Saturday 14 September 2013

Italy - Sorrento

  సొరెంటో చాలా అందమైన ఊరు. లోకల్ జనాభా తక్కువే.  అందరూ టూరిస్ట్లే.   నేపుల్స్, ఎమల్ఫి, హెర్క్యులేనియం లాంటి చాలా టూరిస్ట్ ప్రదేశాలకి ఇది సెంటర్ పాయింట్.  వీటితో పాటు వెసూవియస్ ( Mt. Vesuvius ) అనే అగ్ని పర్వతం కూడా దగ్గరలోనే ఉంది.  ఇది కూడా ఏక్టివ్ వొల్కెనొనె.   ఇది చివరి సారి డబ్భై ఏళ్ళ క్రితం బద్దలైంది.  లండన్ నించి  ఫ్లైట్ లో వచ్చేటప్పుడు వెసూవియస్ ఏరియల్ వ్యూ కనిపిస్తుంది.   మాకు ఫ్లైట్ లోంచి కనిపిస్తుందని తెలీక  కెమెరా రెడీగా పెట్టుకొలేదు.  తెలిసిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారు.

     ఇక్కడ నిమ్మ, కమలా తోటలు  చాలా ఎక్కువ.  రోడ్లకి రెండు వైపులా కమలా చెట్లే.   ఎక్కడ చూసినా లెమన్ ఐస్ క్రీం, లెమన్ లిక్యూర్ లే.  మాకు సొరెంటోలో హోటల్ దొరకలేదు.  పక్కనున్న సెయింట్ ఎన్యెల్లొ ( St. Agnello ) అనే ఊళ్ళో "కాసా వియన్న" అనే బి&బిలో ఉన్నాం.    
             
 

రూంకి ఫ్రెంచ్ డోర్స్, పెద్ద బాల్కనీ, బాల్కనీ లోంచి అదిరిపోయే వ్యూ.  కమలా, నిమ్మ తోటలు, అడపా దడపా వెళ్ళే రైళ్ళు, దూరంగా వెసూవియస్ పర్వతం. 

 
   ఒకటవ శతాబ్దంలో వెసూవియస్ అగ్నిపర్వతం బద్దలవటం వల్ల పాంపే, ఎర్కొలానో అనే ఊళ్ళు లావాతో పూర్తిగా కప్పపడిపోయాయి.   పంతొమ్మిదో శతాబ్దం తవ్వకాలలో బయటపడ్డాయి.   రెండు ఊళ్ళూ ఒకే రోజులో చూసెయ్యచ్చు.   పాంపె నించి హెర్క్యులేనియంకి ట్రైనుంది.

పాంపె : ( Pompeii )

సెయింట్ ఎన్యెల్లొ నించి పాంపెకి డైరెక్ట్ ట్రైన్ ఉంది.  
   
     రోమన్ కాలంలో పాంపె ముఖ్యంగా వ్యాపార కేంద్రం.  ప్లాన్డ్ ఊరు.  ఫుట్ పాత్లు, మంచి రోడ్లు, అపోలో జూపిటర్ వీనస్ గుళ్ళు, పబ్లిక్ స్నానాల గదులు, జిమ్, ధనవంతలవి మండువా ఇళ్ళు, మధ్య తరగతి వాళ్ళవి కొంచెం చిన్న ఇళ్ళు, స్లేవ్స్ వి విడిగా క్వార్టర్స్,  మంచినీళ్ళకి మునిసిపల్ కొళాయిలు అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.  పెద్ద పెద్ద మండువా ఇళ్ళలో విడివిడిగా వంటిల్లు, బెడ్ రూములు, బాత్ రూములు ఉన్నాయి.
  
