Ombo)

ఈ గుడిని నాలుగవ టోలమీ ( Ptolemy the fourth ) కట్టించాడు.
 
Kom Ombo
 
 
 
కోం ఓంబో అంటే బంగారు పర్వతం అని అర్థం.   అరబిక్ లో 'కోం' అంటే పర్వతం, ఫారోనిక్ భాషలో 'ఓంబో' అంటే బంగారం.  ఆస్వాన్ చుట్టుపక్కల బంగారం బాగా దొరికేదట.  ఈ బంగారాన్ని   Luxor కి ఎగుమతి చేసేవారుట. ఇసుక తుఫాన్లు వచ్చినా కూడా  గుడి బాగా ఎత్తులో ఉండేటప్పటికి ఎడారి ఇసుకలో కూరుకుపోలేదు.   వేల ఏళ్ల నుండీ వానలు, వరదల వల్ల గుడి దాదాపు శిధిలమైపోయింది.  ఎడ్ఫు ఇసకలో కప్పపడిపోవటం వల్ల తుఫాన్లు వాటి నించి రక్షింపపడింది.

    ఈ గుళ్ళో ఇద్దరు దేవుళ్ళని చూడచ్చు.  ఒకడు  హోరస్, రెండోవాడు సోబెక్ (Sobek- crocodile god).

  ఫిలె, ఎడ్ఫు, కోం ఓంబో-  ఈ మూడు గుళ్ళలో కూడా దేవుడు హొరస్సె.   కాని మూడు  గుళ్ళలో మూడు రూపాల్లో ఉంటాడు.  అంటే అన్నీ విష్ణుమూర్తి అవతారాలే అయిన కృష్ణుడి గుడి, వెంకటేశ్వరుడి గుడి సపరేట్ గా ఉన్నట్టు.

ఫిలె గుడి లో ఉన్నది - son god ( అక్కడ మమ్మిసి ఉంది. )
ఎడ్ఫు లో ఉంది         - revenger god ( తన మేనమామ "సెత్" ని చంపి తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. 

కోం ఓంబో లో ఉంది - doctor god

నైల్ మొసలి ఆరు మీటర్లు పెరిగేది.  చాల మంది మొసళ్ళ బారినపడి చనిపోతూ ఉండేవారు.  ఇంక వాళ్ళని చంపద్దని మొసలికి   దైవత్వం ఇచ్చి" సోబెక్ " అని నామకరణం చేసి గుడి కట్టారు.

  ఇక్కడ ఉన్నది డాక్టర్ గాడ్ కాబట్టి ఈ గుడి ఒక ఆసుపత్రి.  హోరస్ అందరి జబ్బులు నయం చేసేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకోవటం తో  సోబెక్ కి హోరస్ తో గుడి షేర్ చేసుకోవటం నచ్చక హోరస్ ని బైటకి పంపించేస్తాడు.  అందరు  జబ్బులతో,  కరువు కాటకాలతో  చాలా బాధ పడ్డారు.  తిరిగి హోరస్ కి సారీ చెప్పుకుని వెనక్కి పిలవాల్సి వచ్చింది.

        ఇది ఆసుపత్రి కాబట్టి గోడల నిండా కత్తిర, స్కాల్పెల్, పళ్ళ డాక్టర్ వాడే పరికరాలు, బోన్ సా, సక్షన్ కాప్ లాంటి పరికరాలు, మందుల తూకానికి బేలెన్స్ లాంటివి చెక్కారు.  ఇంకా ఇది టోలమీ కట్టించాడు కాబట్టి తనని దేవతలు దీవిస్తున్నట్టు, తనకి దేవతలు పట్టాభిషేకం చేస్తున్నట్లు గోడల నిండా చెక్కిన్చుకున్నాడు.


 
 

Gods crowning the Pharoah



Surgical instruments and a lady in labour
ఫారోనిక్ కాలం లో మెడిసిన్ బాగా అభివృధి చెందింది.
 
ఇంకా ఆ కాలంలో వాళ్ళు ఫాలో అయ్యే క్యాలెండరు కూడా ఉంది.
 

Nile Calendar

 
క్యాలెండరు లో రెండో తారీఖు  నించీ చూడచ్చు.  మొదటి తారీఖు  చెరిగిపోయింది.  మొత్తం 365 రోజులు.  3 కాలాలు. ఒకొక్క కాలానికి 4 నెలలు.   నెల కి  3 వారాలు. వారానికి 10  రోజులు.  ఇప్పటికి 360  రోజులు  అయ్యాయి కదా.  సంవత్సరం చివర మిగిలిన 5 రోజులు వస్తాయి.  అవి ఈసిస్, ఒసైరిస్, హోరస్, సెత్, హతోర్ లకి అంకితం చేసారు. 
 
