Thursday 1 December 2011

ఈజిప్ట్ - ఫుడ్, షాపింగ్




ఫుడ్

   ఈజిప్ట్ లో శాకాహారులకి కావలసినన్ని ఆప్షన్స్ ఉన్నాయి.  ఒకట్రెండు సార్లు తప్ప మేము ఏ పెద్ద రెస్టారెంట్లకీ వెళ్ళలేదు.   ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు  సందుకు  ఐదో పదో ఉంటాయి. లోపల కూర్చోటానికి బెంచీలు అవి ఉంటాయి కానీ అంత క్లీన్ గా ఉండవు. కానీ అక్కడ ఫుడ్ చాలా బావుంటుంది.  టేక్ అవే తీసుకోవచ్చు లేక పోతే అక్కడే నించుని తినేయచ్చు.   


ఫాస్ట్ ఫూడ్స్:

ఫుల్ మదమస్ ( Ful Medames ), కుషారి ( Kushari ),  డోల్మ ( Dolma ), తమయ ( Tamaya ).   అన్నీ శాకాహారమే.  ధైర్యంగా తినెయ్యచ్చు. 

ఫుల్ మదమస్ :  పీటా బ్రెడ్ లో స్టఫ్ చేసిన మాష్ చేసిన బీన్స్ ( రాజ్మ లాంటిది). 


Ful Medames


తమయ :  పీటా బ్రెడ్ లో స్టఫ్ చేసిన కాబూలి చనా తో చేసిన  ఫలాఫల్ , సలాడ్.



కుషారి :  గ్లాస్ లాంటి దాన్లో  అన్నం,  బ్లాక్  లెన్టిల్స్ ( కందుల్లాంటివి ), కాబూలి శనగలు, మాకారోని పాస్తా లేయర్లుగా వేసి పైన  టొమాటో సాస్ పోస్తారు. 

డోల్మ :  ద్రాక్ష ఆకులలో స్టఫ్ చేసిన అన్నం.

 మన రుచులలో తినాలనుకునే వాళ్ళకి మైదాతో చేసిన చపాతీలు, ఊరగాయ ( pickled veggies ), పెరుగు, మూడు నాలుగు రకాల బ్రెడ్లు దొరుకుతాయి.   అన్నంలో తప్ప ఇంక ఎందులో ఉప్పు ఉండదు. 


పచ్చడి / డిప్స్ :

తెహిన ( Tehina )                         : నువ్వుల పచ్చడి ( sesame dip )

బాబా ఘనుష్ ( Baba Ghanoush) : వంకాయ పచ్చడి (aubergine mash )

స్వీట్లు :  బక్లావ,  బస్బూస (Basbousa ) .   బక్లావ అందరికీ తెలిసే ఉంటుంది.  బస్బూస సేమియాని పంచదార పాకంలో వేసి నట్స్ వేసి చేసే స్వీటు. 


షాపింగ్

 ఇంట్రెస్టు డబ్బులు ఉండాలి కానీ షాపింగ్ కి కొదవ లేదు.   ఆఫ్రికన్ మాస్కులు, మఫ్లర్లు, ఎంబ్రాయిడరీ  చేసిన బట్టలు, హుక్క మోడల్స్, గుర్రం మీద వెళ్ళే బాటసారి బొమ్మలు, టేబుల్ క్లాత్, కోస్టర్లు, అత్తర్లు, పోస్ట్ కార్డ్లు, షాట్ గ్లాసులు, నగలు, బాకులు ఇవే కాదు ఇంకా చాలా రకాలున్నాయి.   అన్నిటికన్నా ముఖ్యమైనది ఖజ్జూరాలు. 

      
      ఈజిప్ట్ పేరుకి ఆఫ్రికా లోనే ఉన్నామొత్తం  ఇస్లాం మతమే అవటంతో ఆఫ్రికన్ దేశంలా కాక అరబ్ దేశంలా అనిపించింది.

   అసలు మనం ఈజిప్ట్ కి వెళ్లేదే అప్పటి ఫరోనిక్ ఈజిప్ట్ కోసమే కదా.    ఆ కాలాన్ని ప్రతిబింబించే వస్తువులు పిరమిడ్ బొమ్మలు, పెపైరస్ అనే పేపర్ మీద పెయింటింగులు, ఆ కాలం నాటి దేవుడి బొమ్మలు ( హోరుస్, అనుబిస్ etc), మమ్మిఫికేషన్ జరిగే ముందు శరీరంలో అవయవాలు తీసి భద్రపరిచే పింగాణీ జాడీలు ( canopic jars ), టుటన్ఖమున్ మాస్క్, స్పింక్స్.   నూబియన్ విలేజ్ జీవితాన్నిప్రతిబింబించే  బొమ్మలు కూడా కొనచ్చు.       పిరమిడ్లు ఎంతైనా సమాధులే కాబట్టి వాటిని కొనాలనిపించలేదు.   

  కైరో లో ఉన్న ఖాన్ ఎల్ ఖలీలీ మార్కెట్ షాపింగ్ కి బెస్ట్. వేలల్లో షాపులుంటాయి .  లక్షర్ ఆస్వాన్ లో మార్కెట్ బావుంటుంది  కానీ ఆస్వాన్ లో మోసం ఎక్కువనిపించింది.  ఖజ్జూరాలకి మాత్రం ఆస్వాన్ బెస్ట్ ట. చిన్న ఊళ్ళో మోసాలు ఉండవు, పెద్ద ఊళ్ళో ఉంటాయనేమి లేదు.  చేతనైనంత వరకు అందరి కందరూ మోసం చెయ్యటానికే ట్రై చేసారు. ఆస్వాన్ లో కొన్న నూబియన్ బొమ్మలు కైరో రేట్లతో పోలిస్తే వంద పౌన్ల పైన ఎక్కువ దొబ్బాడని తెలిసింది బేరాల తరవాత కూడా.  హ్యాండ్ మేడ్ అని ఇంకా బొమ్మలు అంతగట్టాడు కానీ అవి ఇంటి  కొచ్చేసరికి పప్పు పప్పు అయ్యాయి.



Nubian House, Nubian Couple
  
Musicians





Final Judgment on Papyrus




మన హిందూ మతం ప్రకారం మనిషి పోయిన తరవాత చిత్రగుప్తుడు చదివిన మన  పాపాల చిట్టా బట్టి యముడు పనిష్మెంట్ ఇచ్చినట్లు ఫరోనిక్ కాలంలో కూడా ఈ ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది.  కాకపోతే కేరెక్టర్లు, వాళ్ళ పేర్లు  వేరు. 
        
        అనుబిస్ ( Anubis - the jackal god ) చనిపోయిన ఫారోని చెయ్యి పట్టుకుని తీర్పుకి తీసుకొస్తాడు (extreme left ).  పైన కూర్చున్న 14 మంది జడ్జీలు అతని మంచి చెడ్డ పనుల చిట్టా చదువుతారు.    వాళ్ళ చేతుల్లో ఉన్నదాన్ని అంఖ్ అంటారు. అది key of life.  తరవాత అతని గుండెని త్రాసులో వేసి మాట్ (Maat - goddess of truth n justice ) ఈకతో బరువు చూస్తారు.  తోత్ ( Thoth - god  of wisdom  with paper n pen ) పక్కనే నించుని జడ్జ్మెంట్ రాసుకుంటాడు.  అది ఈక కన్నా బరువుగా ఉంటే పాపాలు ఎక్కువ చేసినట్లు.   అప్పుడు పక్కనున్న అమిట్ (Ammit - god with croc head n hippo legs ) గుండెని తినేస్తాడు.   అంటే అతని చాప్టర్ క్లోజ్ అనమాట.  ఒక వేళ గుండె ఈక కన్నా తేలిక గా ఉంటే అతను మంచి చేసినట్లు.    హోరస్ ( Horus - falcon god ) అతన్ని ఒసైరిస్  (Osiris - judge of the dead ---  యముడు )  దగ్గరికి తీసుకెళతాడు.   ఒసైరిస్ తన భార్య ఇసీస్, చెల్లి నెఫ్తిస్ తో కలిసి ఫారోని అండర్ వరల్డ్ కి ఆహ్వానిస్తారు. 


Pharonic Calendar on Papyrus



 ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి క్యాలెండర్ ట.   లక్షర్  లో దొరికిందిట.   నెపోలియన్ కాలంలో దీన్ని పారిస్ కి తీసుకెళ్ళిపోయి అక్కడ లూవ్ర్ ( Louvre ) ముజియం లో పెట్టించాడుట.   కాలెండర్ లో ఉన్న హైరోగ్లైఫ్ భాషలో దీని అర్ధం రాసుంది. 

God Horus                                               :   Represents 4 directions ( east, west, north, south )

12 figures                                                :  12 months 

2  hands  x 12 figures                               :  24 hours/day

10 fingers x 12 figures                              :  120.    60 mins/day + 60 sec /min   

36 human figures inside the big circle         :  each one represents 10 days
                                                                    36 x 10 = 360 days

5 circles                                                     :  5 festivals ( dedicated to Isis, Osiris, Horus, Seth, Hathor )

                                                                       360 + 5 =  365 days 

Animals                                                       :  12  signs of Zodiac


  దీన్ని 200  పౌన్లు చెప్పి చివరికి యాభై పౌన్లకి ఇచ్చాడు. 