   అగ్నిపర్వతం కంటే ముందే భూకంపం వచ్చిందిట.  దాంతోనే చాలా ఊరు నాశనమైపోయిందిట.  దాన్నించి కోలుకోకుండానే అగ్నిపర్వతం బద్దలై ఊరంతటినీ కప్పేసింది.  బూడిదతో కప్పపడిపోయి గాలి తేమ లేకపోవటం వల్లే ఏదీ చెక్కుచెదరలేదుట.  వాళ్ళు వాడిన మట్టి పాత్రలు కూడా ఎగ్జిబిట్ చేసారు.  మనుషుల జంతువుల శవాలు కూడా కొంచెం కూడా పాడవలేదు.   చనిపోయినప్పుడు ఏ భంగిమలో ఉన్నారో ఇప్పుడు కూడా అలానే చూడచ్చు.   తవ్వకాలు జరిగినప్పుడు శవాలలో సూట్ తీసేసి ప్లాస్టర్తో నిమ్పారు.

Streets of Pompeii


Temple of Jupiter

పాంపెలో అండర్ గ్రౌండ్ సుఏజ్ సిస్టం లేదు.   మురికి నీళ్ళన్నీ రోడ్ల మీదనించే ప్రవహిస్తాయి.  రోడ్డు క్రాస్ చేసేవాళ్ళకి  కాళ్ళకి మురికి అంటకుండా ఉండటానికి రోడ్డు మీద మధ్యమధ్యలో బండ రాళ్ళు పరిచారు రెండు ఫుట్ పాత్లు కలుపుతున్నట్లు.  రధం చక్రాలు పట్టటానికి వీలుగా  రాళ్ళ మధ్యలో దారి వదిలిపెట్టారు.     
      ఇక్కడున్న ఏమ్ఫిథియేటర్ మొట్టమొదటిది.  తరవాతది రోమ్ లో ఉన్న కొలోస్సియం.  ఇది గ్లాడియేటర్ ఆటలకి వాడేవాళ్ళు.  దీనితో పాటు లిటిల్ థియేటర్, గ్రాండ్ థియేటర్ అని ఇంకో  రెండున్నాయి.  ఇవి  మాత్రం కల్చరల్స్ కి వాడేవారు.


Grand Theatre
Little Theatre














Amphitheatre from outside














 








ఎర్కోలానో ( Herculaneum ) :


         
      హెర్క్యులీస్ కనుక్కున్నాడు కాబట్టి దీనికి అతని పేరు పెట్టారు.  రోమ్ పాంపెలో ఉండే  డబ్బున్న వ్యాపారస్తులకి ఇక్కడ సమ్మర్ హౌసెస్ ఉండేవిట.  ఇళ్ళు చాలా పెద్దవి.  ఇళ్ళలో వేసిన పాలరాయి, మొసైక్ ఇప్పటికీ పాడవకుండా ఉన్నాయి.  
 
 
  
 
 
 
 
 
 
 
 
Thermopolium
పోమ్పె లాగానే ఇక్కడ కూడా జిం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి విడివిడిగా స్నానాల గదులు, లాండ్రీ షాపులు, వైన్ షాపులు ఉన్నాయి.   షాపులకి స్లయిడింగ్ తలుపులు ఉన్నాయి.  ట్రాఫిక్ ని  కంట్రోల్ చెయ్యటానికి కొన్ని రోడ్లు వన్ వే చెసారు.  అంతే కాకుండా ఇంటర్ సెక్షన్స్లో సిమెంట్ దిమ్మలు స్లోడౌన్ సైన్లుగా పెట్టారు.  వైన్, ఫుడ్ వేడిగా ఉంచటానికి షాపుల్లో అవెన్లు ఉంచేవాళ్ళు.  ఈ షాపుల్ని థర్మోపోలియం అనే వారు.  

  హెర్క్యులేనియంకి అండర్ గ్రౌండ్ సువేజ్ సిస్టం ఉంది.  ఎండాకాలంలో నీళ్ళు సరిపోకపోతే లెడ్ పైపులతో నేపుల్స్ నించి నీళ్ళు తెప్పించే వాళ్ళుట.  దాని వల్ల లెడ్ పాయిజనింగ్ అయి చాలా మందికి పిచ్చేక్కేదిట.  కొన్ని గుళ్ళ మీద స్వస్తిక్ గుర్తు ఉంది.  ఇది సూర్యుడిని సూచిస్తుంది. 
     
