Friday 7 October 2011

Egypt - Cairo

 
 పిరమిడ్స్


ట్రైన్ గీజా స్టేషన్ చేరేటప్పటికి ఆరైంది.   మా గైడు, వాన్ డ్రైవరు బైట మా కోసం ఎదురు చూస్తున్నారు.  వాన్ ఎక్కేసి డైరెక్ట్ గా పిరమిడ్లకి బయల్దేరాం. 

        పిరమిడ్ల గురించి చెప్పేముందు కొంచెం హిస్టరీ చెప్పాలి.  మొదట ఈజిప్ట్ అనబడే ప్రాంతం చిన్న చిన్న పల్లెటూళ్ళుగా ఉండేదిట.  క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలో మెనిస్ అనే రాజు అన్ని ఊళ్ళనీ కలిపి ఈజిప్ట్ ఏర్పరిచాడు.  ఆ రోజుల్లో ఈజిప్ట్ అనే వారు కాదనుకోండి.   దానిలో ముఖ్యమైనవి అప్పర్ ఈజిప్ట్, లోయర్ ఈజిప్ట్.  కట్టడాల మీద ఉండే  పెపైరస్  పువ్వు, తామర పువ్వు  ఏ ప్రాంతపు  రాజో ఎలా తెలుపుతాయో, అలాగే  వాళ్ళు పెట్టుకునే కిరీటం  బట్టి కూడా రాజు ఏ ప్రాంతం పరిపాలించేవాడో చెప్పచ్చు.  వైట్ క్రౌన్ అప్పర్ ఈపిప్ట్ ని,  రెడ్ క్రౌన్ లోయర్ ఈజిప్ట్ ని సూచిస్తుంది.  ఇంకో కిరీటం కూడా ఉంది. అది బ్లూ క్రౌన్. దాన్ని యుద్ధం చేసేటప్పుడు  పెట్టుకునేవారు.  అలాగే రాబందు (vulture) ఎగువ ఈజిప్ట్ ని, డేగ (eagle) దిగువ ఈజిప్ట్ కి నిదర్శనం. 

       మెనిస్ మొత్తం సామ్రాజ్యం అంతటికి రాజు కాబట్టి కొం ఓంబో గుళ్ళో రెండు కిరీటాలతో కనిపిస్తాడు. 


King Menes crowned with both  white n red crown by the gods



ఎడం వైపతను పెట్టుకున్న శటగోపం లాంటిది వైట్ క్రౌన్.  కుడి వైపునతను  పెట్టుకున్నది రెడ్ క్రౌన్, కొంచెం పడవ ఆకారంలో ఉన్నది. 

         మెనిస్ తోనే  రాజ వంశాలు మొదలయ్యాయి.  మొత్తం ముప్పై వంశాలు (dynasties).  హిస్తోరియన్లు వాటిని నాలుగు భాగాలుగా విభజించారు.

 ఎర్లీ డై నాస్టిక్ పీరియడ్  :  మొదటి రెండు వంశాలు,  3000 B.C నుండి
  ఓల్డ్ కింగ్డం                   :   3 - 6 వ వంశం వరకు,   2700 - 2200 B.C

మిడిల్ కింగ్డం                 :  11-14 వ వంశం వరకు,  2000 B.C - 1600 B.C

న్యు కింగ్డం                   :  18,19,20 వంశాలు,         1500 - 1000 B.C
         
మధ్యలో మిస్సయిన వంశాలు ఇంటర్మీడియట్ పిరియడ్ లోకి వస్తాయి.   హత్సేప్సట్, తుత్మోసిస్, సెటి, రామస్సేస్, టుటన్ఖమున్ వీళ్ళందరూ కూడా న్యు కింగ్డం లోకే వస్తారు.