కొంచెం ఖరీదైన వస్తువు కావాలంటే వెండి పెండెంట్లు కొనుక్కోవచ్చు.   వాటి మీద మన పేరు ఫరోనిక్ భాషలో  ( hieroglyph ) చెక్కుతారు.   వాటిని గైడ్లే అమ్ముతారు. 























 


              

















Wednesday 23 November 2011

శ్రీలంక - ఫుడ్, షాపింగ్


ఫుడ్


    శ్రీలంకలో దాదాపు బౌద్ధ మతస్తులే కాబట్టి  ఎవరో  కొందరు తప్ప అంతా శాకాహారులే అనుకున్నా కానీ అలా ఏమీ లేదు.   పొద్దున్న టిఫిన్ తోనే నాన్ వెజ్ తినటం మొదలైపోతుంది.    శాకాహారులకి కూడా బాధేమి లేదు.  దోశ, గారెలు, అప్పం, కొబ్బరి పచ్చడి ( లాంటిది ) లంచ్ కి కూడా అన్నం, కూరలు ఉంటాయి.  కాండీ, నువారా ఇలియాలో మంచి ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి.  అరవ వాళ్ళ హోటల్స్ లో అయితే రుచులు మారినా మన భోజనమే ఉంటుంది.
  
  కిరి బాత్ అనేది  శ్రీలంకన్ సాంప్రదాయ వంటకం.  అన్నాన్ని కొబ్బరి పాలలో ఉడికిస్తారు.  చాలా బావుంటుంది.   రెస్టారెంట్లలో టిఫిన్ కి సర్వ్ చేస్తారు. 


షాపింగ్

    శ్రీలంకన్ టీ బాగా పొపులర్.   చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది కూడా.   టీ ఫాక్టరీలలోనే ఔట్లెట్స్ ఉంటాయి.  రకరకాల ఫ్లేవర్లలో టీ పౌడర్ దొరుకుతుంది. 

     వాల్ హాన్గింగ్స్ కావాలనుకుంటే మాస్క్ చూడటానికి చాలా బావుంటుంది.   చాలా సైజులు వెరైటీలలో దొరుకుతుంది.  మిగతా ఊళ్ళ గురించి తెలీదు కానీ నువారా ఇలియాలో ఉన్న " గ్రాండిస్ హోటల్ " లో సువనీర్ షాప్ ఉంది.  అక్కడ చాలా వెరైటీ మాస్కులు ఉన్నాయి.  రేట్లు కూడా రీజనబుల్  గా ఉన్నాయి.   


Sri Lankan Mask


    చేతితో వేసిన బాతిక్ పెయింటింగ్స్ కూడా దొరుకుతాయి.  కాకపోతే ఖరీదెక్కువ.   ఫ్రేం కట్టించుకోవచ్చు.  లంకా దహనం  లాంటి రామాయణ ఘట్టాలతో పాటు బుద్ధుడు, సిగిరియ రాక్ మీద ఉన్న ఫ్రెస్కోస్, శ్రీలంక  లైఫ్ ని దిపిక్ట్  చేసే బొమ్మలు ఇలా చాలా రకాలుంటాయి.    కాండీ  పెరహెర ( Kandyan  procession)  పెయింటింగ్ చాలా బావుంటుంది.    కాండీలో ఉన్న  టూత్ రెలిక్ గుడిలో ఉన్న బుద్ధుడి పన్నుని ఏనుగు అంబారీ మీద పెట్టి ఊరేగిన్చటమే కాండీ పెరహెర.


Kandy Perahera

  పై ఫోటోలో ఉన్నది బాతిక్ పెయింటింగ్ కాదు. ఇదే బాతిక్ పెయింటింగ్ అయితే దాదాపు ఎనభై అమెరికన్ డాలర్లు ఉంటుంది.   నువారా ఇలియాలో మేమున్న విండ్సర్ హోటల్ లో లంకా దహనం పెయింటింగ్ చాలా బావుంది.  అదయితే శ్రీలంక ట్రిప్ కి సరిగ్గా సరిపోతుంది కొనాలని చాలా ట్రై చేసాం కానీ దొరకలేదు.  చివరికి ఎయిర్ పోర్ట్ లోకూడా  దొరక్కపోయేసరికి దీన్ని ఇరవై డాలర్లకి కొన్నాం.   

Tuesday 22 November 2011

Sri Lanka - Kandapola



 హోటల్ " ది టీ ఫ్యాక్టరీ "  ( The Tea Factory )

ఈ హోటల్ జీవితాంతం గుర్తుండిపోయే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 


Hotel Tea Factory

హోటల్ కి వెళ్ళగానే కూర్చోపెట్టి చందనంతో బొట్టు పెట్టి టీ ఇచ్చి అప్పుడు  బుకింగ్ గురించి ఆరా తీస్తారు. 

ఈ హోటల్ ఒకప్పుడు టీ ఫ్యాక్టరీ.   పేరు హెతర్సెట్ ( Hethersett Tea Factory ).  ఇక్కడ తయారు చేసిన  టీ లండన్ లో మామూలు మార్కెట్ రేట్ కన్నా ముప్పై రెట్లు ఎక్కువకి అమ్ముడు పోయేదిట. 1968 లో ఫ్యాక్టరీ మూతపడింది.   దాదాపు పాతికేళ్ళ పాటు నిరుపయోగంగా పడుంది.   1992 లో దీన్ని హోటల్ గా మార్చారు.   బిల్డింగ్ బయట అప్పుడున్నట్టే ఉంచేసారు.   గుర్తుగా కొన్ని మషీన్లు కూడా ఉంచారు. 






రూమ్ లో  ఫ్లోర్ టు  సీలింగ్ విండోస్ ఉంటాయి.  టీ గార్డెన్స్ మధ్యలో ఉన్నట్టుంటుంది.


View from the hotel room

 హోటల్ రెస్టారంట్ లో డిన్నర్ బఫే చాలా గ్రాండ్ గా ఉంది.  డెసర్టులే ఓ యాభై రకాలుంటాయి.   శుష్టుగా నోటితో కళ్ళతో భోన్చేసాం.
 
     హోటల్ టీ గార్డెన్లలోనే ఉంది కాబట్టి పొద్దున్న గార్డేన్లన్నీ తిరిగాము. 









మధ్యాహ్నం  పన్నెండింటికి చెకౌట్ చేసేసి  వచ్చిన ఆటోలోనే నాను ఓయ బయల్దేరాం.  దారిలో పెడ్రో టీ ఫ్యాక్టరీ దగ్గర ఆగి ఓ పది టీ పాకెట్లు కొన్నాం అందరికీ పంచటానికి.   ఆ అందరి సంగతీ తెలీదు కానీ మా ఇంట్లో మాత్రం ఆ టీ పౌడర్  తలకి పెట్టుకునే హెన్నాలో కలపటానికి  బాగా పనికొస్తోంది.    మళ్ళీ నువార ఇలియాలో ఆగి అమ్బల్స్ లో  భోజనం చేసాం.   పనిలో పని రాత్రికి కూడా వడలు పార్సిల్ చేయించుకున్నాం.   3.15 కి నాను ఓయ నించి కొలంబోకి ఇంటర్ సిటీ ట్రైన్ ఉంది.  కొలంబో చేరేసరికి పది గంటలైంది.   ఎయిర్ పోర్ట్ కి ఆటోలు దొరుకుతాయమో చూసాం.  చివరికి ఎయిర్ పోర్ట్ షటిల్ ఏరియాకి సిటీ బస్సు తీసుకున్నాం.   అక్కడ్నించి ఎయిర్ పోర్ట్ కి ఆటో దొరికింది.  

       ఎయిర్ పోర్ట్ కి వెళ్లేసరికి పన్నెండైంది.   పొద్దున్న ఏడున్నరకి ఫ్లైట్.  నాలుగింటికి చెకిన్ చేసాం.   ఫ్లైట్ కాస్తా లేటు.  తొమ్మిదింటికి బయల్దేరింది.   చెన్నైకి పదింటికి కల్లా వచ్చేసాం.

    

Tuesday 15 November 2011

Sri Lanka - Nuwara Iliya



నువారా ఇలియా



శ్రీలంకకి ఇండియాకి గొప్ప అవినాభావ సంబంధముంది. అదే మన రామాయణం ద్వారా. మిగతా ప్రదేశాల గురించి తెలీదు కానీ నువారా ఇలియాని మాత్రం లిస్టులో మొదటి స్థానంలో పెట్టచ్చు.  రామాయణం క్లైమాక్స్ సీన్లు అంటే అశోక వనంలో సీత, లంకా దహనం  జరిగిన ప్రదేశం ఇదే మరి.     
 