           పాంపెలో గడపటానికి చాలా టైముందని ఆడియో గైడ్ తీసుకున్నాం.  ఇంకో గంటన్నరలో మూసేస్తారనగా హెర్క్యులేనియం వెళ్ళాం.  మ్యాప్ వెతుక్కుంటూ తిరిగే టైం లేదు.  అందరూ వెళిపోయే టైం కాబట్టి ఇరవై యూరోలివ్వండి చాలనుకుంటూ గైడ్లే ఉన్నవాళ్ళ వెంటపడుతున్నారు.  మాకు దొరికిన గైడ్ కి పాపం ఓపిక  చాలా ఎక్కువనుకుంటా.  నేను అడుగుతున్న కొద్దీ అతను విసుక్కోకుండా కం మదాన్ కం మిస్టర్ అంటూ ప్రతీ అంగుళం చూపించాడు.    
        

 కాప్రి, అనాకాప్రి ( capri, Anacapri )
    
సెయింట్ ఎన్యేల్లో స్టేషన్ నించి డైరెక్ట్ బస్ ఉందంటే మొదట ఎమాల్ఫీ కోస్ట్ కి టికెట్లు కొన్నాం.  బస్ కోసం రెండు గంటలు చూసి ఇంక లాభం లేదని ప్లాన్ మార్చి సొరెంటోకి రైల్లో బయల్దేరాం.  సొరెంటో నించి కాప్రికి ఫెర్రి తీసుకున్నాం.  నార్మల్ స్పీడ్ లో వెళ్ళే ఫెర్రీలు ఉంటాయి, ఫాస్ట్ గా వెళ్ళే హైడ్రో ఫాయిల్స్ కూడా ఉంటాయి. 


 

 మరీనా గ్రాండే :  మెయిన్ పోర్ట్.  ఇక్కడే ఫెర్రీ ఆగుతుంది.   ఇక్కడ రెస్టారెంట్లు, కాఫీ షాపులు, టికెట్ కౌంటర్లు  ఉంటాయి.  ఇక్కడ నించే కాప్రి టౌన్కి కేబుల్ కార్ ( tram ) అనాకాప్రికి బస్సులు బయల్దేరుతాయి.  కాప్రి అనాకాప్రి ట్విన్ టౌన్స్ లాంటివి.  ఇంకా అనాకాప్రిలో చూడాల్సిన బ్లూగ్రోటోకి ఫెర్రీ కూడా ఇక్కడ నించే బయల్దేరుతుంది.

బ్లూ గ్రోటో ( Blue Grotto ) :  ఇది అనాకాప్రిలో సముద్రంలో ఏర్పడిన గుహ.  మరీనా గ్రాండే నించి ఫెర్రీ తీసుకున్నాం.  గుహ దగ్గరికి రాగానే చిన్న చిన్న పడవలలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు.  పెద్ద క్యూనే  ఉంది.  గుహ లోపల ఎత్తుగానే ఉన్నా లోపలికెళ్ళే దారి మాత్రం ఒక్క పడవ పట్టేటన్తే ఉంది.  ఇది చూడటానికి సపరేట్ ఛార్జ్ ఉంది.  ఇరవై అమెరికన్ డాలర్లో యూరోలో గుర్తులేదు.  గుహలో సూర్యకాంతి వల్ల నీళ్ళు బ్రైట్ బ్లూ రంగులో ఉంటాయి.  ఇది చూసి పడవలో ఒక రౌండ్ వేసేసి తిరిగి మరీనా గ్రాండే వచ్చేసాం.    

       కేబుల్ కార్లో కాప్రికి  పది నిమిషాలు.  పైకి వెళ్ళగానే ఒక టెర్రెస్ లా ఉంది.  అక్కడే నించుని మరీనా గ్రాండే, పోర్ట్, ఫెర్రీలు  ఎంత సేపు చూసినా తనివి తీరదు.   ఊరు చూసే ముందు అందరూ చేస్తున్నపని లెమన్ ఐస్ క్రీం తినటం.  వాళ్ళతో మేము కూడా జాయిన్ అయి ఐస్ క్రీం తినేసి సైట్ సీయింగ్ మొదలు పెట్టాం. 