 
 
ఈ మూడు సింహాలు మూడు కాలాల్ని సూచిస్తాయి.

ఇంకో ఇంటరెస్టింగ్ విషయం నైలోమీటర్.  మన రిజర్వాయిర్లలో నీటి మట్టం కొలవటానికి స్కేల్ ఉంటుందికదా.  మనకి ఇప్పుడున్న తెలివితేటలు ఆ రోజుల్లో వాళ్లకి అప్పుడే ఉన్నాయి.   నైలోమీటర్  దిగుడు బావిలా ఉంటుంది.  నీటి ఎత్తుని బట్టి నాట్లు ఎప్పుడు వెయ్యాలో తెలుసుకుంటారు.  నీళ్ళు బాగా లోతుగా ఉంటే నీటి కొరత వల్ల ఇంక ఆ ఏడాది పంటలు ఉండవు.  అంటే కరువు. అదే నీళ్ళు బాగా ఎత్తుగా ఉంటే  రాబోయే వరదని సూచిస్తుంది.  వరదలవల్ల  మంచి సారవంతమైన మట్టి వస్తుంది.  పంటలూ బాగా పండుతాయీ,  పన్నులు కూడా బాగా పడతాయి. 
 
 
Nilometre for measuring the flow of Nile mainly during floods

 
 ఫారోనిక్  కాలంలో రెండు రకాల గుళ్ళు కట్టేవాళ్ళు.  రెగ్యులర్ టెంపుల్, ఫ్యునరరీ టెంపుల్.   సూర్యోదయాన్ని పుట్టుకగా, సూర్యాస్తమాన్ని చావుగా పరిగణించేవారు.  కనక రెగ్యులర్ గుడి తూర్పు వైపు, ఫ్యునరరీ గుడి పడమర వైపు కట్టేవారు.  రెగ్యులర్ టెంపుల్ లో దేవుడు, పూజలు, పునస్కారాలు చేసేవారు.  ఫ్యునరరీ టెంపుల్స్ లో శ్రార్ధ కర్మలు చేసేవారు. కొం ఓంబోలోని ఫ్యునరరీ టెంపుల్ పూర్తిగా శిధిలమైపోయింది.  అక్కడ ఒకప్పుడు గుడి ఉంది అన్న దాఖలాలు కూడా మిగల్లేదు.  మెయిన్ గుడిని రెస్టోర్ చేసేటప్పుడు ఫ్యునరరీ టెంపుల్లో బావున్న శిలాఫలకాలు తీసుకొచ్చి ఈ గుళ్ళో పెట్టేసారు. అలా పొరపాటుగా వచ్చిందే ఈ కింద ప్లాంక్.
 

Plank dipicting after life where snakes are seen blocking the way to heaven

 
 
 
ఇక్కడ ఖాళీ  స్థలంలా  కనిపించేదంతా గర్భగుడి.  మధ్యలోది ముఖ్యమైన దేవుడు అంటే హోరస్, ఇటు అటు చిన్న దేవుళ్ళు.  ఒకడు సోబెక్, రెండోది ఎవరో గుర్తులేదు.  ఆ బండ రాళ్ళు దేవుడు విగ్రహాన్ని పెట్టేందుకు.  ఇప్పుడు గోడలు,  తలుపులు అన్నీ పోయి, దేవుడి విగ్రహాలు మాయమయ్యి బండరాళ్ళు మాత్రం మిగిలాయి.

 తెల్ల చొక్కా వేసుకున్నతను మా గైడ్.  పేరు మట్ హట్.  అత్యద్భుతంగా చెప్పాడు.  మెయిల్ ఐడి ఇచ్చాడు కానీ  ఎక్కడో మిస్ అయిపోయింది.  
     