  అక్కడ రావణుడు సీతని బంధించిన ప్రదేశానికి గుర్తుగా సీతాదేవి గుడుందని తెలుసుకున్నప్పుడు గుడి చూడాలన్ని కోరిక తప్ప పెద్ద నమ్మకం ఏమీ కలగ లేదు. అందులో రామాయణం ఎప్పుడో అయిదు వేల ఏళ్ళ క్రితమో పది వేల ఏళ్ళ క్రితమో జరిగింది. అప్పటి జియోగ్రాఫికల్ బౌన్డరీస్ వేరు, అప్పటి ఊళ్ళ పేర్లు వేరు. టూరిస్ట్లని ఎట్రాక్ట్ చేయటానికి ఏదో సోది చెప్తారులే  అనుకున్నాం.  

   ఆ రోజు కొత్త సంవత్సరం కూడా. మొదట గుడితో మొదలు పెడితే బావుటుందనిపించింది. మన దేశంలో ఉంటే పండగయినా పబ్బమైనా గుడికెళ్ళాలని అనిపించదు కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు మాత్రం దైవ భక్తి తన్నుకుంటూ వచ్చేస్తుంది. అయినా ఆ రోజు మేము వెళ్ళే ప్లేసులలో గుడే మొదట వస్తుంది.

సీత కోవిల్

    గుడిని అరవంలో కోవిల్ అంటారు.   అక్కడ అరవ వాళ్ళు ఎక్కువ. 

నువార ఇలియా నించి సిటి బస్సు తీసుకున్నాం. బస్ లోంచి  గ్రెగరీ లేక్ చూడచ్చు.  కావాలనుకుంటే సరదాగా బోటింగ్ కూడా చెయ్యచ్చు.    గుడికి వెళ్ళటానికి   పావు గంటో ఇరవై నిమిషాలో పట్టింది. 


Sita kovil





ఇదే సీతని బంధించి ఉంచిన  అశోక వనం.   గుడి వెనకాల కనిపించే చెట్లన్నీ అశోక వృక్షాలే.    పచ్చ రంగులో బోర్డర్ వేసున్న గుంట లాంటిది హనుమంతుడి పాదంట.   ఆ స్ట్రీం లోనే సీతా దేవి స్నానం చేసేదిట. 


Lord Hanuman's Foot Impression



















ముందు నమ్మకపోయినా అక్కడ ఉన్నప్పుడు రామాయణమంతా కళ్ళ ముందే కనిపించింది. అదేమీ విచిత్రమో కానీ అప్పుడు రావణుడు అస్సలు రాక్షసుడులానే కనిపించలేదు.  ఎత్తుకొస్తే వచ్చాడు ఎంత అందమైన ప్లేస్ లో పెట్టాడు అనిపించింది. చుట్టూ కొండలు, వనం, సరస్సులు, పక్షుల కిలకిలారావాలు అసలు కవిత్వమంతా అక్కడే ఉన్నట్లనిపించింది.   నిజం చెప్పాలంటే రావణుడి మీద కొంచెం జాలి కూడా కలిగింది.     ఎత్తుకొచ్చేసాడని నానా గగ్గోలు పెడతాం  కానీ ఇక్కడ ఆడవాళ్ళందరూ కోతుల్లా ఉంటే పాపం అతను మాత్రం ఏం చేస్తాడు అని కూడా అనిపించింది. 



view frm Sita Kovil

      న్యూ ఇయర్ కాబట్టి కొంచెం జనం ఎక్కుగా వున్నా పరిసరాల ప్రభావమో లేక నిజంగా సీత ఉన్న అశోక వనం ఇదే అన్న నమ్మకం కలగటం వల్లో కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది.  

    గుళ్ళో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వున్నారు.  పూజారిని గుడి గురించి అడిగితే బిజీగా ఉన్నా కూడా విసుక్కోకుండా చక్కగా అడిగిన వాళ్ళందరికీ చెప్పారు.  

     అర్చన చేయించుకుని ఆ స్పెషల్ కుంకాన్ని ఇక్కడి కూడా తీసుకొచ్చి అందరికీ పంచాం. 

నువార ఇలియా దగ్గర  ఉన్న ఇంకో ముఖ్యమైన  ప్రదేశం రావణ ఎల్ల. 


రావణ ఎల్ల ( Ravana Falls )


Ravana Ella


     ఎల్ల అంటే సింహళ  భాషలో వాటర్ ఫాల్స్ అనర్ధం.   ఈ ఫాల్స్ కి వాళ్ళ రాజు రావణుడి అదే మన రావణాసురుడి పేరు పెట్టుకున్నారు.   

       ఈ పేరు రావటానికి ముఖ్య కారణం ఈ వాటర్ ఫాల్స్ పైనున్న కొండమీడున్న గుహ.   దాని పేరు రావణ ఎల్లా  గుహ ( Ravana Ella Cave ).   రావణుడు సీతని ఎత్తుకొచ్చిన తరువాత  అశోక వనంలో ఉంచే ముందు మూడు ప్రదేశాలు మార్చాడుట.   వాటిల్లో ఒకటి ఈ గుహ. 

 గుహ చూడాలంటే రెండు వేల మెట్లు ఎక్కాలి. మెట్లు చాలా క్రుకెడ్ గా ఉన్నాయి. అరగంట పడుతుండట ఎక్కడానికి. ఆడమ్స్ పీక్ దెబ్బతో పిక్కలు పట్టేసి మెట్టు అన్న మాటే ఒక నైట్ మేర్ గా తయారైంది. నాలుగైదు మెట్లు చూసినా అమ్మో ఇన్ని మెట్లే అని గుండె దడ దడా కొట్టుకోవటం మొదలెట్టేది. అసలే సీతని పెట్టిన గుహ. ఈ గుహ కోసం మళ్ళీ శ్రీలంక రాలేము. ఎలా అయినా చూడాలి. ఇద్దరం మొహ మొహాలు చూసుకుని నువ్వు వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని కొంచెం సేపు వాదించుకుని ఇద్దరికీ ఓపిక లేక చక్కా వచ్చాం. ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఆడమ్స్ పీక్ ఎక్కక పోతే ఇది చూసే వాళ్ళం కదా అని. ఆడమ్స్ పీక్ ఎక్స్పీరియన్సే వేరు, జీవితంలో మళ్ళీ అలాంటిది రాదు, అయినా నిజంగా ఇక్కడ సీత ఉందని ఎవరు చూసారులే అని సమాధాన పడుతూ ఉంటాను.
 
   నువార ఇలియా నించి రావణ ఎల్లాకి డైరెక్ట్ బస్ లేదు.  మొత్తం మూడు బస్సులు మారాల్సుంటుంది. నువారా ఇలియాలో బస్ తీసుకుంటే వెల్లవాయ ( Wellawaya ) దగ్గర, మళ్ళీ బండారువేల ( Bandarawela )  దగ్గర బస్సులు  మారాలి.  నువార ఇలియా నించి వెల్లవాయ వెళ్ళే దారి లోనే సీతా కోవిల్ వస్తుంది.

       బండారువేల బస్సు రావణ ఎల్లాకి నాలుగడుగుల దూరంలో ఆపాడు.   కాస్త బస్సు  ఎక్కటం దిగటం తప్ప  నడవాల్సిన అవసరం అస్సలు రాలేదు కాబట్టి బానే ఉంది.   తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం రావణ ఎల్లాలో బస్ దొరకలేదు.   ఎంత సేపు నించున్నా అసలు బస్సులే రాలేదు.   ఎల్లా అనే ఊరిదాకా నడిచి అక్కడ బస్సెక్కాం.   మళ్ళీ మూడు బస్సులు మారి రాత్రి ఎనిమిదిన్నరకి నువార ఇలియా చేరుకున్నాం. 

మేము వెళ్ళినప్పుడు తెలీదు కానీ ఇప్పుడు శ్రీలంక టూరిజం రామాయణ టూర్లు ఆఫర్ చేస్తోంది. రావణుడు శివుడ్ని ప్రసన్నం చేసుకోవటానికి పేగులు తీసి వీణ వాయిన్చాడని చెప్తారు కదా. అది exaggeration అనుకున్నా
అతను మంచి సంగీత విద్వాన్సుడుట.  అతను కనిపెట్టిన ఆ వీణ లాంటి దాని పేరు రావణ హట్ట.   శ్రీలంకలో దాని గురించి అందరూ మర్చపోయారు కాబట్టి దాన్ని మళ్ళీ  లైం లైట్ లోకి  తీసుకురావాలని ఒకతను ట్రై చేస్తున్నాడని ఈ మధ్యే ఏదో ఆర్టికిల్లో చదివా.    రాజస్థాన్ ఎడారిలో వైలిన్ లాంటి ఫోక్ వాయిద్యం వాయిస్తున్న వాళ్ళని టీవీల్లో చూస్తాం కదా.  రావణ హట్ట కూడా అలానే ఉంటుందిట. 

తమిళనాడుకి జాఫ్న దగ్గర కాబట్టి అనూరధపుర చుట్ట పక్కల ప్రాంతాలలో అరవ వాళ్ళు ఎక్కువ ఉంటారనుకున్నాం కానీ చాలా తక్కువగా కనిపించారు.   వాళ్ళు కూడా శ్రీలంక తమిళ్ తప్ప ఇక్కడి తమిళ్ మాట్లాడలేకపోయారు. 

