Sunday 1 September 2013

Italy - Catania


    టీవీలో గ్లాడియేటర్ సినిమా వచ్చిన ప్రతీసారి చూస్తాకానీ మొన్న చూస్తూంటే  మాత్రం మా ఇటలీ ట్రిప్ గుర్తొచ్చింది.  ఇటలీ వెళ్ళి అప్పుడే అయిదేళ్ళు అయిపోయింది.   ఒకసారి నా డైరీ తిరగేసా.   రెండేళ్ళ క్రితం మొదలు పెట్టి వదిలేసిన నా బ్లాగ్ మళ్ళీ మొదలు పెట్టాలనిపించింది .   ఇటలీకి సంబంధించి రెండు పోస్ట్లు ఆల్రెడీ  డ్రాఫ్ట్ లో ఉన్నయి. 

    అయిదేళ్ళ  క్రితం లండన్ నించి ఇండియాకి తిరిగొచ్చేసాం.  మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తుందో  లేదో  తెలీదు ఏదైనా ప్రదేశం చూసి బయల్దేరదామనుకున్నాం.  ( నాలుగు నెలల కల్లా గోడక్కొట్టిన బంతుల్లా మళ్ళీ వెళ్ళాం అనుకోండి అది వేరే విషయం ).     యూరప్ లో చూడాలనుకున్న వాటిలో  ఇటలీ, గ్రీస్, స్పెయిన్  మిగిలిపోయాయి.  ప్రపంచంలో యునెస్కో లిస్టు చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఎక్కువగా ఉన్నది ఇటలీట.  అక్కడ నలభై నాలుగు  సైట్లున్నాయిట .  కాబట్టి ఏప్రిల్ నెలలో ఇటలీ బయల్దేరాం.

   మొత్తం పదమూడు రోజుల ట్రిప్పు.    చూడాల్సిన ప్రదేశాల లిస్టు పెద్దదే.  సిసిలీ, సొరెంటో, రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్.  వీటితో పాటు వాటి పక్కనున్న చిన్నా చితకా ఊళ్లు.   మొదట స్టాప్ సిసిలీలో ఉన్న కెటేనియా.    సిసిలీ ఇటలీలో ప్రాంతమే అయినా మెయిన్ ల్యాండ్ లో ఉండదు.  అదొక ద్వీపము.   

డే 1                   :  కెటానియా
డే 2                   :  కెటానియ  --  mt  ఎట్న , కెటానియా
డే 3                   :  సొరెన్టో       -- పాంపె , హెర్క్యూలేనియం
డే 4                   :  సొరెన్టో       -- కేప్రి
డే 5                   :   సొరెన్టో      -- పోసిటానో , ఎమల్ఫీ
డే 6,7 & 8         :   రోమ్
డే 9                   :  ఫ్లోరెన్స్      - పీసా
డే 10                 :  ఫోరెన్స్
డే 11, 12 & 13  :  వెనిస్

 కెటానియా (Catania)

   మధ్యాహ్నం 12.45 కి గాట్విక్ విమానాశ్రయం నించి  ఫ్లైట్ బయల్దేరింది.   కెటానియా బెల్లినీ ఎయిర్ పోర్ట్ చేరేటప్పటికి  అక్కడి లోకల్ టైం 4.45 అయింది.  ఇటలీ యుకే కంటే గంట ముందుంది.   ఎయిర్ పోర్ట్ నించి  ట్రైన్ సర్వీస్  లేదు కాని బస్ సర్వీస్ ఉంది.    మేము బుక్ చేసుకున్న హోటల్  ట్రైన్ స్టేషన్ నించి  అయిదు నిమిషాల నడక.  స్టేషన్ కి  # 457 బస్ తీసుకున్నాం.  హోటల్ పేరు " డి కర్టిస్".  


 
 దాదాపు ఏడున్నరకి ఊరు చూడటానికి బయల్దేరాం.    కటానియాలో ముఖ్యంగా చూడాల్సిన స్క్వేర్  పియట్జా డుఓమొ.   దీన్ని ఎలిఫెంట్ స్క్వేర్ అని కూడా అన్టారనుకున్టా.  అక్కడ ఎలిఫెంట్ స్టాట్యూ, బెల్లిని ధియేటర్, సెయింట్ అగాథా డుఓమొ (చర్చి)ఉన్నాయి.   అసలు కెటానియాలో సందడంతా  అక్కడే ఉన్నట్టుంది.   ఒకవైపు ఫౌంటెన్, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, ఇంకో వైపు చేపల మర్కెట్టు.  రోడ్లు తిరక్కుండా  ఏనుగు విగ్రహం ఉన్నమెట్ల మీదే కూర్చుని టైం గడిపేయచ్చు.   గొడుగులు, చిన్న చిన్న వస్తువులు అమ్మే వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళే.   చేపల మార్కెట్ సందుల వరుకు రోడ్లు జనాలతో కిటకిటలాడుతూనే ఉన్నాయి.    దాటి  ఇంకా ముందుకు వెళితే మాత్రం రోడ్లు నిర్మానుష్యగా ఉండి కొంచెం భయమేసింది.  హోటల్ కి తిరిగొచ్చేటప్పుడు కూడా రోడ్డు మీద మేమిద్దరమే ఉన్నామేమో కొంచెం షేడీగా అనిపించింది.    రాత్రయింది,  అసలు సిసిలీలోనే మాఫియా మొదలైంది అంటారు కాబట్టి కొంచెం భయం వేసి ఉండచ్చు.  దానికి తోడు ఇళ్ళు  కూడా బాగా పాతపడి భూత్ బంగళాల్లా కనిపిస్తాయి. 
 