 ప్రాచిన నాగరికతలు  ఏది తీసుకున్నా అన్ని ఒకటే అనిపించింది.  అవే పంచభూతాలు,  వాటిని ప్రసన్నం చేసుకోడానికి తాపత్రయం,  ఏవిధమైన హాని తలపెట్టే జంతువైనా దానికి దైవత్వం అంటగట్టి పూజించటం, ఇంకా గుళ్ళు కట్టే విధానం, పూజా విధానం, ఉప్పుతో  దిష్టి తీయటం లాంటి  ఆచారాలు, వైద్యం ఒకటేమిటి అన్నీ ఒకేలా ఉన్నాయి.  పిటి ఏమిటంటే అదంతా వాళ్ళకి ఇప్పుడు పాస్ట్ హిస్టరీ.   ఎన్ని వైపులనించి ఎన్ని దండయాత్రలు జరిగినా, ఎన్ని మత మార్పిడిలు జరిగినా మనం ఇంకా మన నమ్మకాలు, పద్ధతులు నిలబెట్టుకోకలగటం మన అదృష్టం.


      ఖర్చులు                      యుఎస్ డాలర్లలో                   ఈజిప్టియన్ పౌన్లలో

     టూర్                                120                                         ___

    గైడ్ టిప్                             ___                                        100

   డ్రైవర్ టిప్                           ___                                         100
  
 
  న్యూబియన్ విలేజ్ ( Nubian Village )
 
మూడో రోజు చూసిన ప్రదేశం పేరు నూబియన్ విలేజ్. నూబియా ప్రపంచంలోనే మొట్టమొదటి సెటిల్మెంట్ అని ఎక్కడో చదివినట్లు గుర్తు. అందుకని చూడాలని ఆశ పడ్డా.  ఇంకోటేమిటంటే అక్కడకి పడవలో మాత్రమే వెళ్ళాలి. ఆ పడవ కూడా ఏ స్టీం బొటో కాదు.  తెరచాప ఉన్న పడవ.  దాన్ని ఫెలూకా ( felucca) అంటారు.  ఎటూ నైల్లో ఫెలూకా లో బోటింగ్  చెయ్యాలనుకున్నా కాబట్టి  రెండూ కలిసి వచ్చేస్తాయి అనుకున్నా.

       మొదటి రోజు ప్రోగ్రాం చెప్తూ నూబియన్ విలేజ్ కి మూడు గంటల టూరు ఉంటుందని, 140 డాలర్లు అవుతుంది కానీ, మాకు కాబట్టి 100 డాలర్లకి (USD) ఎరేంజ్ చేస్తానని మా టూర్ ఆపరేటర్ చెప్పాడు. ఇంకా ఫెలూకా ఎక్కే చోటకి వెళ్ళటానికే కారు లో ఓ పావుగంట పడుతుంది కాబట్టి పికప్, డ్రాప్ కి ఎసి కారు, ఇంగ్లీషు మాట్లాడే గైడు ఇస్తానన్నాడు. కారు డ్రైవర్ కి బోటు వాడికి ఎటూ చెరో యాభై ఈజిప్టియన్ పౌండ్లు టిప్పు, హెల్పెర్లు లాంటి వాళ్లకి ఓ ఇరవై చదివించాలి. వెంటనే ఇంటూ నలభై అయిదు చేసుకుంటే అమ్మో అనిపించింది. కాని అంత గొప్ప ప్లేసు చూడటానికి ఆమాత్రం పెట్టాలిలే అనుకున్నాం. ఎందుకైనా మంచిదని ఆలోచించి చెప్తామన్నాం.

 మా హోటల్ డైనింగ్ హాల్ లోంచి మంచి నైల్ వ్యూ ఉంది. రెండో రోజు టిఫిన్ తినేసిన తర్వాత డైనింగ్ హాల్ బాల్కనిలో నిన్చున్దామని వెళ్ళి గొప్ప డిస్కవరీ చేసా . నైల్ నిండా ఎడా పెడా తిరిగే ఫెలుకాలు, మా హోటల్ వెనకాలే నది లో దిగటానికి మెట్లు.  ఫెలుకా ఎక్కాలనుకుంటున్నాం, హోటల్ వెనకాల మెట్లు చూసా, అటునించి ఎక్కచ్చా అని ఫ్రంట్ ఆఫీసు లో అడిగా.  శుభ్రంగా ఎక్కచ్చు అన్నాడు.  మా వాడు చెవుల్లో పెద్ద పెద్ద పూలు పెట్టాడని అర్ధమైంది. హోటల్ లోంచి బయటకి రాగానే ఇకిలించుకుంటూ కనిపించాడు. అసలే ముందు రోజు పిచ్చి గైడ్లని ఇచ్చాడని కోపంగా ఉన్నానేమో దానిమీద ఈ మోసం కూడా తెలిసేసరికి ఒళ్ళు మండిపాయింది. నీ నూబియన్ టూరూ వద్దూ ఏమి వద్దు మా అంతట మేమే వెళతాం అన్నాం. చెత్త గైడ్లని ఇచ్చినందుకు చెడా మడా పెట్టా.  మొహంలో రంగులు మారిపోయాయి.  మెయిన్ ఆఫీసుకి ఫోను చేసి కంప్లైంట్ చేస్తామని భయపడినట్టున్నాడు. సాయంత్రానికల్లా కాళ్ళ బేరానికి వచ్చాడు. నూబియన్ విలేజ్ కాంప్లిమెంటరీ గా ఇస్తానన్నాడు. వద్దన్నా వినిపించుకోలా.  చివరికి ఎసి కారు లేదు, ఏమి లేదు.  హోటల్ వెనకాలే ఫెలుకా ఎక్కి నూబియన్ విలేజ్  వెళ్ళాం.
 