   సౌత్ కొస్తున కొద్దీ తమిళియన్లు చాలా మంది కనిపించారు. నువార ఇలియాలో అయితే ఇంక చెప్పఖరలేదు. వీళ్ళ భాష దాదాపు ఇక్కడి తమిళ్ లానే ఉంది.   భాష సంగతేమో కానీ ముందు లుంగీలలో, స్కిర్ట్లలో అమ్మాయిలని చూసీ చూసీ విసిగిపోయి ఉన్నామేమో ఇక్కడ చీరల్లో కనిపించేసరికి హాయిగా అనిపించింది.   కాకపోతే వాళ్ళు సింహళ పద్ధతిలో కట్టుకున్నారు. 

       శ్రీలంక బయల్దేరే ముందే మా అక్క అక్కడ మాస్కులు చాలా పొపులర్ తెచ్చుకోండి నాకు కూడా ఒకటి తీసుకురండని చెప్పింది.   ఎటూ నాకు సువనీర్లు కలక్ట్ చేయటం హాబీ కాబట్టి శ్రీలంక ఎయిర్ పోర్టు లో అడుగు పెట్టినప్పటి నించీ మాస్కుల వేటలో పడ్డా.    అనూరధపురకి అంత సీన్ లేదు. అదసలే పల్లెటూరు లాంటిది. కాండీలో మేమున్న హోటల్ సువనీర్ షాపులో అయితే పట్టుమని పది మాస్కులు లేవు, వేలల్లో చెప్పాడు. చెక్కతో చేసి రంగులు పూసిన వస్తువు ఇలా వేలల్లో ఉంటుందని తెలిసేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. కాండీ లోనే ఇలా ఉంటే ఇంక నువార ఇలియా అసలే హిల్ స్టేషన్. అక్కడ లక్షల్లో ఉంటుందేమో ఇక్కడే కొనేద్దామా అని చాలా ఆలోచించాము కానీ కొనటానికి చేతులు రాలేదు.

   నువారా ఇలియాలో మొదటి రోజు బిజీ గా గడిచిపోయింది. ఇంక అక్కడ మాకుంది ఒక పూట. టెన్షన్ మొదలైపోయింది. దాదాపు పది షాపుల దాకా తిరిగాం. ఆ మాస్కులు షాపులకి దిష్టి బొమ్మల్లాగా తగిలించారు. అవి కొనాలనుకుంటున్నాం ఎక్కడ దొరుకుతాయని అడిగాం.   చాలా షాపులు అరవ వాళ్ళవే కాబట్టి భాషకి ప్రాబ్లం రాలేదు. మేము కూడా అరవ వాళ్ళమని అనుకున్నట్లున్నారు. ఒక షాపులో అయితే వాళ్ళు వెళ్లాడ తీసుకున్న దిష్టి మాస్కుని  తీసి దుమ్ము దులిపి మాకు ఫ్రీ గా ఇచ్చేయటానికి సిద్ధపడ్డారు.   అవి మూడు నాలుగు వందల కంటే ఎక్కువ వుండవుట.   చివరికి ఎక్కడ దొరుకుతాయో తెలిసింది.  ఒకతను  ఒద్దన్నా వినిపించుకోకుండా  మమ్మల్ని షాపుకి తీసుకెళ్ళి రేటు ఎంత పెట్టాలో ఒకటికి పది సార్లు చెప్పాడు.  అలా  హోటల్ గ్రాండిస్ సువనీర్ షాపులో ఆరు వందల శ్రీలంక రూపాయిలతో పెద్ద మాస్కులు కొన్నాం.

మనసు శాంతిన్చాక ఇంక ఆత్మా రాముడ్ని కూడా శాంత పరచడానికి అమ్బల్స్ వెళ్ళి బఫే తిన్నాం.  హోటల్ కెళ్ళి సామాను తీసుకుని ఆటోలో కందపోల అనే ఊరు బయల్దేరాం. రెండు వైపులా టీ గార్డన్లు. టాక్సీ కంటే ఆటో అయితే బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. కందపోల ప్రత్యేకత అక్కడున్న హోటల్ " ది టీ ఫ్యాక్టరీ". ఫ్రెండ్ ముందే చెప్పింది టీ ఫ్యాక్టరీ లో ఎక్స్పీరియన్స్ చాల బావుంటుంది మిస్ అవద్దు అని. చాలా ఖరీదైన హోటల్ కాబట్టి ఒక రోజుకి బుక్ చేసుకున్నాం.

Saturday 12 November 2011

Sri Lanka - Kandy


   పొద్దున్న రెస్ట్ హౌస్ లో చెకౌట్ చేసేసి పదకొండున్నరకి ఎసి మినీ బస్ తీసుకుని కాండి బయల్దేరాం.   కాండి చేరేటప్పటికి మూడైంది.  హోటల్  Suisse లో బుక్ చేసుకున్నాం.    

     కాండి చూడటంతో పాటు దానికి దగ్గరలో ఉన్న శ్రీపాద అనే కొండ కూడా ఎక్కటానికి ప్లాన్ చేసుకున్నాం.  అక్కడ నించి సన్ రైజ్ చూడాలి. సన్రైస్ జరిగేటప్పుడు  కొండ నీడ గాల్లో ట్రైఆంగిల్ ఆకారంలో నిట్ట నిలువుగా పడుతుంది. ఆ వింత చూడటానికే ముఖ్యంగా పర్యాటకులు వస్తారు.  రోజు గడిచే కొద్దీ ఆ నీడ స్లాన్టింగ్ గా మారిపోతుంది.   

   సాధారణంగా రాత్రి తొమ్మిది  పది ప్రాంతాలకి కొండ ఎక్కడం మొదలు పెడతారు . ఎక్కడానికి నాలుగు గంటలు పడుతుంది. రాత్రి కొండ మీదే ఉండి సూర్యోదయం చూసి కొండ దిగుతారు.

  హోటల్ కి వెళ్ళగానే ముందు శ్రీ పాద టూర్ గురించి కనుక్కున్నాం. అసలే మబ్బుగా ఉంది వానొస్తే కొండెక్కటం కష్టమైపోతుంది పైగా మబ్బుగా ఉంటే ఏమీ కనిపించదు పగలైతేనే  మంచిది ఎండుంటుంది కాబట్టి కొండ పైనించి వ్యూ చూడచ్చు అని చెప్పాడు.   అందులో క్రిస్మస్  న్యు ఇయర్ పీక్ టూరిస్ట్ సీజన్ కాబట్టి టూరిస్ట్లు  వేలల్లో  ఉంటారు.  పైన ఉండటానికి ఒకటో రెండో గదులు తప్ప ఇంక ఫెసిలిటీస్  ఏమీ లేవు. చలిలో వణుక్కుంటూ ఆరు బయటే నిన్చోవాల్సి రావచ్చు  అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంక చేసేదేమీ లేక పొద్దున్న బయల్దేరటానికి వాన్ మాట్లాడుకున్నాం.
          
    అతను చెప్పినట్టే ఎనిమిదింటికి వాన మొదలైంది.    కాండి చుట్టూ కొండలే కాబట్టి రాత్రి విపరీతంగా చలుంది.   ఇండియన్ రెస్టారంట్ లో తినాలనుకునే వాళ్ళకి  Devon's Captain's Table అనే మంచి రెస్టారంట్ ఉంది.
 

శ్రీ పాద/ Adam's Peak
 

Sri Pada/ Adam's Peak

   
దీని ఎత్తు ఏడు వేల అడుగులు.    దీన్నే ఆడమ్స్ పీక్ అని కూడా అంటారు.   కొండ పైన బుద్ధుడి పాద ముద్ర ఉంటుందిట.   బుద్ధుడు మూడో సారి శ్రీలంక వచ్చినప్పుడు ఈ కొండ మీద పాదం మోపాడని ఆ పాద  ముద్రే అక్కడ పడిందని బౌద్ధ మతస్తుల నమ్మకం.   క్రైస్తవం వచ్చిన తరవాత దాని పేరు ఆడమ్స్ పీక్  అయింది.    ఆ పాదం ఆడందే అని వాళ్ళ పేరు వాళ్ళు పెట్టేస్కున్నారు.

   డిసెంబర్లో పౌర్ణమి నించి మొదలు పెట్టి మేలో పౌర్ణమి వరకు భక్తులు ఈ కొండెక్కుతారు.   తరవాత  అంతా వర్షా కాలం. 

     డల్హౌసీ అనే ఊరు నించి మెట్ల దారి మొదలవుతుంది. మెట్లు ఆరు వేల పైనే. పొద్దున్నే ఆరింటికి హోటల్ నించి వాన్ లో బయల్దేరాం.  డల్హౌసీ చేరేటప్పటికి  తొమ్మిదిన్నరైంది. పార్కింగ్ లాట్ నించి మెట్ల దారి దాక నడుచుకుంటూ వెళ్ళాం.   దారికి రెండు వైపులా కొట్లే.   తిండి, సాఫ్ట్ డ్రింక్స్ , స్వెట్టర్లు, టోపీలు, మఫ్లర్లు, గొడుగులు, బొమ్మలు ఒకటేమిటి ఏది తెచ్చుకోవటం మర్చిపోతే అది దొరుకుతున్దక్కడ.