    పిరమిడ్లు దాదాపు ఓల్డ్ కింగ్డం లో, కొన్ని మిడిల్ కింగ్డం లో కట్టారు. న్యు కింగ్డం వచ్చేసరికి ఆ ఆచారం పోయి సమాధులు వచ్చాయి. వాటినే మార్చురీ గుళ్ళు అనేవారు. ఫారోనిక్ కాలం వాళ్ళకి  బతికున్నప్పటి కన్నా పోయిన తరవాత జీవితమే ముఖ్యం. అందుకని ఇళ్ళు మట్టితోనే కట్టుకుని గుళ్ళు, సమాధులు మాత్రం రాయితో కట్టేవారు. పిరమిడ్లు కట్టకముందు ఇంట్లోనే గుండ్రంగా గొయ్యి తీసి గర్భస్థ శిశువులా శవాన్ని ముడుచుకున్న ఆకారంలో పడుకోపెట్టేవారుట.   తరువాత రోజుల్లో  బయట  గొయ్యి తవ్వి మామూలుగా పాతిపెట్టేవారు,  కొందరిని ఇసక లోనే పూడ్చేసేవాళ్ళు.  వాళ్ళ ఆలోచనలు రిఫైన్ అయ్యిన తరువాత వచ్చినవే పిరమిడ్లు.

 మొట్టమొదటి పిరమిడ్ సకార నేక్రోపోలిస్ ( burial ground) లో కట్టిన జోసర్. 

స్టెప్ పిరమిడ్ ఆఫ్ జోసర్

Step Pyramid of Djoser built in Saqqara Necropolis

ఇది రాతితో కట్టిన మొదటి కట్టడం. జోసర్ దగ్గర ఆర్కిటెక్ట్ అయిన Imhotep దీన్ని డిజైన్ చేసాడు. రాతి కట్టడాన్ని పైన సున్నపురాయి తో కవర్ చేసారు కానీ తరువాత వాళ్ళు  వాళ్ళ కట్టడాల కోసం పీక్కుపోయారు. ఎత్తు 200 అడుగులు.




సకారా నేక్రోపోలిస్ లో ముఖ్యమైన పిరమిడ్లతో పాటు చిన్నా చితకా చాలానే ఉన్నాయి.


చిన్న గుట్టల్లా కనిపించేవన్నీ పిరమిడ్లె.


బెంట్ పిరమిడ్ ఆఫ్ దాషుర్


Black Pyramid of Amenemhat n Bent Pyramid of Dahshur


ఎడమవైపున ఉన్న బొడిప లాంటి ఆకారమే నల్ల పిరమిడ్.  మిడిల్ కింగ్డం ఫారో అమెనేమ్హాట్ కోసం కట్టింది.  పైన సున్నపు రాయితో కవర్ చేసినా, లోపల మాత్రం రాయికి బదులు మట్టితో చేసిన ఇటుకలు వాడారు.  బరువు ఆపలేక శిధిలమైపోయింది. 

         కుడి వైపున ఉన్నది బెంట్ పిరమిడ్.  ఖుఫు ( గ్రేట్ పిరమిడ్ అఫ్ గిజా ) తండ్రి స్నెఫెరు ( Sneferu ) సమాధి.  ఇది 54  డిగ్రీల కోణంతో మొదలు పెట్టారట.  సగానికొచ్చేసరికి  కోణాన్ని  43 డిగ్రీలకి మార్చాల్సొచ్చింది.   దీని ఎత్తు 340  అడుగులు.

రెడ్ పిరమిడ్ అఫ్ దాషుర్ 

Red Pyramid of Dahshur

ఇది కూడా ఫారో స్నెఫెరు దే.  ముందు కట్టిన బెంట్ పిరమిడ్ నించి వచ్చిన అనుభవంతో  దీన్ని మొదలు పెట్టారు.  దీన్ని 43 డిగ్రీల కోణంతోనే మొదలుపెట్టారు.  ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి అసలు సిసలైన పిరమిడ్.   దీని పైన కూడా సున్నపురాయి పేర్చారు కానీ దాన్ని కూడా పీక్కుపోయారు.  రెడ్ పిరమిడ్ అని పేరు ఎందుకొచ్చిందో కరక్టుగా తెలీలేదు.  లైం స్టోన్ కేసింగ్ పీకేసాక ఎండలో ఎర్రగా మెరుస్తోంది కాబట్టి ఆ పేరొచ్చిందని గైడ్ చెప్పింది కాని అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు.  దీని ఎత్తు కూడా 340 అడుగులే. 
                     