       కాప్రి టౌన్ స్క్వేర్ లోనే జనాలందరూ కట్టకట్టుకుని ఉన్నారు. అక్కడే క్లాక్ టవర్ కూడా ఉంది.   ఊరు కొండ మీద కాబట్టి మొత్తం కాలి నడకతోనే తిరగాలి. 
   
   కాప్రి చాలా చాలా చాలా అందమైన ఊరు.  ఇటలీలోకే బెస్ట్ ప్లేస్.  రోడ్లు విశాలంగా ఏమీ ఉండవు.  ఆ ఇరుకు సందుల్లోనే అన్ని హైఎండ్ షాపులూ ఉన్నాయి.  ఇంకా కాప్రిలో చర్చిలు, విల్లాలు, చాలా గార్డెన్లు ఉన్నాయి.  పగడాలు అమ్మే షాపులకైతే అసలు  లెక్కే లేదు.  అది ఎర్ర పగడాలకి చాలా ఫేమస్. 

     

  
           కాప్రీలో చూడాల్సిన ఇంకో ముఖ్యమైన ప్రదేశం ఆర్కో నేచురేల్ ( Arco Naturale ).  ఇది సున్నంతో నేచురల్ గా ఏర్పడిన ఆర్చ్.  ఆర్కో నేచురేల్ పక్కనే రెస్టారెంట్ ఉంది.  అక్కడ ఆరంజ్ జ్యూస్ తాగుతూ అందాన్ని తనివితీరా ఆస్వాదించి మళ్ళీ మారినా గ్రాండేకి బయల్దేరాం.  ఇంక అక్కడి నించి ఫెర్రీలో సొరెన్టోకి, అక్కడి నించి ట్రైన్లో బాక్ టు సెయింట్ ఎన్యెల్లో.        

 పోసిటానో, ఎమాల్ఫీ (Positano, Amalfi )  


బి&బిలో దిగినప్పటి నించి దాని ఓనర్ పోసితానో బూతిఫుల్ పోసితానో బూతిఫుల్ అని మేము కనిపించినప్పుడల్లా వాయిస్తూనే ఉంది.  మాకు చివరికి వెళిపోయే రోజు కుదిరింది.   ముందు రోజు లాగా తప్పు జరక్కుండా సొరెంటోకి వెళిపోయి అక్కడి నించి బస్సు ఎక్కడానికి ప్లాన్ చేసుకున్నాం.

   పోసిటానో, ఎమాల్ఫీ, రెవెల్లో  మెడిటరేనియన్ సీ కోస్ట్లో ( ఎమాల్ఫీ కోస్ట్ ) ఉన్న ఊళ్ళు.  సొరెంటో నించి బ్లూ బస్ తీసుకోవాలి.  ఎమాల్ఫీ ఫైనల్ స్టాప్.  పోసిటానోలో ముందు ఆగుతుంది.

     బస్సుకి చాంతాడంత క్యూ ఉంది.  అరగంటకొక బస్సు.   కొంచెం తొందరగా వెళితే మొదటి బస్సు కాకపోయినా రెండోదన్నా దొరుకుతుంది.   సొరెంటో నించి వెళ్ళేటప్పుడు వ్యూ మొత్తం కుడి వైపే వస్తుంది.  కుడి వైపు సీట్లు దొరకలేదా వీళ్ళ మొహాలు వాళ్ళ మొహాలు చూస్తూ కూర్చోటం తప్ప చేసేదేం లేదు.   వైన్డింగ్స్  విపరీతంగా ఉంటాయి.  మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం.  కడుపులో తిప్పేస్తూనే ఉంటుంది.   ఎమాల్ఫీలో దిగాలనుకున్న వాళ్ళం ఇంక కూర్చోలేక పోసిటానోలోనే దిగిపోయాం.       