Reclining Buddha at the starting point

  మెట్ల దారి మొదలయ్యే చోట హాయిగా చీకూ చింతా లేకుండా నిద్ర పోతున్న బుద్ధుడు. 

         అందరూ దాదాపు రాత్రే వెళిపోతారు కాబట్టి అందరూ మెట్లు దిగేవాళ్ళే. మేమిద్దరమే ఎక్కేవాళ్ళం. కొంచెం దూరం ఎక్కాక  మాకు డౌటొచ్చింది అసలు పొద్దున్న పైకి వెళ్ళనిస్తారా అని. ఒక పది మంది అబ్బాయిలు కూడా ఎక్కటం మొదలు పెట్టేసరికి అమ్మయ్య అనుకున్నాం. మెట్లు రకరకాల సైజులు షేపుల్లో ఉన్నాయి. కొన్ని చోట్లయితే మెట్లు పూర్తిగా విగిరిపోయాయి. ఎటువంటి రిపేర్లు చెయ్యలేదు. కొన్ని చోట్ల అసలు మెట్లు లేనే లేవు ఇక్కడ ఒకప్పుడు మెట్లు ఉండేవి అని గుర్తులు తప్ప. మెట్ల పక్కన కట్టిన జారుడుబండ లాంటి గట్టు మీంచి చక్కగా జారుకుంటూ  ఎక్కాల్సొచ్చింది.  దీనికి తోడు కొన్ని చోట్ల మెట్ల నిండా నీళ్ళు.  

       రైయ్యిమని కార్ లో వెళ్ళటం తప్ప  తిరుపతి కొండ కూడా కాలి నడకన  ఎప్పుడూ ఎక్కిన పాపాన పోలేదు.   అలాంటిది ఒకేసారి ఆరు వేల మెట్లంటే  అమ్మో ఇంకేమైనా ఉందా ఎంత గుండె  ధైర్యం కావాలి.   ఆ ధైర్యం ఎవరైనా ఇస్తారేమోనని ఎదురొచ్చిన వాళ్ళని ఆపి అడిగాం.   బాబోయి మోకాళ్ళు కొట్టుకుపోయాయని ఒకళ్ళు,  ఇంత కష్టమైన మెట్లు జీవితంలో ఎక్కలేదని  ఇంకొకళ్ళు,   సింగపూర్ నించి వచ్చిన ఆడవాళ్ళ బాచ్  అయితే ఆరింటికి  దిగటం మొదలు పెట్టాం ఇప్పటికి సగం మెట్లు దిగగలిగాం ఎక్కటానికి మాకు ఏడు గంటలు  పట్టిందని ధైర్యాన్ని కాస్తా నీరు కార్చేసారు.    మెట్లు ఎప్పుడూ తిన్నగా ఎక్కకూడదు డయాగనల్ పటార్న్ లో ఎక్కితే మోకాళ్ళ మీద అంత ఎఫెక్ట్ ఉండదని  సలహా కూడా ఇచ్చారు.    మాకు ఏడు గంటల పాటు తీరిగ్గా ఎక్కటానికి టైం లేదు.   వాళ్ళల్లాగా నెమ్మదిగా ఎక్కితే ఎలా ఉండేదో  ఎండ రాకుండా కొండపైకి వెళిపోవాలని   ఒక ఊపులో  ఎక్కేసరికి మనకున్న  బలానికి   సగం పైన మెట్లు ఎక్కేసరికి కాళ్ళు పని చెయ్యటం మానేశాయి.  




   దారి పొడుగునా షాపులున్నాయి. కింద నించి తిండేమీ మోసుకుంటూ వెళ్ళఖర్లేదు. చివరి మెట్లు మాత్రం చాలా స్టీప్ గా ఉంటాయి. అవి అయిదు వందల నించి వెయ్యి దాకా ఉండచ్చు. గ్రావిటేషనల్ పుల్ వెనక్కి లాగేస్తూ ఉంటుంది. లక్కీ గా ఆ మెట్లకి మాత్రం రైలింగ్ ఉంది. ఆ స్టేజికి వచ్చేసరికి కాళ్ళు ఎటూ చచ్చు పడిపోతాయి కాబట్టి చేతులు విల్ పవర్ రైలింగ్ సహాయంతోనే ఎక్కాలి.   


ఈ మెట్ల దారి నించి మాత్రం మంచి వ్యూస్  ఉన్నాయి. 





 
   మొత్తానికి రెండు మూడు లీటర్ల కూల్ డ్రింకులు, చాలా సీసాల మంచి నీళ్ళు, అయిదారు టీలతో ఒకటింపావు కల్లా పైకి చేరుకున్నాం. పైకి చేరుకోగలిగామన్న ఆనందం ఒకటైతే కనిపించిన వాళ్ళందరూ మబ్బుల వల్ల సూర్యోదయం చూడలేకపోయామని చెప్పటం చెప్పలేనంత పైశాచికానందాన్ని కలిగించింది.

        పైన చిన్న గుడుంది.   పాదాలు ఉన్నాయన్న చోట  గుడ్డ కప్పేసారు కాబట్టి పాదాలు చూడటానికి లేదు.  దాని కింద ఎనిమిదడుగుల లోపల బుద్ధుడి పాద ముద్ర ఉందిట.   గంట కూడా ఉంది.  కొండ ఎన్ని సార్లు ఎక్కారో గంట అన్ని సార్లు కొట్టాలిట.  

      కాస్త బిస్కెట్లు తిని రెస్ట్ తీసుకుని రెండుమ్పావుకి కొండ దిగటం మొదలుపెట్టాం.   మెట్లెక్కడమే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటే దిగటం దాని తాతలా ఉంది.   కాళ్ళు చచ్చు పడిపోయాయి కాబట్టి ఇంకవి మా కంట్రోల్లో లేవు.   అడుగులు  మెట్లు విరిగిపోయిన చోట కరక్ట్ గా ఆ విరుగులోనో లేకపోతే జర్రుమని జారే చోటో లేకపోతే  గోతిలోనో వాటిష్ట మొచ్చినట్లు  పడ్డాయి. 

     ఏ   తొమ్మిదిన్టికో ఎక్కటం మొదలు పెడతారనుకుంటే లోకల్స్ చాలా మంది మధ్యాహ్నం రెండింటికే  ఎక్కటం మొదలు పెట్టారు.  పదేళ్ళ పిల్లల్నించి ఎనభై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు నెత్తి మీద వంట సామాను, దిళ్ళు దుప్పట్లు పెట్టుకుని  ఎక్కేస్తున్నారు.   అంటే ఏ ఎనిమిది గంటల సేపో ఎక్కి పైనే వంట చేసుకుని ఓ కునుకు తీస్తారనుకుంట. 



దారి పొడుగునా ట్యూబ్ లైట్లు ఉన్నాయి.   కొంచెం చీకటి పడుతున్నప్పుడే లైట్లన్నీ వేసేస్తారు.   మెట్లన్నీ దిగేసరికి రాత్రి ఏడైంది.   అప్పటికే కొండెక్కే  వాళ్ళు వందల్లో మాకు ఎదురొచ్చారు.    కొండ దిగేసాక సిద్ధలేప సీసా కొనుకున్నాం.  మన జండూ బామ్  లాంటిది.  అక్కడ హాట్ కేకుల్లా  అమ్ముడు పోతోంది.  తెలివైన వాళ్ళు ఎక్కేటప్పుడే   కొనుక్కుంటున్నారు.   ఎలా అయితేనే వాన్ దాకా కాళ్ళీడ్చుకుంటూ రాగలిగాం.  

           నీ పాడ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి.  మోకాళ్ళకి సపోర్ట్ ఉంటుంది.    ఒక విషయమైతే అర్థమైంది.  తెల్ల వాళ్ళకి  పిక్క బలాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు అరవై ఏళ్ళకి కూడా బానే ఎక్కగలుగుతారు.  వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటే ఏ గుడిసో  వేసుకుని పర్మనెంట్ గా కొండ పైనే సెట్టయిపోవాల్సోస్తుంది.  

    

కొండ మీద కనిపించే తెల్ల గీత లాంటిది మెట్ల దారి.   పైన  కనిపించే ఇల్లు లాంటిది గుడి.     

     పదిన్నరకి హోటల్ చేరుకున్నాం. కదిలే ఓపిక లేదు. రూం కే సాండ్విచెస్ తెప్పించుకుని సిద్ధలేప సీసా మొత్తం పట్టించి చెరో రెండు పెయిన్  కిల్లర్లు మింగి ఓ యుగం పాటు రెస్ట్ తీసుకోటానికి రెడీ అయ్యాం.   కొండ దెబ్బతో మోకాళ్ళు పిక్కలు పట్టేసి మామూలు స్థితికి రావటానికి పది రోజులు పట్టింది.   

    ఇంతా ప్లాన్ చేసుకుని  కాళ్ళ నెప్పులని రూంలో తొంగుంటే కుదరదు  కదా.   ఆ రోజే నువార ఇలియా అనే ఊరు  కూడా వెళ్ళాలి.  పొద్దున్న టిఫిన్ తినేసి కాండీ  ఊరు చూడటానికి బయల్దేరాం.   కాండీలో ముఖ్యంగా చూడాల్సింది Tooth Relic Temple. 