 మౌంట్ ఎట్న ( Mt. Etna )

  పొద్దున్న తొమ్మిదింటికి మౌంట్  ఎట్నా(Mt. Etna ) కి హాఫ్ డే ట్రిప్ తీసుకున్నాం.    మొత్తం ఏడుగురం.  మేమిద్దరం, నలుగురు ఇంగ్లీష్ వాళ్ళు, ఒక అమెరికన్.  డ్రైవరే గైడ్.

   ఎట్న అనేది యూరప్ లోకే ఎత్తైన ఆక్టివ్ వాల్కెనో.   దీని ఎత్తు 10,000 అడుగులు (3300 మీటర్లు).   కేటానియాకి దగ్గరలో ఉంది.  కొండ ఎక్కే  దారిలో రోడ్డుకి రెండు వైపులా లావానే.  లావాలో కూరుకుపోయిన ఇళ్ళు కూడా చూడచ్చు.   మూడు నాలుగు చోట్ల జీప్ ఆపి డ్రైవర్ హిస్టరీ చెప్పాడు.   వెహికల్స్ ఆగే చోట లావాతో చేసిన బొమ్మలు, నిమ్మకాయలు అమ్ముకుంటూ ఉంటారు.   నిమ్మకాయలు చాలా చవక.  పది కాయలు ఒక యురొ. 





   మేము రెండు వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లినట్టు గుర్తు.    ఇదే బళ్ళు వెళ్ళే హైయెస్ట్ పాయింట్.   పేరు రెఫ్యుజియో సాపిఎంజా (Refugio Sapienza ).   ఇక్కడ బండి దిగిపోయి లావా మీద నడుస్తూ చుట్టూ చూడచ్చు.  చాలా కాలం క్రితమే ఎండిపోయింది కనక ఇప్పుడది మన రోడ్లు వేసే తారులా ఉంది.   ఇక్కడే పార్కింగ్  లాట్, రెస్టారెంట్లు, సువనీర్ షాపులు ఉంటాయి.   ఇక్కడ్నించి కేబుల్ కార్ కూడా ఉంది .   మేము వెళ్ళినప్పుడు ఎందుకనో కేబుల్ కార్ లేదు.    ఇక్కడి నించి ట్రెక్కింగ్ కూడా చెయ్యచ్చుట.     ఈ అగ్నిపర్వతం ఆక్టివ్ గా ఉంది కనక అదృష్టం ఉన్న వాళ్ళు అది బద్దలవటం కూడా చూడచ్చు. 

 .  
  పైన తిరగటానికి గంట టైం ఇచ్చారు.  రెస్టారంట్లో స్వీట్ తిని కాఫీ తాగి కిందకి బయల్దేరాం.   అక్కడ పిస్తా పంట ఎక్కువ.  పిస్తా, రికోటా చీస్తో స్వీట్లు సేవరీ ఐటమ్స్ కూడా ఉన్టాయి.  దిగేటప్పుడు మళ్ళీ ఒకట్రెండు  చోట్ల ఆపి క్వారి,  లావా తో ఏర్పడిన టన్నల్ చూపించాడు.   లావా రాళ్ళు  ఇళ్ళు కట్టుకోటానికి  వాడతారు.   
       లావాతో ఏర్పడిన టన్నల్  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.    లావా పై లేయర్ ముందు చల్లారి గట్టిపడింది.  కింద లేయర్లలో లావా చాలా కాలం ప్రవహించి నెమ్మదిగా గట్టిపడింది.   ఈ ప్రవహించిన దారి పెద్ద టన్నల్  లాగా ఏర్పడింది.   ఇది 1300 మీటర్ల పొడుగు, 300 మీటర్ల ఎత్తు ఉంది.  పైన లేయర్ మీదే రోడ్డు వేసారు.   టార్చ్ లైట్లతో లోపలి వెళ్ళి చూడచ్చు. 

   మధ్యాన్నానికల్లా కెటానియా వచ్చేసాం.  భోజనం చేసి  ఊరు చూద్దామని బయల్దేరేమో  లేదో పెద్ద వాన.   మా ఆనవాయితీ ప్రకారం  చెరో గొడుగు కొనుక్కుని బయల్దేరాం.