పోసిటానో మెట్ల ఊరు.  అన్ని చోట్ల నించి అన్ని చోట్లకి మెట్లున్నాయి.  నాకు మెట్లు ఎక్కటం దిగటమే గుర్తుంది.   ఎమాల్ఫీ కోస్ట్ చాలా అందంగా ఉంటుంది.  ముఖ్యంగా అక్కడకి వెళ్ళేది బీచెస్ కోసమే.  పోసిటానో ఎమాల్ఫీలో చాలా బీచెస్ ఉన్నాయి.   ఎమాల్ఫీ టౌన్ సెంటర్లో చర్చితో పాటు రెస్టారెంట్లు షాపులు  ఉన్నాయి.   పిజ్జా తినేసి షాపింగ్ చేసుకుని హాయిగా బీచ్లో కూర్చుంటే రోజు గడిచిపోతుంది.          

        పోసిటానో నించి ఎమాల్ఫీకి బస్సులో వెళ్ళ లేని వాళ్ళు ఫెర్రీ తీసుకోవచ్చు.

Amalfi Cathedral

ఎమాల్ఫీ నించి బయల్దేరి తిరిగి సెయింట్ ఎన్యెల్లొ వచ్చేటప్పటికి సాయింత్రం ఆరున్నరైంది.   ఏడున్నర ట్రైన్ కి నేపుల్స్ బయల్దేరాం.  అక్కడ్నించి తొమ్మిదిన్నరకి రోమ్ కి ట్రైను.  రెండు గంటల ప్రయాణం.  రోమ్ లో హోటల్ ఎలసాన్డ్రినోలో బస. 




   

Sunday 1 September 2013

Italy - Catania


    టీవీలో గ్లాడియేటర్ సినిమా వచ్చిన ప్రతీసారి చూస్తాకానీ మొన్న చూస్తూంటే  మాత్రం మా ఇటలీ ట్రిప్ గుర్తొచ్చింది.  ఇటలీ వెళ్ళి అప్పుడే అయిదేళ్ళు అయిపోయింది.   ఒకసారి నా డైరీ తిరగేసా.   రెండేళ్ళ క్రితం మొదలు పెట్టి వదిలేసిన నా బ్లాగ్ మళ్ళీ మొదలు పెట్టాలనిపించింది .   ఇటలీకి సంబంధించి రెండు పోస్ట్లు ఆల్రెడీ  డ్రాఫ్ట్ లో ఉన్నయి. 

    అయిదేళ్ళ  క్రితం లండన్ నించి ఇండియాకి తిరిగొచ్చేసాం.  మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తుందో  లేదో  తెలీదు ఏదైనా ప్రదేశం చూసి బయల్దేరదామనుకున్నాం.  ( నాలుగు నెలల కల్లా గోడక్కొట్టిన బంతుల్లా మళ్ళీ వెళ్ళాం అనుకోండి అది వేరే విషయం ).     యూరప్ లో చూడాలనుకున్న వాటిలో  ఇటలీ, గ్రీస్, స్పెయిన్  మిగిలిపోయాయి.  ప్రపంచంలో యునెస్కో లిస్టు చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఎక్కువగా ఉన్నది ఇటలీట.  అక్కడ నలభై నాలుగు  సైట్లున్నాయిట .  కాబట్టి ఏప్రిల్ నెలలో ఇటలీ బయల్దేరాం.

   మొత్తం పదమూడు రోజుల ట్రిప్పు.    చూడాల్సిన ప్రదేశాల లిస్టు పెద్దదే.  సిసిలీ, సొరెంటో, రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్.  వీటితో పాటు వాటి పక్కనున్న చిన్నా చితకా ఊళ్లు.   మొదట స్టాప్ సిసిలీలో ఉన్న కెటేనియా.    సిసిలీ ఇటలీలో ప్రాంతమే అయినా మెయిన్ ల్యాండ్ లో ఉండదు.  అదొక ద్వీపము.   