దలద మలిగవ ( Dalada Maligawa )

Tooth Relic Temple, Kandy

   దలిద మలిగవ అనేది శిన్హళా భాషలో ఆ గుడి పేరు.  ఈ గుడి బుద్ధుడి పన్ను పెట్టడానికి కట్టారు.  బుద్ధుడు పోయిన తరవాత అతని చితిలో  పన్ను మాత్రం కాలకుండా ఉండిపోయిందిట.    ఆ పన్ను తీసి భద్రపరిచారు.  ఆ పన్ను ఏ రాజు దగ్గరుంటే ఆ రాజుకి అదృష్టం పడుతుందని నమ్మే వాళ్లుట.   ఆ  పన్ను కోసం యుద్ధాలు కూడా జరిగాయిట.  అది రకరకాల రాజుల చేతులు మారిందిట.   ఇండియాలో బౌద్ధ మతానికి కష్ట కాలం వచ్చేసరికి ఒరిస్సా రాణి తన జుట్టులో పన్ను దాచి  శ్రీలంకకి స్మగుల్  చేసిందిట.   అక్కడ కూడా అది చాలా ఊళ్ళు మారి ఫైనల్ గా కాండీలో సెటిల్ అయ్యింది. 

         మేము వెళ్ళిన రోజు పౌర్ణమి.    లోపలకి వెళ్ళాలనిపించలేదు.  కొండవీటి చాంతాడంత  క్యూ ఉంది.  రెండు మూడు గంటలు లైన్ లో నించుని లోపలి కెళితే  చివరికి ఏ గుడ్డో కప్పి దాని కింద పన్నుంది అంటారేమో అనిపించింది. 

      కాండీ  చాలా అందమైన ఊరు.   చుట్టూ కొండలు ఊరి మధ్యలో సరస్సు  చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.







ఊరు ఎంజాయ్ చేసేసి హోటల్కెళ్ళి లగేజ్ తీసుకుని నువార ఇలియ బయల్దేరాం. కాండీ నించి నువార ఇలియాకి డైరెక్ట్ ట్రైన్ లేదు. ముందు కాండీ నించి పెరడీనియా ( Peradeniya ) వెళ్ళాలి. పొద్దున్న 9.50 కి రైలు. పది నిమిషాలే ప్రయాణం. అక్కడ నించి నాను ఓయ ( Nanu Oya ) అనే ఊరికి 10.45 కి వేరే రైలు తీసుకోవాలి.     నాను ఓయ చేరటానికి మూడు గంటలు పడుతుంది. నువార ఇలియాకి రైల్వే స్టేషన్ నించి వాన్ లు ఉంటాయి.
   
      రైళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి.   ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి ఏసి తప్ప తేడా ఏమీ లేదు.   ఒకే రకమైన సీట్లు.   సీట్ల రంగులోనే మురికి కూపాల్లాంటి కర్టెన్లు.   కొలంబో నించి అనూరధపురకి ఫస్ట్ క్లాస్ లో వెళ్ళి విరక్తి తెచ్చుకున్నాం.   అందుకని ఈ సారి సెకండ్ క్లాస్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం.   ఇంక థర్డ్ క్లాస్ అయితే ఉట్టి చెక్క బెంచీలే. 

 





రైళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివే.  ఇంక రైలు పట్టాల మీద వెళ్ళదు.  గాలిలో ఊగుకుంటూ వెళుతుంది.   మొదటి అరగంటా చాలా భయమేసింది.  డెఫినెట్ గా పట్టాలు తప్పుతున్దనుకున్నాం.   కుదుపులు అలవాటు అయిపోయాక   టీ ప్లాన్టేషన్స్, వాటర్ ఫాల్స్  కొండలు లోయలు చూస్తుంటే అసలు టైమే తెలీలేదు.  అచ్చు స్విట్జెర్లాండ్ లో ఉన్నట్టుంది. 


















నువార ఇలియాలో ఉన్న హోటల్ పేరు Windsor. అప్పటి కలోనియల్ పెరియడ్ కి గుర్తుగా కట్టడాలు, పేర్లు అలానే ఉంచేసారు. సాయింత్రం ఇంటర్నెట్ సెంటర్ లో , మార్కెట్ తిరుగుతూ గడిపేసాం. శాకాహారులకి అమ్బల్స్ (Ambals) అనే ఫుడ్ ప్లేస్ బావుంటుంది. అక్కడ దోశ కొబ్బరి పచ్చడితో భోజనం చేసాం.  అక్కడ ఉన్న రెండు రోజులు అమ్బల్స్ లోనే తిన్నాం.   ఇండియా నించి ఎవరినా వస్తుంటే మా హోటల్ గురించి చెప్పండని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు.

    


     

Wednesday 19 October 2011

Sri Lanka - Anuradhapura


  కిందటి న్యు ఇయర్ కి శ్రీలంక వెళ్ళాం.   తొమ్మిది రోజుల ట్రిప్పు.   అప్పటికి  ప్రభాకరన్ని చంపి ఏడు నెలలే అయింది,  గొడవలు చాలా ఎక్కువగా ఉంటాయి, వెళ్ళద్దని చాలా మంది డిస్కరేజ్ చేసినా,  మొండిగా వెళ్ళి సక్సెస్ఫుల్ గా ట్రిప్ పూర్తి చేసాం.
  బ్రహ్మానందం స్టైల్లో చెప్పాలంటే ఇండియాని టేప్ రికార్డర్ లో పెట్టి ఓ యాభై ఏళ్ళు రివైండ్ చేస్తే  శ్రీ లంక వస్తుంది.  

        పొద్దున్న పదిన్నరకి చెన్నైలో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ తీసుకున్నాం. కొలంబో చేరేటప్పటికి పదకొండున్నర అయ్యింది. రెండు దేశాలకి టైంజోన్ లో తేడా ఏమీ లేదు. దాదాపు గంటన్నర సేపు ఎదురు చూసి కొలంబో ఫోర్ట్ స్టేషన్ ( colombo fort station ) కి  ఎయిర్ పోర్ట్ షటిల్ తీసుకున్నాం.  ఎయిర్ పోర్ట్ ఊరికి చాలా దూరం. రైల్వే స్టేషన్ కి వెళ్ళటానికి గంటన్నర పట్టింది. అనూరాధపుర కి నాలుగున్న ట్రైన్ కి టికెట్ తీసుకున్నాం. అనూరాధపురకి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదైంది.

    అనూరాధపుర, కాండి, నువార ఇలియ బేస్ గా పెట్టుకున్నాం.

        డే 1  :    అనూరాధపుర 
        డే 2  :    అనూరాధపుర - శ్రీ మహా బోధి 
       
        డే 3   :   అనూరాధపుర - ఎలిఫెంట్ సఫారి, సిగిరియా, డంబుల్ల 
       
        డే 4   :  కాండీ 

        డే 5   :  కాండీ - శ్రీ పాద 

        డే 6   :  నువారా ఇలియా 

        డే 7   :  నువారా ఇలియా - సీతా కోవిల్, రావణ ఫాల్స్ 

        డే 8   :  కందపోల 

        డే 9   : కందపోల 
    
 
అనూరాధపుర

అనూరాధపురలో " నువారవేవ " ( Nuwarawewa) అనే రెస్ట్ హౌస్ లో బుక్ చేసుకున్నాం.  రెండు  రోజుల పాటూ అక్కడే. అనూరధపుర నించి చాలా ప్రదేశాలు దగ్గర కాబట్టి, అక్కడ నించే ప్లాన్ చేసుకున్నాం. పొద్దున్న టిఫిన్ తినేసి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ బయల్దేరాం. తుంపర మొదలైంది. ఓ షాప్ లో దూరి గొడుగులు కొనుక్కున్నాం. అదేమి విచిత్రమో కాని మేమేదేశం వెళ్ళినా, తీసుకెళ్ళిన రెండు గోడుగులూ ఒకేసారి పాడవటమో, లేక పోతే ఎండగానే ఉంది కదా, అనవసరమైన మోత బరువెందుకని వాటిని రూంలో వదిలేస్తే మధ్య దారిలో హోరున వర్షం రావటమో జరిగి గొడుగులు కొనాల్సొస్తుంది. అలా ఇప్పుడు మా దగ్గర శ్రీలంక గొడుగులు, పారిస్ గొడుగులు, ఇటలీ గొడుగులు ఇలా చాలా గొడుగులు చేరాయి.
    
         అనూరాధపురని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన పురాతనమైన గుళ్ళు, స్తూపాలు చాలా ఉన్నాయి. ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. ఊరు పల్లెటూరులా ఉంది.   ఇదే కాదు శ్రీలంక లో చాలా ఊళ్లు కుగ్రామాలలాగా చాలా వెనకపడి ఉంటాయి. ఉన్న డబ్బంతా ఎల్టిటిఈ కే సరిపోయిందిట. ఇప్పుడిప్పుడే కాస్త డెవలప్మెంట్ మొదలు పెట్టారు.          
   
      నడక చాలా బావుంది.  తుంపర, రోడ్డుకి రెండు వైపులా పొలాలు. 


