Thursday 29 September 2011

Egypt - Luxor


 లగ్జర్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్

  సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి లగ్జర్లో  ఈస్ట్ బ్యాంకులో దేవుడి గుళ్ళు,  పశ్చిమాన్న అస్తమిస్తాడు కాబట్టి వెస్ట్ బ్యాంకులో మార్చురీ గుళ్ళు కట్టారు.

       పొద్దున్నే అయిదింటికి లేచి రెడీ అయిపోయాం. అయిదున్నరకి ఫోనొచ్చింది రైడ్ ఉంది, ఆరింటికల్లా రిసెప్షన్ దగ్గర వెయిట్ చెయ్యమని.  ఆరింటికల్లా  వాన్ వచ్చేసింది.  హోటల్స్ దగ్గర ఆగుతూ వచ్చేవాళ్ళందరినీ  ఎక్కించుకుని  ఫెర్రీ పాయింట్ దగ్గర దింపింది.  పడమర ఒడ్డుకు వెళ్ళాలంటే  ఫెర్రీలోనే వెళ్ళాలి.  వెస్ట్ బ్యాంకుకి వెళ్లేసరికి ఏడైంది.  అప్పటికే ఒకొక్క బెలూనూ ఎగరటం మొదలుపెట్టాయి.  మా వంతు వచ్చేటప్పటికి ఎనిమిదయ్యింది.   రైడ్ నలభై అయిదు నిమిషాలు.   

     ముందు బెలూన్ తీసి  బాస్కెట్కి కట్టి  నెమ్మదిగా ఇన్ఫ్లేట్  చేసారు.  తరువాత మమ్మల్ని బాస్కెట్ లోకి  ఎక్కించారు. మొత్తం ఇరవై మందిమి. ఇంకా పైలెట్. బాస్కెట్ లో అయిదు క్యూబికల్స్/ కంపార్టుమెంట్లు ఉన్నాయి. ఇటు రెండు, అటు రెండు, మధ్యలో పెద్దది ఒకటి. నాలుగు కుబికల్స్ లో అయిదుగురు చొప్పున ఎక్కించారు. మధ్యలోని పెద్ద కుబికల్ లో పైలెట్, గ్యాస్ సిలిండర్లు.
 


బెలూన్ టేక్ఆఫ్ అయ్యేటప్పుడు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఛీర్ చేసారు.


   

  వెస్ట్ బ్యాంకు లో ఉన్నవన్నీ సమాధులే కాబట్టి valley of kings, valley of queens, valley of nobles, mortuary temple of Hatsepsut, colossi of Memnon చూడచ్చు.   ఫారోలన్దరికీ  valley of kings లో, వాళ్ళ భార్యా పిల్లలకి   valley of queens లో,   ఆస్థానంలోని ముఖ్యమైన వాళ్ళకి valley of nobles లో సమాధులు ఉంటాయి.       
 

Colossi of Memnon


       పేరుకి memnon అనున్నా ఇవి Amenhotep the third  విగ్రహాలు.  ఇప్పుడు సమాధి ఏమీ లేదు.  ఈ రెండు విగ్రహాలు మాత్రమే మిగిలాయి.  ట్రోజన్ యుద్ధంలో ఆఫ్రికా రాజు మెంనన్ని ఎఖిలిస్ చంపేసాడు.  మెంనన్ ఎఖిలిస్ అంత బలవంతుడుట.  అందుకని గ్రీకులు, రోమన్లు ఈ విగ్రహాల్ని మెంనన్ గా గుర్తించటం మొదలు పెట్టారు. 


valley of kings 
 




Mortuary Temple of Hatsepsut


Hatsepsut రాణే అయినా, తను ఫారో లాగా దాదాపు ఇరవై ఏళ్ళు పాలించింది కనక ఆవిడ సమాధి కూడా valley of kings లోనే ఉంది. దాన్నే Mortuary temple of Hatsepsut అంటారు.



valley of queens







Carter's house

హోవార్డ్ కార్టర్ ఇంగ్లండ్ కి చెందిన ఈజిప్టాలజిస్ట్.  ముప్పై ఏళ్ళు కష్టపడి టూటన్ఖామున్ సమాధి కనిపెట్టాడు. 
     రైడ్ అయిపోయిన తరువాత మా పైలెట్ మొహమ్మద్ అందరికీ సర్టిఫికేట్  ప్రెసెంట్ చేసారు.  




 రైడ్ అయిపోయిన తరువాత మళ్ళీ ఫెర్రీలో ఈస్ట్ బ్యాంకుకి వచ్చి,  వాన్లో హోటల్కి పదింటికల్లా వచ్చేసాం.  టిఫిన్ చేసేసి లగ్జర్ టెంపుల్ కి బయల్దేరాం. 


లగ్జర్  టెంపుల్ ( Luxor Temple )

Luxor Temple

    Hatsepsut , ఆవిడ కొడుకు Tuthmosis the third థేబిస్ కి చెందిన ముగ్గురు దేవుళ్ళకి   మూడు చిన్న గుళ్ళు కట్టించారు.  ఇక్కడ దేవుడి బొమ్మలేమి ఉండవు. వాళ్ళని ఊరేగించే  పడవలు మాత్రం పెడతారు.   ఆ ముగ్గురిని ' Triad of Thebes' అంటారు.  వీళ్ళు ఆమున్, అతని భార్య మూట్ (Mut), వాళ్ళ కొడుకు ఖోంసు ( Khonsu).