 



ఇవే మా హోటల్ వెనకాల మెట్లు.  కనిపించే రైలింగే బాల్కనీ.

 
Felucca - the sail boat used since antiquity and The Nile in all its glory


 
Elephantine Island

బోటు ఎక్కీ ఎక్కగానే హెల్పెర్ బెంచి కింద నించి ఓ మూట తీసి మా ముందు పరిచాడు.  పూసల గొలుసులు, గవ్వలతో చేసిన బొమ్మలు,  చెక్క బొమ్మలు ఉన్నాయి.  మనం ఇక్కడ రోజూ చూసేవే.  కొనఖర్లేదు, ఊరికే చూడండని  మాకు వద్దు బాబోయ్ అన్నా వినిపించుకోకుండా ఓ పావుగంట వేస్ట్ చేసేసాడు.  ఈ గోల వదిలేస్తే నైల్ లో బోటింగ్ అదీ ఫెలుకా లో చాలా బావుంది.  చాలా ఎంజాయ్ చేసాం.  గాలి మీద ఆధారపడి వెళుతుంది కాబట్టి కొంచం నెమ్మదిగానే వెళుతుంది.   నూబియా వెళ్ళటానికి మాకు దాదాపు ముప్పావుగంట పట్టింది.  కాని అసలు టైమే తెలీలేదు. 

        ఊరు చేరుకోగానే పడవవాడు మేము ఇక్కడే ఉంటాం, మీరు ఊరు చూసి వచ్చెయ్యండి అని చెప్పాడు. సరే అని ఇద్దరం ఊళ్ళోకి బయల్దేరాం. ఇరవై నిమిషాలు పాటు నడిచిన తరవాత కూడా దుమ్ముకొట్టుకుపోయిన రోడ్లు, చెత్తా చెదారం తప్ప వాళ్ళు-వీళ్ళు చెప్పినట్టు ఎక్కడా అందం కాని, వింతలూ విచిత్రాలు కాని కనిపించలేదు. అసలు వచ్చింది నూబియన్ విలేజ్ కి కాదేమో, దారి తప్పినట్టున్నాం అనుకుని కొంచెం ఇంగ్లీషు వచ్చిన ముసలాయన్ని అడిగాం. నూబియన్ అనేది ఒక ప్రాంతం పేరుకాని ఒక ఊరు పేరు కాదని, మొత్తం పదమూడు పల్లెటూళ్ళు ఉన్నాయని, అన్నిటినీ కలిపి నూబియా అంటారని చెప్పాడు. నూబియన్ ఇళ్ళు చూడాలని వచ్చాం అని చెప్పాం. ఆటో ఎక్కి ఫలానా చోట దిగమని, ఎంత దూరమైనా ఒక ఈజిప్టియన్ పౌండ్ అవుతుందని చెప్పాడు. ఆటో అంటే చిన్న సైజు ట్రాక్టర్ లా ఉంటుంది. వెనక వైపు రెండు బెంచీలు వేస్తారు. బెంచీలు నిండి పోయిన తరవాత మిగిలినవారు నిన్చుంటారు. ఇంకా ఉంటే ఆ బుల్లి ఫుట్ బోర్డు మీదే వేళ్ళాడుతూ ఉంటారు. అచ్చు మన ఇండియన్ సెటప్ లాగా. రెండు పౌన్లు ఇచ్చి వాడు దింపిన చోట దిగిపోయాం. మళ్ళీ ఊళ్ళోకి నడక మొదలు పెట్టాం. చాలా మంది మూగేసారు ఇంటి లోపలి తీసుకెళ్ళి చూపిస్తాం, పది డాలర్లు ఇవ్వమని.   అడుక్కునేవాడి దగ్గర నించి అందరూ డాలర్ల భాషే  మాట్లాడతారు. వద్దని చెప్పి అందరినీ పంపించేసాం.