శ్రీ మహాబోధి (Sri Maha Bodhi )

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోకుడి కూతురు సంగమిత్ర బౌద్ధ సన్యాసినిగా మారి, ప్రచారానికి వచ్చినప్పుడు గయలో బుద్ధుడు కూర్చుని తపస్సు చేసిన బోధి చెట్టు కొమ్మ ఒకటి తెచ్చి ఇక్కడ పాతిన్చిందిట. ఆ చెట్టుకిప్పుడు రెండు వేల ఏళ్ళు.  మనిషి నాటినట్లు  రికార్డు చేసిన వాటిలో  ప్రపంచంలో ఇదే oldest చెట్టుట.  ఈ చెట్టు విత్తనాలే ప్రపంచంలో చాలా బౌద్ధ స్థలాలలో నాటారుట. గయలో కూడా పాత చెట్టు చచ్చిపోతే అనూరాధపుర నించే తీసుకొచ్చి నాటారుట.


Entrance to the Temple




Bodhi Tree

 మేము వెళ్ళింది ఆదివారం. అందుకని చాలామందే ఉన్నారు. ఎవరో కొందరు తప్ప దాదాపు అందరూ తెల్ల డ్రెస్సుల్లోనే వచ్చారు. హిందూమతం నించే వచ్చింది కాబట్టి దాదాపుగా హిందూ సాంప్రదాయాలే. చెప్పులు గుడి బయటే వదిలెయ్యాలి. అవే ధూప, దీప, నైవేద్యాలు. గుడికి ఆదివారాలు వెళ్ళటం, తెల్ల బట్టలు వేసుకోవటం తరవాత కాలంలో క్రైస్తవ మతం తెచ్చిన ఆచారమేమో. 


The Buddha in the Main Temple

బోధి చెట్టు తర్వాత చూడాల్సిన బౌద్ధ స్తూపాలు చాలా ఉన్నాయి.   సెక్యూరిటీ గార్డ్ ని అడిగి దారి కనుక్కుని బయల్దేరాం.  


రువాన్మలి మహా స్తూప

Ruwanmali Maha Stupa


ఈ స్తూపాలు నాలుగు వైపులా మూసేసే ఉన్నాయి. లోపల బౌద్ధ మతానికి చెందిన తాళపాత్ర గ్రంథాలో, బుద్ధుడికి సంబంధించిన వస్తువులో ( relics ) పెట్టి మూసేస్తారుట. వాటికి ఆక్సెస్ ఏమీ లేదు మరి.
   
     ఇలాంటిదే కొంచెం చిన్నది తూపారామ డగోబ.  మిగిలున్న స్తూపాలలో ఇదే ప్రపంచంలో పురాతనమైన స్తూపంట. దీనిలో బుద్ధుడి కుడి కాలర్ బోన్ ఉందిట. 

      తరవాత చూసినది జేతావనారామ డగోబ.  కట్టినప్పుడు దీని ఎత్తు 400  అడుగులుట.  పైన టిప్  విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ. 

జేతావనారామ డగోబ


Jetavanarama Dagoba





Reclining Buddha in the Sanctum Sanctorum

    ఏమిటీ అన్నిటికీ చివర రామ అనుంది అనుకున్నా.  కొంచెం ఆలోచిస్తే అర్ధమయింది.  అది రామ కాదు, ఆరామ అని.  అంటే బౌద్ధ ఆరామాలు అనమాట.

       గుళ్ళల్లో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది.   హ్యాండ్ బాగ్గులు చెక్ చెయ్యటమే కాకుండా మెటల్ డిటెక్టర్ లతో కూడా చెక్ చేసారు.    గుళ్ళలోనే కాదు, దేశం మొత్తం టైట్ సెక్యురిటి ఉంది.  అనూరధపుర జాఫ్నకి దగ్గరగా ఉంది కనక, ఇక్కడ ఇంకా ఎక్కువ.
   
      ఒకొక్క గుడి ఊరంతుంది.     దీనికి తోడు స్థూపం చుట్టూ తిరగాలంటే ఓ అర కిలోమీటరు నడవాలి.   ఈ నాలుగు గుళ్ళూ తిరిగేసరికే కాళ్ళు అరిగిపోయాయి.    ఇంకా చూడాల్స్నిన  స్తూపాలు,  తవ్వకాలు జరిగిన  స్థలాలు ఉన్నా ఓపిక లేదు.   ఆటో ఏమన్నా కనిపిస్తుందేమోనని చూసాం కాని ఎక్కడో ఊరు చివర అడవిలా ఉంది.  ఆటోలేమొస్తాయి.    పొద్దున్న  ఆహా ఓహో ఈ నడక అనుకుంటూ బయల్దేరిన మేము,  మధ్యాహ్నమయ్యేసరికి  ఛి వెధవ్వూరు అని తిట్టుకుంటూ  కాళ్ళీడ్చుకుంటూ మధ్యలో దారి తప్పుకుంటూ  మొత్తానికి పది కిలోమీటర్ల  పైన  నడిచి  ఊళ్ళో పడ్డాం.   హోటల్లో తినాలనిపించక బయిట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెజ్ ఫ్రైడ్ రైస్, పళ్ళు కొనుక్కుని లంచ్ అయిన్దనిపించాం.

        రెస్ట్ హౌస్కెళ్ళి క్రోసిన్ మింగి, తరవాత  రోజుకి వాన్ మాట్లాడుకున్నాం.  


హబరణ, సిగిరియా, డంబుల్ల :    

     పొద్దున్నే ఎనిమిదన్నరకల్లా  రెస్ట్ హౌస్ నించి వాన్ లో బయల్దేరాం.   మొదట హబరణ అనే ఊళ్ళో  ఎలిఫంట్ సఫారి.
    
       ఎలిఫంట్ సఫారి గంట సేపు.    ఒక గది ఉన్న చిన్న పెంకుటిల్లె ఆఫీస్.  బయట మాస్కులు అవీ పెట్టుకున్నాడు అమ్మటానికి.    బేరం ఆడటానికి చాలా ట్రై చేసాం కాని అస్సలు కుదరలేదు.    రోడ్డు క్రాస్ చేస్తే ఒక ఏనుగు,  దాన్ని ఎక్కడానికి మెట్లు.   ఆ ఏరియా అంతా ఇలాంటి సెట్టిన్గులే.     



             
ఎలిఫంట్ సఫారి గంట సేపు.    ఒక గది ఉన్న చిన్నపెంకుటిల్లె ఆఫీస్.  బయట మాస్కులు అవీ పెట్టుకున్నాడు అమ్మటానికి.    బేరం ఆడటానికి చాలా ట్రై చేసాం కాని అస్సలు కుదరలేదు.    రోడ్డు క్రాస్ చేస్తే ఒక ఏనుగు,  దాన్ని ఎక్కడానికి మెట్లు.   ఆ ఏరియా అంతా ఇలాంటి సెట్టిన్గులే.












ఏనుగు మెయిన్ రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా భయమేసింది. గోతుల్లో గొప్పుల్లో బండి మీది వెళుతుంటే ఎలా ఉంటుందో అలా ఊగుకుంటూ కూర్చున్నాం. దానికి తోడు రోడ్డు మీద లారీలకి  అదెక్కడ భయపడి పరిగేడుతుందో అని ఇంకో భయం.   ఎప్పుడైతే మట్టి రోడ్డులోకి వెళ్ళామో ఆ గుంటల్లో దాని నడకే మారిపోయింది. ఒక్క కుదుపు కూడా లేకుండా హాయిగా ఉంది.


















ఏనుగు  వెళ్ళే దారి దాదాపు  వన్ వే.    బాగా ట్రైన్ అప్  అయిపోయాయి కాబట్టి మధ్య మధ్యలో  ఎదురొచ్చే  ఏనుగుల  వల్ల ట్రాఫిక్ జాములు అయినా అవేమి ఖంగారు పడలా.    పక్కకి దూరే సందొచ్చే వరకు వెనక్కి నడిచి పక్కకి జరిగి ఎదురుగా వచ్చే వాటికి దారిచ్చాయి.

     సఫారీ అయిపోగానే పక్కనే ఒకడు అరటి పళ్ళ అత్తం పట్టుకుని నించున్నాడు.    అవి అమ్మడానికని మాకు తెలీలేదు.    నా దగ్గర నాలుగు అరటి పళ్ళు ఉంటే దానికి ఇచ్చా.    అదింకా ఆశగా చూసింది.   మావటి వాడు చెప్పాడు అసలు సంగతి.  పాపం వాటికి టూరిస్ట్లు పెట్టే అరటి పళ్ళే తిండేమో.   స్పెన్సర్ రేటుకి వాడి దగ్గర కొని దానికిస్తే హాపీ అయిపొయింది.

       అక్కడ నించి  సిగిరియ బయల్దేరాం.


సిగిరియ రాక్ ఫోర్ట్ :


Sigiriya Rock


దీని అసలు పేరు సింహ గిరియ.    కశ్యప  అనే రాజు  ఈ 600  అడుగుల ఎత్తైన రాతి మీద తన కోట కట్టుకున్నాడు.   1891  తవ్వకాలలో బయటపడింది.   ఈ రాయి వోల్కానిక్ ప్లగ్.    