Shrine for the sacred boats of the Triad of Thebes



తర్వాత కాలం లో చాలా మంది ఫారోలు గుడిని పెంచుకుంటూ పోయినా,  ముఖ్యమైన వాళ్ళు మాత్రం Amenhotep the third, రెండో రామస్సేస్ , Nectanabo.

colonnade of Amenhotep

Sun Court of Amenhotep the third


         పిల్లర్ల   పైన ఉన్న కప్  లాంటి ఆకారం పెపైరస్ (papyrus) అనే చెట్టు మొగ్గ.  ఈ పెపైరస్ నించే పేపర్ కూడా తయారు చేసేవారు.  పెపైరస్ దిగువ ఈజిప్ట్ (lower Egypt) ని సూచిస్తుంది.  తామర పువ్వు ఎగువ ఈజిప్ట్ ( upper Egypt) ని సూచిస్తుంది.  కట్టడాల మీద ఉండే పువ్వు ఆకారం బట్టి ఆ ఫారో దేనికి రాజో చెప్పచ్చు. 
 
           గుడి పైలాన్, ఒబెలిస్క్ రెండో రామస్సేస్ కట్టించాడు.  గుడి ముందర కూర్చుని, నించుని ఉన్న విగ్రహాలన్నీ రామస్సేస్వే. మొత్తం ఆరు విగ్రహాలు, రెండు ఒబెలిస్క్లు ఉండాలి.  ప్రస్తుతం మూడు విగ్రహాలు, ఒక ఒబెలిస్క్ మిగిలాయి.  పంతొమ్మిదో శతాబ్దంలో ఈజిప్ట్ రాజు మొహమ్మద్ ఆలి, ఫ్రెంచ్ రాజు ఐదో లూయి బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు.  ఆలి ఒబెలిస్క్ ఇస్తే, లూయి గడియారం ఇచ్చాడు.  రెండో ఒబెలిస్ కూడా ఇద్దామనుకున్నాడుట.  కాని దాన్ని తీసుకెళ్ళటం కష్టమయ్యింది.  అందుకని ఒకటన్నా మిగిలింది.  లూయి ఇచ్చిన గడియారం ఒక్క రోజు కూడా పనిచేయ్యలేదుట.
       
          రామస్సేస్ కోర్టులో ఉన్న పిల్లర్ల మీద కూడా పెపైరస్ మొగ్గ చూడచ్చు.  కూర్చున్న రామస్సేస్  విగ్రహాల వెనకాల ఉన్న పొడుగు స్తంభాలు అమెనోతెప్ కట్టించినవి.  వాటి పైన ఉన్నవి పెపైరస్ పూలు.


Great court of Ramasses the second with his statues


Sphinx Avenue
 



నేక్టేనబో స్పింక్స్ ఎవెన్యు కట్టించాడు.  ఈ స్పింక్స్ లతో ఉన్న దారి మూడు కిలోమీటర్లు పొడుగు ఉండి లగ్జర్, కార్నాక్ గుళ్ళని కలుపుతుండేది. ప్రతీ సంవత్సరం ఒపెట్ అనే పండుగ ( opet festival ) జరిగేది. కార్నాక్ లో ఉన్న మూడు విగ్రహాలు ఊరేగింపుగా తీస్కొచ్చి ఇరవై రోజుల పాటు లక్షర్ గుడి లో పెట్టవారు. ఆ ఒరేగింపు స్పింక్స్ దారి నుండే జరిగేది. కాలక్రమేనా కొన్ని పడయిపోయాయి, వరదలు తుఫాన్లకి కొన్ని భూస్థాపితమైపోయాయి. ఇప్పుడు తవ్వకాలు మొదలుపెట్టారు. కాస్త ముక్కులు, మూతులు పోయి  దొరికినవాటిని రిపేరు చేసి, అసలు మొత్తానికే పాడయిపోయిన  వాటి స్థానంలో కొత్తవి పెట్టి మళ్ళీ ఆ మూడు కిలోమీటర్ల దారి స్పింక్స్లతో అలంకరించాలని ప్లానుట. 2030 సంవత్సరానికి ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని చూస్తున్నారు.  ఈజిప్ట్ టూరిజం మీదే ఆధారపడింది కాబట్టి ఇదొక మంచి అట్రాక్షన్ అవుంతుంది
కాని దారిలో ఉన్న ఇళ్ళు, కొట్లు, స్కూళ్ళు ఇంకా ఏముంటే అవన్నీ పడకోట్టేయ్యాలి కాబట్టి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి. చూడాలి ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో.
  అలేక్జాండర్  దండయాత్ర తరువాత తను కూడా ఫారో నేనని, తనని కూడా దేవుడిలాగే చూడాలని తనకి కూడా ఒక గుడి కట్టుకున్నాడు.  క్రైస్తవ మతం వచ్చిన తరువాత ఈ గుళ్ళన్నిటినీ  చర్చీలు గా మార్చేసి, గోడలమీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు.   ఐస్లాం కూడా వచ్చాక శిధిలాల  మీదే మసీదు కూడా కట్టుకున్నారు.