                            దీని లోపలి వెళ్లి చూడచ్చు.   మెట్లు కట్టి  ఎంట్రన్సు తయారు చేసారు.  ఖుఫు పిరమిడ్ దగ్గర రోజుకి 300  టికెట్లే అమ్ముతారు. పొద్దున్న  150, సాయింత్రం ఇంకో 150.  దానికి  టికెట్లు దొరకటం కష్టం,  ఒక వేళ దొరికినా అందరూ ఒకే సారి లోపలి వెళతారు కాబట్టి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు,  అన్ని పిరమిడ్ల లోపల  ఒకేలా ఉంటుంది  కనక ఇది చూసేయ్యండని మా గైడ్ చెప్పింది.   ఇంకా ఖుఫు పిరమిడ్ లోపల చూడాలంటె టికెట్ 100 ఈజిప్టియన్ పౌన్లు, ఇది ఫ్రీ.   లోపల గాలి పాడూ ఏమీ ఉండదు.  ఇంక డస్ట్ అల్లెర్జీలు, అస్త్మాలు ఉన్న వాళ్ళు లోపలి వెళ్ళకపోవటమే మంచిది, నాకు ఆయాసం వస్తుంది, నేను రాను పొమ్మని మా గైడ్ వాన్ లోనే ఉండిపోయింది.  నాకు భయమేసింది.  నాకు అల్లెర్జి రత్న అనే బిరుదొచ్చి పదేళ్ళు దాటింది.  ఒక తుమ్ము మొదలైతే హాఫ్ సేన్చేరీనో, సేన్చేరీనో కొట్టాల్సిందే.   వెంటనే యుద్ధ ప్రాతిపదికన  ఒక అల్లర్జి  టాబ్లెట్టు, ఒక ఆయాసం  టాబ్లెట్టు మింగి బయలుదేరాం.





లోపలి దిగటానికి మెట్లలాంటి చెక్క జారుడుబండ వేసారు.    ఎంత మెట్లలా ఉన్నా చెక్క కాబట్టి కొంచెం జారుతూ ఉంటుంది.  నిలువుగా నించుని వెళ్ళటానికి లేదు.  భూమిలోకి వంగిపోయి వెళ్ళాలి.  పక్కకి జరగటానికి చోటు కూడా ఉండదేమో మనం దిగేటప్పుడు ఎదురు ఎవరైనా వచ్చేరంటే  చచ్చామే.  
         
                      లోపల చిన్న గది, దాని తరువాత పెద్ద హాలు ఉన్నాయి.  హాల్లోంచి పైకి వెళ్లి చూడటానికి మెట్లు కట్టారు.  పైన బరియల్ చాంబర్ ఉంది.  అంతకు మించి లోపల ఏమీ లేదు. 

             కెమెరాతో లోపలి పంపించరంటే వాన్ లోనే వదిలేసాము.  చాలా మంది వాచ్మన్ కి అయిదు నోటు లంచం ఇచ్చి చక్కగా లోపల ఫోటోలు తీసుకున్నారు.

గ్రేట్ పిరమిడ్ అఫ్ గిజా

Great Pyramid of Khufu

ఇది ఖుఫు సమాధి.  ఇది పిరమిడ్లన్నిట్లోకీ పెద్దది, ఎత్తైనది.  పాత  సెవెన్ వండర్స్ ఆఫ్ ది వోల్డ్ లో మిగిలింది ఇదొక్కటే. 




         
  ఇది మొత్తం సున్నపు రాళ్ళతోనే కట్టారు.  మొత్తం 13 ఎకరాలలో  23,00,000 రాళ్ళతో కట్టారు.  ఎత్తు 488 అడుగులు.  ముస్లింలు మసీదుల కోసం పైన ఉన్న కేసింగ్తో పాటు టిప్ దగ్గర కూడా పీకేశారు. అందుకని ఇప్పటి ఎత్తు 455 అడుగులే.

        ఇది కట్టడానికి ఇరవై  ఏళ్ళు పట్టిందిట.   పడవల్లో రాళ్ళు తీసుకొచ్చి దానికి తాళ్ళు కట్టి బానిసల  చేత లాగించి ఒక రాయి మీద ఒక రాయి పెర్చార్ట.   ఇరవై ఏళ్ళు చాలా తక్కువనిపించింది.  మా గైడ్ మాత్రం ఇది మనుషులు కట్టారంటే నేను నమ్మను, తప్పనిసరిగా ఏలిఎన్లె కట్టారంది.  మనకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారంటే మనం ఒప్పుకోము కదా.
   