          అనురాధాపుర రాజు ధాతుసేనకి ఇద్దరు కొడుకులు.   పెద్దవాడు కశ్యప,  రెండో వాడు ముఘల.   ముఘల రాణి కొడుకు, కశ్యప ఒక వేశ్య  కొడుకు.  రాజు ముఘలని వారసుడిగా ప్రకటించాడుట.   దోసిళ్ళతో నీళ్ళు తీసుకుని పైకి ఎగరేసి కశ్యపతో ఇదే నేను నీకిచ్చే ఆస్తి వ్యవసాయం చేసుకో అన్నాట్ట.    అతనికి కోపం వచ్చి ధాతుసేనని అక్కికక్కడే చంసేసాడు.   ముఘల ఇండియా పారిపోయాట్ట .   కశ్యప  తన కోట ఈ రాయి మీద కట్టుకుని పద్దెనిమిదేళ్ళు పాలించాడు ( 5th century A.D ).   ముఘల బలం పుంజుకుని తిరిగొచ్చాక   కశ్యపతో  యుద్ధానికి దిగేడు.   యుద్ధం  హబరణలో జరిగింది.   ఆ రణం నించే దానికా పేరు.  యుద్ధంలో కశ్యప  సైన్యం పారిపోయిందిట.   ఓడిపోయాడని తెలిసి కశ్యప  కూడా  పొడుచుకుని చచ్చిపోయాడు.  ముఘల సింహగిరియాని బౌద్ధ సన్యాసులకి ఇచ్చేసి అనురాధాపుర నించి పాలించాడుట.   అప్పటి నించీ ఇది బౌద్ధ భిక్షువులకి  మెడిటేషన్ పాయింట్  అయింది.   సిగిరియా ని పాలించిన ఒకే ఒక్క రాజు కశ్యప.


  కోటకి వెళ్ళే దారిలో రెండు వైపులా గార్డెన్, ఫౌంటైన్లు, రాయల్ బాత్స్  ఉన్నాయి.   కొండ రాళ్ళు రకరకాల జంతువుల ఆకారాలలో ఏర్పడ్డాయి.    చాలా గుహలు కూడా ఉన్నాయి.   ఆ గుహలలోనే బౌద్ధ సన్యాసులు తపస్సు చేసుకునేవారుట.
 
cobra hood rock 
 






మొత్తం మెట్లు పన్నెండు వందలు.  ఇంకా ఎక్కువ కూడా ఉండచ్చు.   వీటిలో అక్కడక్కడా అయిదు, పది  చప్పున దాదాపు రెండు వందల  దాకా   గార్డెన్ లోనే ఉంటాయి.   ముందు రోజు వానొచ్చిందని జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఇక్కడ విపరీతంగా ఎండ.   వెళ్ళిన పావుగంటకే తీస్కెళ్ళిన మంచినీళ్ళు అయిపోయాయి.   బాటిల్ కొనాలంటే మళ్ళీ ఓ మైలు దూరం నడవాలి.    బాగ్ వెతికితే రెండు కమలాలు కనిపించాయి.   అన్ని మెట్లూ  రెండు కమలాలతో మేనేజ్ చేసేసాం.

           రాతి పైకి మెట్లు ఎక్కుతుంటేనే మధ్య మధ్యలో చూడాల్సినవి చాలా ఉంటాయి.   పైనించి గార్డెన్, ఫౌంటైన్ల మంచి వ్యూ కనిపిస్తుంది.    దూరంలో బుద్ధుడి విగ్రహం. 
 
 
 
దాదాపు సగం దూరం ఎక్కాక  మిర్రర్ వాల్,  పెయింటింగులు  వస్తాయి.    మిర్రర్ వాల్  మూడు మీటర్ల ఎత్తు గోడ.  దీన్ని అద్దం లాగా నున్నగా పోలిష్ చేసారుట.   
 

Mirror Wall

ఇప్పుడు షైన్ దాదాపు  పోయి మామూలు గోడ లాగే ఉంది.   

       గోడల మీద ఆ కాలం నాటి పెయింటింగులు ఉన్నాయి.      అయిదు వందలు ఉండేవిట,  ఇప్పుడు దాదాపు ఇరవై మిగిలాయి.   బౌద్ధ సన్యాసులొచ్చాక   ఫ్రెస్కోస్ బాలేవని చేరిపేసారుట. 
 
 
 
 తరవాత వచ్చేదే లయన్ ప్లాట్ ఫాం.  సింహ గిరియ అనే పేరు దీన్నించే వచ్చింది.   ఇవే ఫైనల్ మెట్లు, కష్టమైన మెట్లు కూడా.    హైట్ ఫోబియ ఉన్న వాళ్లకి ఇంకా కష్టంగా ఉంటుంది.  
 
 
సింహం నోటిలోంచి లోపలి వెళ్ళేటట్లు మెట్లు కట్టారు.   ఇప్పుడు నోరు, మొహం అన్నీ పోయాయి.  సింహం paws  మాత్రం  మిగిలాయి.   కనిపించే రాతి మెట్లే ఒరిజినల్ వి.  
 
 
 

Summit

 
 
పైన దాదాపు నాలుగెకరాలుట.    ఇప్పుడు చూడటానికి కోట ఏమీ మిగలక పోయినా,   అంత కష్టపడి ఎక్కినందుకు  పైనించి మంచి 360  డిగ్రీ వ్యూ ఉంది.    ఇక్కడ ఎండ కొండ ఏమీ లేదు.  చల్లటి గాలి.   హాయిగా కొంచెం సేపు కాళ్ళు బార్లా జాపుకు కూర్చుని మళ్ళీ దిగటం మొదలు పెట్టాం.   సిగిరియ రాయి ఎక్కి దిగటానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. 

          అక్కడ నించి డంబుల్ల బయల్దేరాం.   తిండి తినే టైం లేదు.    మళ్ళీ గుడి మూసేస్తారని డ్రైవర్ భయపెట్టేసరికి ఏమీ తినకుండానే ఉండి పోవాల్సొచ్చింది. 

 డంబుల్ల - గోల్డెన్ టెంపుల్
 
 
Golden Temple, Dambulla

 
దీని ఎత్తు 100  అడుగులు.    ప్రపంచంలో ఉన్న బుద్ధుడి విగ్రహాలలో ఇదే పెద్దదని అక్కడ రాసుంది కానీ నాకు డౌటే.  

      వలగంబ అనే రాజు తన రాజ్యం మీదకి వేరే రాజు  దండయాత్రకి వచ్చినప్పుడు అనురాధపుర నించి పారిపోయి ఈ గుహలలో పదిహేనేళ్ళ పాటూ దాక్కునాడుట.     అంత కాలం పాటు బుద్ధుడే తనని రక్షించాడు కాబట్టి, తన రాజ్యం తిరిగి పొందేక,   క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో ఈ గుహలని బుద్ధుడి గుడిగా మార్చాడు.    తరవాతి రాజులు బుద్ధుడి విగ్రహాలు  కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయారు. 

         గుహలు చూడటానికి టికెట్లు కొన్నాం.    షరా మామూలే.   కొండెక్కాలి.  కొండ మీద  వేరే కొండ రాయికి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నాయి గుహలు.   ఎక్కేటప్పుడు మెట్ల దారి లేదు.   స్లోపీగా ఉన్న కొండ రాతి మీంచే ఎక్కాలి.    మధ్యమధ్యలో ఐస్ క్రీములు, అవీ అమ్ముతూ వుంటారు.  కొనేదాకా వాళ్ళు వదలరు, కొన్న తరవాత కోతులు వదలవ్.
 
 
Dambulla Cave Temple

 
మొత్తం అయిదు గుహలు.  వీటి నిండా బుద్ధుడి విగ్రహాలే.  ఇద్దరో, ముగ్గురో హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారు.   సీలింగ్ మీద కూడా బుద్ధుడి పెయింటింగులు వేసారు.  
 
 
 
 
 

 
దిగే దారి మాత్రం మెట్ల దారి.   నాలుగు వందల మెట్లని డ్రైవర్ చెప్పాడు. 
 
 
 
 
 
 
మెట్లు దిగే శ్రీలంక ఆడవాళ్ళ డ్రెస్సులు చూసారా. అక్కడ అందరూ అవే డ్రెస్సులు. చిన్న వాళ్ళ నించీ ముసలి ముతక దాకా షర్టు స్కర్టు. కొందరు స్కర్టు బదులు హాయిగా లుంగీలు కట్టేస్కున్నారు. డ్రైవర్ నడిగా ఏమిటీ ఎవరూ చీరల్లో కనిపించట్లేదు అసలు మీ నేషనల్ డ్రెస్ ఏది అని. ఈ రోజుల్లో అందరివీ ఇవే డ్రస్సులు ట. గయ చూడటానికి ఇండియా వచ్చినప్పుడు లుంగీలు లాట్ లో కొనుక్కు వెళతారుట. ఇండియా లో లుంగీలు చాలా చవకట. కండీ, నువార ఇలియల లో మాత్రం చాలా మంది చీరల్లో కనిపించారు.