డే 1                   :  కెటానియా
డే 2                   :  కెటానియ  --  mt  ఎట్న , కెటానియా
డే 3                   :  సొరెన్టో       -- పాంపె , హెర్క్యూలేనియం
డే 4                   :  సొరెన్టో       -- కేప్రి
డే 5                   :   సొరెన్టో      -- పోసిటానో , ఎమల్ఫీ
డే 6,7 & 8         :   రోమ్
డే 9                   :  ఫ్లోరెన్స్      - పీసా
డే 10                 :  ఫోరెన్స్
డే 11, 12 & 13  :  వెనిస్

 కెటానియా (Catania)

   మధ్యాహ్నం 12.45 కి గాట్విక్ విమానాశ్రయం నించి  ఫ్లైట్ బయల్దేరింది.   కెటానియా బెల్లినీ ఎయిర్ పోర్ట్ చేరేటప్పటికి  అక్కడి లోకల్ టైం 4.45 అయింది.  ఇటలీ యుకే కంటే గంట ముందుంది.   ఎయిర్ పోర్ట్ నించి  ట్రైన్ సర్వీస్  లేదు కాని బస్ సర్వీస్ ఉంది.    మేము బుక్ చేసుకున్న హోటల్  ట్రైన్ స్టేషన్ నించి  అయిదు నిమిషాల నడక.  స్టేషన్ కి  # 457 బస్ తీసుకున్నాం.  హోటల్ పేరు " డి కర్టిస్".  


 
 దాదాపు ఏడున్నరకి ఊరు చూడటానికి బయల్దేరాం.    కటానియాలో ముఖ్యంగా చూడాల్సిన స్క్వేర్  పియట్జా డుఓమొ.   దీన్ని ఎలిఫెంట్ స్క్వేర్ అని కూడా అన్టారనుకున్టా.  అక్కడ ఎలిఫెంట్ స్టాట్యూ, బెల్లిని ధియేటర్, సెయింట్ అగాథా డుఓమొ (చర్చి)ఉన్నాయి.   అసలు కెటానియాలో సందడంతా  అక్కడే ఉన్నట్టుంది.   ఒకవైపు ఫౌంటెన్, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, ఇంకో వైపు చేపల మర్కెట్టు.  రోడ్లు తిరక్కుండా  ఏనుగు విగ్రహం ఉన్నమెట్ల మీదే కూర్చుని టైం గడిపేయచ్చు.   గొడుగులు, చిన్న చిన్న వస్తువులు అమ్మే వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళే.   చేపల మార్కెట్ సందుల వరుకు రోడ్లు జనాలతో కిటకిటలాడుతూనే ఉన్నాయి.    దాటి  ఇంకా ముందుకు వెళితే మాత్రం రోడ్లు నిర్మానుష్యగా ఉండి కొంచెం భయమేసింది.  హోటల్ కి తిరిగొచ్చేటప్పుడు కూడా రోడ్డు మీద మేమిద్దరమే ఉన్నామేమో కొంచెం షేడీగా అనిపించింది.    రాత్రయింది,  అసలు సిసిలీలోనే మాఫియా మొదలైంది అంటారు కాబట్టి కొంచెం భయం వేసి ఉండచ్చు.  దానికి తోడు ఇళ్ళు  కూడా బాగా పాతపడి భూత్ బంగళాల్లా కనిపిస్తాయి. 
 


 మౌంట్ ఎట్న ( Mt. Etna )

  పొద్దున్న తొమ్మిదింటికి మౌంట్  ఎట్నా(Mt. Etna ) కి హాఫ్ డే ట్రిప్ తీసుకున్నాం.    మొత్తం ఏడుగురం.  మేమిద్దరం, నలుగురు ఇంగ్లీష్ వాళ్ళు, ఒక అమెరికన్.  డ్రైవరే గైడ్.

   ఎట్న అనేది యూరప్ లోకే ఎత్తైన ఆక్టివ్ వాల్కెనో.   దీని ఎత్తు 10,000 అడుగులు (3300 మీటర్లు).   కేటానియాకి దగ్గరలో ఉంది.  కొండ ఎక్కే  దారిలో రోడ్డుకి రెండు వైపులా లావానే.  లావాలో కూరుకుపోయిన ఇళ్ళు కూడా చూడచ్చు.   మూడు నాలుగు చోట్ల జీప్ ఆపి డ్రైవర్ హిస్టరీ చెప్పాడు.   వెహికల్స్ ఆగే చోట లావాతో చేసిన బొమ్మలు, నిమ్మకాయలు అమ్ముకుంటూ ఉంటారు.   నిమ్మకాయలు చాలా చవక.  పది కాయలు ఒక యురొ. 