     దీన్ని ఎక్కి దిగాగలిగినవాడు మాత్రం ఒకతను ఉన్నాడట.  తొంభై ఏళ్ల ముసలతను. రెండు నిమిషాలలో ఎక్కి, మూడు నిమిషాలలో దిగుతాట్ట. 

      మేమింక దీని లోపలికి వెళ్ళలేదు.   ఎటూ అన్నీ ఖాళీ గదులే.  పిరమిడ్లు కట్టటం అయిపోయాక
సొరంగాల  ద్వారా పనివాళ్ళు బయటకి వచ్చేవారుట.  ఆ సొరంగాల దారి తెలిసిన తరవాతి తరాల వాళ్ళు,  ఇంకా తరవాత కాలం ఫారోలు పిరమిడ్లని లూటీ చేసేసారు.  శవాలని నుండి కూడా బంగారం వలిచేసుకుని వాటిని పాతిపెట్టకుండా  అలాగే విసిరేసారుట.  అందుకని ఆ కాలపు ఫారోల శవాలు కూడా దొరకలేదు.

పిరమిడ్ ఆఫ్ ఖెఫ్రెన్


Pyramid of Khefren and The Sphinx

ఖెఫ్రెన్  ఖుఫు కొడుకు.   ఇతని పిరమిడ్ టిప్ మీద  ఇంకా మిగిలి ఉన్న సున్నపురాయి కేసింగ్ తో గుర్తు పట్టచ్చు.  దీని ఎత్తు 445 అడుగులే  అయినా ఖుఫు పిరమిడ్ కన్నా ఎత్తుగా కనిపిస్తుంది.  బాగా ఎత్తుగా ఉన్న దిబ్బ మీద కట్టుకుని optical illusion కలిగించాడు.




ఖెఫ్రెన్ పిరమిడ్ కి అందం, గొప్పతనం తెచ్చింది మాత్రం స్పింక్సే.  స్పింక్స్ ని అతని పిరమిడ్ కి కాపలా గా కట్టుకున్నాడు.   దీన్ని సాండ్ స్టోన్ తో కట్టారు. 


పిరమిడ్ ఆఫ్ మెంకరే ( Menkaure )


Pyramid of Menkaure

మెంకరే  ఖఫ్రెన్ కొడుకు.  ఇతని పిరమిడ్ అన్నిటికన్నా చిన్నది.   పక్కన ఉన్న చిన్న పిరమిడ్లు భార్య, తల్లి, పిల్లలవి.  అన్ని పిరమిడ్ల పక్కన ఇలాంటి చిన్న పిరమిడ్లు ఉంటాయి.  దీని ఎత్తు 200  అడుగులు.


Panoramic View Of The Pyramids Of Giza Plateau

పిరమిడ్లలో ఫారో శవాలతో పాటు అతనికి తరవాతి ప్రయాణానికి కావాల్సిన వస్తువులు, తిండి, నదులు లాంటివి దాటటానికి చెక్క పడవలు,  నగలతో పాటు, ఇంకా అతని ప్రయాణానికి సహాయం చెయ్యటానికి చాల మంది బానిసల్ని కూడా చంపేసి, వాళ్ళ శరీరాల్ని కూడా మమ్మిఫై చేసేసి పెట్టేవారు.  న్యు కింగ్డం వచ్చేటప్పటికి ఈ చంపే ఆచారం పోయి, చెక్క బొమ్మల్ని బానిసల రూపంలో తయారు చేసి పెట్టేవారు.  ఈ బొమ్మల్ని కైరో లో ఉన్న ఈజిప్టియన్ మ్యుజియం లో చూడచ్చు. 

         ప్రయాణమైపోయాక వాళ్ళ మెయిన్ దేవుడు సూర్యుడే కాబట్టి,  ఫారో అనబడే ఈ భూలోక దేవుడు, ఆకాశం లో ఉన్న సూర్య దేవుడిలో ఐక్యమయిపోయి సూర్యకిరణాల ద్వారా వెలుగు ప్రసరిస్తాడని నమ్మకం.  అందుకే పిరమిడ్ల ఆకారం కూడా సూర్యకిరణాల పడే ఆకారం లోనే ఉంటుంది. 