లక్షర్ లో గుర్రబ్బళ్ళు చాలా ఉన్నాయి.  చక్కగా అయిదు పౌండ్లు ఇచ్చి కర్నాక్ గుడికి వెళిపోయాం. 

కార్నాక్ టెంపుల్ ( Karnak Temple )
Karnak Temple
కార్నాక్  ప్రపంచంలోనే పెద్ద గుడి.  ఇంచు మించు 250  ఎకరాలు.  ఇక్కడ  ముగ్గురు తేబిస్ దేవుళ్ళూ ఉంటారు.
Shrine for Amun, Mut n Khonsu
  అంచెలంచెలుగా చాలా మంది ఫారోలు కట్టారు.  ముఖ్యమైన వాళ్ళు నేక్తేనేబో, సెటి, అతని కొడుకు రెండో రామస్సేస్, హత్సేప్సట్, ఆవిడ కొడుకు Tutmosis , Amenhotep  . 
    
      స్పింక్స్ ఎవేన్యు నేక్తేనబో కట్టించాడు.  ఇక్కడ స్పింక్స్లకి శరీరమేమో సిమ్హానిది, మొహం పోట్టేలుది.  ఇది ఆమున్ కి గుర్తు.  
Ram headed sphinx




స్పింక్స్ గడ్డం కింద జాగ్రత్తగా చూస్తే ఒక మనిషి ఆకారం కనిపిస్తుంది.  అది రామస్సేస్సే.   దాని అర్థమేమిటో.  ఆమున్  తనని కాపాడుతున్నాడనా  లేకపోతే తను, ఆమున్ ఒకటేననా.
కింద ఫోటోలో రామస్సేస్ పాదాల దగ్గర ఉన్నది అతని  పట్టపురాణి నేఫర్తరి.

Obelisk of Hatsepsut

Ramasses the second




Hypostyle Hall


మొత్తం 134 స్తంభాలున్న ఈ హాలు సెటి మొదలుపెడితే, రామస్సేస్ పూర్తి చేసాడు. 

గుడి లోని మెయిన్ ఎట్రాక్షన్ మాత్రం స్కరాబ్ (scarab beetle).  పేడ పురుగు.  ఎడ్ఫు, కొం ఓంబో గుళ్ళలో కూడా గోడల మీద దీన్ని చెక్కారు.  ఇది వాళ్ళకి చాలా పవిత్రమైంది.  చేతికి బ్రేస్లేట్ లానో, పెండెంట్ లానో వేసుకునేవాళ్ళు.  దీని వల్ల దిష్టి తగలదని వాళ్ళ నమ్మకం.  కార్నాక్ లో ఉన్న స్కరాబ్ చుట్టూ ఏడు సార్లు తిరిగితే కోరుకున్న వన్నీ జరుగుతాయిట.



  కార్నాక్ గుడి నించి మళ్ళీ  హోటల్ కి గుర్రబ్బండి తీసుకున్నాం. చవకకి చవక సరదాకి సరదా.  రాత్రి కైరోకి ట్రైను.  ఇంకా చాలా టైముంది.   అయిదింటికి లగ్జర్  మమ్మిఫికేషన్ మ్యుజియంకి వెళ్లాం. ఫారోల కాలంలో మనుషులతో పాటు వాళ్ళ పెంపుడు జంతువులని కూడా మమ్మిఫై చేసి వాళ్ళతో బాటు పెట్టేవారు.  పిల్లులు, మొసళ్ళు, కోతులు, చాపలు, తాబేళ్లు, కుక్కలు  ఇలా చాలా జంతువులని ఎమ్బాం చేసారు.  ఇంకా మమ్మిఫికేషన్ ప్రక్రియ, మనిషి పోయిన తరువాత వాళ్ళు అనుసరించే పద్ధతులు తెలుకుకోవచ్చు.

           రాత్రి గీజా (Giza) కి ట్రైన్ తీసుకున్నాం.  ఫస్ట్ క్లాస్ కూపేలో రాత్రి భోజనం మళ్ళీ పొద్దున్నే టిఫిను వాళ్ళే ఇస్తారు.   కైరోలో హోటల్  బుక్ చేసుకున్నాం.  కైరోలో దిగితే హోటల్ నించి గీజా బాగా దూరమైపోతుంది కాబట్టి గీజా స్టేషన్ కే డైరెక్ట్ గా వాన్ తీసుకువచ్చేస్తానంది మా గైడ్.  తరవాత రోజు పిరమిడ్ల టూరు. 


        ఖర్చులు                                       యుఎస్ డాలర్లలో       ఈజిప్టియన్ పౌనలో

      హాట్ ఎయిర్ బల్లూన్ రైడ్                         260                         ___

      గైడ్, లగ్జర్  టెంపుల్                                 ___                          50
               

No comments:

Post a Comment