   మేము రెండు వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లినట్టు గుర్తు.    ఇదే బళ్ళు వెళ్ళే హైయెస్ట్ పాయింట్.   పేరు రెఫ్యుజియో సాపిఎంజా (Refugio Sapienza ).   ఇక్కడ బండి దిగిపోయి లావా మీద నడుస్తూ చుట్టూ చూడచ్చు.  చాలా కాలం క్రితమే ఎండిపోయింది కనక ఇప్పుడది మన రోడ్లు వేసే తారులా ఉంది.   ఇక్కడే పార్కింగ్  లాట్, రెస్టారెంట్లు, సువనీర్ షాపులు ఉంటాయి.   ఇక్కడ్నించి కేబుల్ కార్ కూడా ఉంది .   మేము వెళ్ళినప్పుడు ఎందుకనో కేబుల్ కార్ లేదు.    ఇక్కడి నించి ట్రెక్కింగ్ కూడా చెయ్యచ్చుట.     ఈ అగ్నిపర్వతం ఆక్టివ్ గా ఉంది కనక అదృష్టం ఉన్న వాళ్ళు అది బద్దలవటం కూడా చూడచ్చు. 

 .  
  పైన తిరగటానికి గంట టైం ఇచ్చారు.  రెస్టారంట్లో స్వీట్ తిని కాఫీ తాగి కిందకి బయల్దేరాం.   అక్కడ పిస్తా పంట ఎక్కువ.  పిస్తా, రికోటా చీస్తో స్వీట్లు సేవరీ ఐటమ్స్ కూడా ఉన్టాయి.  దిగేటప్పుడు మళ్ళీ ఒకట్రెండు  చోట్ల ఆపి క్వారి,  లావా తో ఏర్పడిన టన్నల్ చూపించాడు.   లావా రాళ్ళు  ఇళ్ళు కట్టుకోటానికి  వాడతారు.   
       లావాతో ఏర్పడిన టన్నల్  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.    లావా పై లేయర్ ముందు చల్లారి గట్టిపడింది.  కింద లేయర్లలో లావా చాలా కాలం ప్రవహించి నెమ్మదిగా గట్టిపడింది.   ఈ ప్రవహించిన దారి పెద్ద టన్నల్  లాగా ఏర్పడింది.   ఇది 1300 మీటర్ల పొడుగు, 300 మీటర్ల ఎత్తు ఉంది.  పైన లేయర్ మీదే రోడ్డు వేసారు.   టార్చ్ లైట్లతో లోపలి వెళ్ళి చూడచ్చు. 

   మధ్యాన్నానికల్లా కెటానియా వచ్చేసాం.  భోజనం చేసి  ఊరు చూద్దామని బయల్దేరేమో  లేదో పెద్ద వాన.   మా ఆనవాయితీ ప్రకారం  చెరో గొడుగు కొనుక్కుని బయల్దేరాం.

కెటానియా ( Catania)

     రాత్రి  చూసిన ఎలిఫెంట్ స్టేట్యూ, చర్చి ఉన్న సెంటర్ నించే మళ్ళీ మొదలుపెట్టామ్.  ఏనుగు కేటానియా సింబల్.  దీన్ని లావా రాళ్ళతో కట్టారు.


St.Agatha's cathedral, Bellini's tomb

Elephant Statue, Symbol of Catania
  పదిహేడో శతాబ్దంలో భూకంపాలవల్ల, అగ్ని పర్వతాల వల్ల ఇప్పుడు చర్చ్ ఉన్న ప్రదేశమ్లో రోమన్ కట్టడాలు శిథిలమైపొయాయి.  అప్పుడు సెనేట్ అగాథా స్మ్రితికి చర్చి కట్టారు.    సెయింట్ అగాథాని రోమన్ రాజుల పరిపాలనలో వాళ్ళకి లొంగలేదని చంపేసారు.   ఈ చర్చిలో బెల్లినో సమాధి కూడా ఉంది.  బెల్లిని కెటానియాకి చెందినా ముజిషియన్.  ఎయిర్పోర్ట్ కి అతని పేరే పెట్టారు.  ఇళ్ళు కూడా మొత్తం పొయినాయి.   సెనేట్ తిరిగి ఇళ్ళు కట్టించినప్పుడు పాత ఆర్కిటెక్చర్ ని అలానే ఉంచడం కోసం బోరోక్ స్టైల్లో కట్టారు.                 