కెటానియా ( Catania)

     రాత్రి  చూసిన ఎలిఫెంట్ స్టేట్యూ, చర్చి ఉన్న సెంటర్ నించే మళ్ళీ మొదలుపెట్టామ్.  ఏనుగు కేటానియా సింబల్.  దీన్ని లావా రాళ్ళతో కట్టారు.


St.Agatha's cathedral, Bellini's tomb

Elephant Statue, Symbol of Catania
  పదిహేడో శతాబ్దంలో భూకంపాలవల్ల, అగ్ని పర్వతాల వల్ల ఇప్పుడు చర్చ్ ఉన్న ప్రదేశమ్లో రోమన్ కట్టడాలు శిథిలమైపొయాయి.  అప్పుడు సెనేట్ అగాథా స్మ్రితికి చర్చి కట్టారు.    సెయింట్ అగాథాని రోమన్ రాజుల పరిపాలనలో వాళ్ళకి లొంగలేదని చంపేసారు.   ఈ చర్చిలో బెల్లినో సమాధి కూడా ఉంది.  బెల్లిని కెటానియాకి చెందినా ముజిషియన్.  ఎయిర్పోర్ట్ కి అతని పేరే పెట్టారు.  ఇళ్ళు కూడా మొత్తం పొయినాయి.   సెనేట్ తిరిగి ఇళ్ళు కట్టించినప్పుడు పాత ఆర్కిటెక్చర్ ని అలానే ఉంచడం కోసం బోరోక్ స్టైల్లో కట్టారు.                 

Roman Amphitheatre

ఇటలీ అంటేనే గ్లాడియేటర్లు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటానికి కట్టిన ఆమ్ఫిథియేటర్లు.  చిన్న ఊళ్ళో చిన్నవి, పెద్ద ఊళ్ళో పెద్దవి.   కేటానియాలో ఉన్న దాన్ని రెండో శతాబ్దంలో ఏంటోనినియన్ అనే చక్రవర్తి కట్టించాడు.  పదిహేను వందల మంది పట్టేవారట ఇందులో.  ఐదో శతాబ్దమ్ లోనే దీన్ని వాడటం మానేసారు.  తరవాత రాజులు చర్చిలు అవీ కట్టటానికి దీన్లో చాలా భాగం పీక్కుపొయారు.  పదిహేడో శతాబ్దంలో వచ్చిన  భూకంపం వల్ల ఇది భూస్థాపితమైపోయింది.   తర్వాత తవ్వకాలలో బయటపడింది.



  ఈ రెండు రోజుల్లో ఇండియాకి ఇటలీకి కొన్ని పోలికలు కనిపించాయి.  మొదటిది షాపుల దగ్గర,  సందు మొదట్లో జనాలు గుంపుగా  నించుని కబుర్లు చెప్పుకోవడం.  రెండోది బట్టలారెయ్యటం.    
 
     ఏప్రిల్ లో  పొద్దున్న ఎండ  చలి లేకుండా బావుంది.   రాత్రి మాత్రం  కొంచెం చలనిపించింది.   మామూలు స్వెటర్ సరిపోయింది.    ఎట్న వెళ్ళటానికి మాత్రం కోటు, షూ, గ్లవ్స్ తప్పనిసరి. 
   
   రాత్రి పదిన్నరకి కేటానియా సెంట్రల్ స్టేషన్ నించి నేపుల్స్ కి ట్రెన్ఇటాలియా ( national rail ) తీసుకున్నాం.    పొద్దున్న ఆరున్నరకి  నేపుల్స్ చేరుకుంది.  నేపుల్స్ నించి ఏడింటికి సర్కంవెసూవియానా (local train ) తీసుకుని ఎనిమిదింటికి సొరెంటో చేరుకున్నాం.  తర్వాతి బేస్ సెయింట్ ఎన్యేల్లో (St. Agnello).  సొరెంటో నించి టాక్సీలో పది నిమిషాలు. 

       సిసిలీ నించి నేపుల్స్ కి  రైలు ప్రయాణం మిస్ కాకూడదు.  సిసిలీ ఐలాండ్ కాబట్టి ఇటలీ మెయిన్ ల్యాండ్ కి రైలు పట్టాల  మార్గం లేదు.  సిసిలీ చివరికొచ్చాక మెర్సినియా అనే ఊరు నించి మెయిన్ ల్యాండ్ కి పడవలో వెళ్ళాలి.  మనం స్పెషల్ గా రైలు దిగి పడవ ఎక్కకుండా ట్రైన్న్నే పడవలోకి ఎక్కించేస్తారు.  పల్లెటూళ్ళో సైకిళ్ళూ, స్కూటర్లు బల్లకట్టులోకి ఎక్కించినట్టు.  రైలు రెండు మూడు బోగీల కొకచోట విడిపోయి షిప్ లో పేరలల్ గా ఉన్న పట్టాల మీదకి ఎక్కేస్తుంది.      ప్రయాణం నలభై అయిదు నిమిషాలు ఉన్నట్టు గుర్తు.   హాయిగా రైల్లోంచి దిగిపోయి కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చెయ్యచ్చు.  



No comments:

Post a Comment