Nubian Dessert

Typical Nubian Architecture


 మొత్తం ఇసక మేటలు అక్కడక్కడ పచ్చగా పంట పొలాలు.  బావుంది కదా.


Model Nubian House


Typical Nubian House



బయటకి ఇళ్ళు వెరైటీ గా ఉన్నా లోపల మాత్రం మామూలుగానే ఉన్నాయి.  ఒకావిడ నడిగి వాళ్ళ ఇంటి లోపలికి  వెళ్ళాం.  పెద్ద ఓపెన్ ప్లేసు.  ఏవో ఎండపెట్టుకున్నారు.  ఓ రెండు గదులు.   మనకి గోదాము ఆకారం లో కనిపించేది ఎంట్రన్సు మాత్రామే.  నూబియన్ ఆచారాలు, డ్రెస్సింగ్, భాష ఏమీ లేవు.  అంతా ఇస్లామే ఫాలో అవుతున్నారు.  అందరూ అరబిక్ భాషే మాట్లాడుతున్నారు.  ట్రాక్టర్ అదే ఆటో వెళ్ళే రోడ్డు తప్ప వేరే ఎక్కడా సిమెంట్ రోడ్లు కాని, తార్ రోడ్లు కాని లేవు.  చెత్తా, చెదారం, పేడ, పెంటలు,  కుక్కలు, కిళ్ళీ ఉమ్ములు, రోడ్లమద్ధ్యలో మురిక్కాలవలు, దుమ్ము- అసహ్యమేసింది.  ఇంగ్లీషు వాళ్ళని పట్టుకుని కొట్టాలి.  ఏది చూసినా వింతే.  వాళ్ళ రివ్యూలు చదివి  ఏదో ఊహించుకున్నానేమో ఇంక ఈ సుందర దృశ్యాలు తట్టుకోవటం కష్టమనిపించి కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి బయలుదేరాం.   మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తిరిగి వెళ్ళేటప్పుడు ఆటో వాడు లోకల్స్ కే రూపాయి, బైట వాళ్లకి పది రూపాయలని చెప్పి  ఇరవై పౌన్లు లాగాడు. 

           నూబియా బాలేకపోయినా నూబియన్ జీవితాన్ని ప్రతిబింబించే బొమ్మలు కొన్నా. అవి మాత్రం చాలా బావున్నాయి.  ఆ ఫోటోలు తొందర్లోనే పోస్టు చేస్తా. 

        మొత్తానికి ఆస్వాన్ లో మూడు రోజులు చాలా బాగా గడిచిపొయినాయి.  మధ్యాహ్నం మూడింటికి ట్రైన్ తీసుకుని  లక్షర్ బయలుదేరాం.  లక్షర్ చేరేటప్పటికి ఏడైంది.  ఇక్కడ ఒక రోజే.  మెయిన్ గా ఈ ఊరు ప్లాన్ చేసింది హాట్ ఎయిర్ బలూన్  రైడ్ కోసమే.  రైడ్  పొద్దున్నే ఆరింటికే ఉంటుంది కాబట్టి  అదయిపోయిన తరువాత  ఎటూ టైం  ఉంటుంది కనక  గుళ్ళు, గోపురాలు చూడచ్చనుకున్నాం.   ఆస్వాన్ లో మామూలు స్వెటర్ సరిపోతుంది కానీ లక్షర్ లో చలి ఎక్కువే.  మఫ్లర్లు  లాంటి కూడా పెట్టుకుంటే మంచిది. 

        చెకిన్ చేయగానే మా టూర్ ఆపరేటర్ కి ఫోన్ చేసాం.  అతనొచ్చి  బాగా మంచు పడుతుండటంతో ఏమీ కనిపించదని  ఆ రోజు రైడ్ కాన్సిల్ అయిందని, రేపు కూడా డౌటు గానే ఉందని బాంబు పేల్చాడు.  బలూన్ రైడ్ ఉండేటట్లు చేయమని అసలు దైవ భక్తే లేని నేను దేవుళ్ళు అందరినీ  గుర్తు తెచ్చుకుని మరీ దండాలు పెట్టుకుంటూ కూర్చున్నా.