Roman Amphitheatre

ఇటలీ అంటేనే గ్లాడియేటర్లు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటానికి కట్టిన ఆమ్ఫిథియేటర్లు.  చిన్న ఊళ్ళో చిన్నవి, పెద్ద ఊళ్ళో పెద్దవి.   కేటానియాలో ఉన్న దాన్ని రెండో శతాబ్దంలో ఏంటోనినియన్ అనే చక్రవర్తి కట్టించాడు.  పదిహేను వందల మంది పట్టేవారట ఇందులో.  ఐదో శతాబ్దమ్ లోనే దీన్ని వాడటం మానేసారు.  తరవాత రాజులు చర్చిలు అవీ కట్టటానికి దీన్లో చాలా భాగం పీక్కుపొయారు.  పదిహేడో శతాబ్దంలో వచ్చిన  భూకంపం వల్ల ఇది భూస్థాపితమైపోయింది.   తర్వాత తవ్వకాలలో బయటపడింది.



  ఈ రెండు రోజుల్లో ఇండియాకి ఇటలీకి కొన్ని పోలికలు కనిపించాయి.  మొదటిది షాపుల దగ్గర,  సందు మొదట్లో జనాలు గుంపుగా  నించుని కబుర్లు చెప్పుకోవడం.  రెండోది బట్టలారెయ్యటం.    
 
     ఏప్రిల్ లో  పొద్దున్న ఎండ  చలి లేకుండా బావుంది.   రాత్రి మాత్రం  కొంచెం చలనిపించింది.   మామూలు స్వెటర్ సరిపోయింది.    ఎట్న వెళ్ళటానికి మాత్రం కోటు, షూ, గ్లవ్స్ తప్పనిసరి. 
   
   రాత్రి పదిన్నరకి కేటానియా సెంట్రల్ స్టేషన్ నించి నేపుల్స్ కి ట్రెన్ఇటాలియా ( national rail ) తీసుకున్నాం.    పొద్దున్న ఆరున్నరకి  నేపుల్స్ చేరుకుంది.  నేపుల్స్ నించి ఏడింటికి సర్కంవెసూవియానా (local train ) తీసుకుని ఎనిమిదింటికి సొరెంటో చేరుకున్నాం.  తర్వాతి బేస్ సెయింట్ ఎన్యేల్లో (St. Agnello).  సొరెంటో నించి టాక్సీలో పది నిమిషాలు. 

       సిసిలీ నించి నేపుల్స్ కి  రైలు ప్రయాణం మిస్ కాకూడదు.  సిసిలీ ఐలాండ్ కాబట్టి ఇటలీ మెయిన్ ల్యాండ్ కి రైలు పట్టాల  మార్గం లేదు.  సిసిలీ చివరికొచ్చాక మెర్సినియా అనే ఊరు నించి మెయిన్ ల్యాండ్ కి పడవలో వెళ్ళాలి.  మనం స్పెషల్ గా రైలు దిగి పడవ ఎక్కకుండా ట్రైన్న్నే పడవలోకి ఎక్కించేస్తారు.  పల్లెటూళ్ళో సైకిళ్ళూ, స్కూటర్లు బల్లకట్టులోకి ఎక్కించినట్టు.  రైలు రెండు మూడు బోగీల కొకచోట విడిపోయి షిప్ లో పేరలల్ గా ఉన్న పట్టాల మీదకి ఎక్కేస్తుంది.      ప్రయాణం నలభై అయిదు నిమిషాలు ఉన్నట్టు గుర్తు.   హాయిగా రైల్లోంచి దిగిపోయి కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చెయ్యచ్చు.