     మధ్యాన్నాని కల్లా పిరమిడ్లు చూడటం  అయిపొయింది.  ట్రిప్పులో లంచి కూడా కలిపే ఛార్జ్ చేసేసారు కాబట్టి ఒకే సారి తినేసి, సువనీర్లు కొనేసుకుని హోటల్ కి వెళ్ళిపోయాం.

       ఫరోనిక్ కాలంలో పెపైరస్ చెట్టునించి కాయితం తయారు చేసేవారు.  ఆ కాయితం చాలా గట్టిగా ఉండి నీళ్ళల్లో నానపెట్టినా చిరగదు.   పెపైరస్ మీద పెయింటు  చేసినవి చాల ఫేమస్.  రెండు పెయింటింగులు  కొన్నాం.  ఒకొక్కటి
250  పౌన్లు చెప్పినవాడు బేరమాడితే 50  కే ఇచ్చేసాడు.  షాపు పేరు " గోల్డెన్ గ్లోబ్ ".

        కైరో లో " ఖాన్ ఎల్ ఖలీలి " మార్కెట్ చాలా ఫేమస్.  అక్కడ లేనివంటు ఏమి ఉండవు.  ఏమీ కొనకపోయినా ఓ రెండు మూడు గంటల పాటు సరదాగా కొట్లన్నీ చూడచ్చు.  మార్కెట్ సందుల్లో వెళుతుంటే షారూక్ ఖాన్, కరీనా కపూర్ అని అరుస్తూ ఉంటారు.  మన హిందీ సినిమాలు అక్కడ చాలా పాపులర్.  మేము స్నేహితులకి ఇవ్వటానికి క్లేయోపాట్రా బొమ్మున్న పింగాణీ ప్లేట్లు  కొన్నాం.

        తర్వాత రోజు ఈజిప్టియన్ మ్యుజియుంకి బయలు దేరాం.  మేమున్న హోటల్ " హోటల్ సిటి సెంటర్ " నించి అయిదు నిమిషాల నడక.  బైట పెద్ద లైను.  ఓ గంట సేపు లైన్లో నించుని మొత్తానికి లోపల పడ్డాం.  చాలా పెద్దది.  మెనిస్ తో  మొదలుపెట్టి అన్ని వంశాల రాజుల విగ్రహాలు, అప్పటి ఆర్మీ మోడల్సు, టూతన్ఖామున్ ముత్తాతల, తాతల, తండ్రుల శవ పేటికలు,  మమ్మిఫై చేసిన జంతువులు ఇలా చాలా చూడచ్చు.  ముఖ్యమైనవి టూతన్ఖామున్ గాలరీ, రాయల్ మమ్మీ మ్యుజియం.  ఎంట్రీ టికెట్టు 60 LE.
   
      బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హోవార్డ్ కార్టర్ వాలీ ఆఫ్ కింగ్స్ లో టుట్ సమాధి కనుక్కున్నాడు.  అతను పదేళ్ళు పాలించి పద్దెనిమిది ఏళ్లకే పోయాడు.  అనుకోకుండా పోయేసరికి ఎవరిదో చిన్న సమాధిలో పెట్టాల్సి వచ్చింది.  దాన్ని కాంపెన్సేట్ చేయటానికేమో సమాధి నిండా బంగారమే.   అతని వస్తువులన్నీ ఇప్పుడు గాలరీ లోనే పెట్టారు.  అతని మంచాలు, సింహాసనం, నాలుగు ఊరంత పెద్ద శవపేటికలు, డెత్ మాస్క్, బట్టలు, నగలు, చెప్పులు, చిన్న బీరువాల లాంటివి  ఇంకా చాలా ఉన్నాయి.  చెప్పులు కొంచెం కూడా చెక్కు చెదరలేదు.  నగల డిజైన్లు చూస్తే మతి పోయింది.

         ఫారోల కాలంలో బంగారం చాలా ఎక్కువగా దొరికేది కాబట్టి దానికి విలువే లేదుట.  ఉప్పు దొరికేది కాదుట.  ఉప్పు చాలా ఖరీదైంది.  జీతంగా కూడా ఉప్పే ఇచ్చేవారుట.

     రాయల్ మమ్మీ రూం కి టికెట్టు వేరేగా కొనాలి. 100 ఈజిప్టియన్ పౌన్లు.  రామస్సెస్, సెటి తో  కలిపి మొత్తం పదకొండు మమ్మీలు.  గాజు డబ్బాల్లో పెట్టారు.  పళ్ళ దగ్గిర్నించి గోళ్ళ వరకు ఏమీ పాడవలేదు.  ఆ రోజుల్లోనే తెల్ల జుట్టుకి హెన్నా పెట్టుకునే అలవాటు ఉన్నట్టుంది.  ఒక ఫారో జుట్టు చక్కగా రాగి రంగులో ఉంది. 
       
        మమ్మిఫికేషన్ ప్రక్రియ మొత్తం నలభై రోజులు పడుతుంది.  ఫారో చనిపోగానే పొట్ట  దగ్గర కోత పెట్టి  ఊపిరి తిత్తులు, కాలేయం, స్టమక్, పేగులు తేసేసేవారు.  ముక్కు లోంచి చిన్న ప్రోబ్ తో బ్రెయిన్ ని చిలికినట్లు చేసి దాన్ని కూడా ముక్కు ద్వారా తేసేసేవారు.  మూత్ర పిండాలు అందవు కాబట్టి లోపలే వదిలేసేవారు.  గుండె జ్ఞ్యానానికి స్థానంగా అనుకునే వారు కాబట్టి దాన్ని లోపలే వదిలేసేవారు.  దీన్ని నలభై రోజుల పాటు నాట్రన్ సాల్ట్ ( సోడియం కార్బనేట్, సోడియం బై కార్బనేట్ మిక్స్చర్) తో కప్పేసేవారు.   శరీరంలో ఉన్న నీరంతా పోయి  ఎండిపోతుంది.  ఎండిన శరీరానికి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి నూనెలు, రెజిన్ లాంటివి రాసి, కాటన్ గుడ్డతో చుట్టేవారు. దాని మీద వాళ్ళ నగలు పెట్టి మళ్ళీ కాటన్ గుడ్డ చుట్టేవారు. ఇంకా అది శవ యాత్రకి రెడి అయినట్లే.  సమాధికి తీసుకెళ్ళిన తరవాత నోరు కొంచెం తెరిచి పెట్టేవారు.  ఆత్మ తిరిగి అదే శరీరాన్ని వెతుక్కుంటూ వచ్చి  నోటి ద్వారా తిరిగి శరీరం లోకి వెళుతుందని వాళ్ళ నమ్మకం.

             ముజియంలో నాలుగ్గంటలు తిరిగేసరికి పొద్దున్న తిన్నదంతా అరిగిపోయి కాళ్ళు పీకటం మొదలుపెట్టాయి.  రోజంతా చూసినా ఎటూ మొత్తం చూడలేం కాబట్టి ముఖ్యమైనవి చూసి ఫుల్ స్టాప్ పెట్టేయటమే.

         సాయంత్రం నైల్ లో డిన్నర్ క్రూస్ తీసుకున్నాం.   టాక్సీ పికప్, డ్రాప్ కూడా ఉంది.  డిన్నర్ చేస్తుంటే పడవ నైల్ లో ఓ రౌండ్ వేస్తుంది.  ఎంటర్టైన్మెంట్ కి బెల్లి డాన్సు,  అరబిక్ పాటలతో ముజికల్ నైట్ లాగా ఎరేంజ్ చేసారు.  భోజనం బాలేకపోయినా ఓవరాల్ ఎక్స్పీరియన్స్  చాలా బావుంది. 


Whirling Dervish



    ఖర్చులు                       యుఎస్ డాలర్లలో                           ఈజిప్టియన్ పౌన్లలో

పిరమిడ్ టూర్                         170                                               ___

గైడ్ టిప్                                   ___                                              100

డ్రైవర్ టిప్                                  __                                                 50


ఈజిప్టియన్ మ్యుజియం              __                                                 60

రాయల్ మమ్మీ రూం                  __                                               100

నైల్ డిన్నర్ క్రూస్                      140                                               __

డ్రైవర్ టిప్                                  __                                                 50


              

No comments:

Post a Comment