Tuesday 15 November 2011

Sri Lanka - Nuwara Iliya



నువారా ఇలియా



శ్రీలంకకి ఇండియాకి గొప్ప అవినాభావ సంబంధముంది. అదే మన రామాయణం ద్వారా. మిగతా ప్రదేశాల గురించి తెలీదు కానీ నువారా ఇలియాని మాత్రం లిస్టులో మొదటి స్థానంలో పెట్టచ్చు.  రామాయణం క్లైమాక్స్ సీన్లు అంటే అశోక వనంలో సీత, లంకా దహనం  జరిగిన ప్రదేశం ఇదే మరి.     
 
  అక్కడ రావణుడు సీతని బంధించిన ప్రదేశానికి గుర్తుగా సీతాదేవి గుడుందని తెలుసుకున్నప్పుడు గుడి చూడాలన్ని కోరిక తప్ప పెద్ద నమ్మకం ఏమీ కలగ లేదు. అందులో రామాయణం ఎప్పుడో అయిదు వేల ఏళ్ళ క్రితమో పది వేల ఏళ్ళ క్రితమో జరిగింది. అప్పటి జియోగ్రాఫికల్ బౌన్డరీస్ వేరు, అప్పటి ఊళ్ళ పేర్లు వేరు. టూరిస్ట్లని ఎట్రాక్ట్ చేయటానికి ఏదో సోది చెప్తారులే  అనుకున్నాం.  

   ఆ రోజు కొత్త సంవత్సరం కూడా. మొదట గుడితో మొదలు పెడితే బావుటుందనిపించింది. మన దేశంలో ఉంటే పండగయినా పబ్బమైనా గుడికెళ్ళాలని అనిపించదు కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు మాత్రం దైవ భక్తి తన్నుకుంటూ వచ్చేస్తుంది. అయినా ఆ రోజు మేము వెళ్ళే ప్లేసులలో గుడే మొదట వస్తుంది.

సీత కోవిల్

    గుడిని అరవంలో కోవిల్ అంటారు.   అక్కడ అరవ వాళ్ళు ఎక్కువ. 

నువార ఇలియా నించి సిటి బస్సు తీసుకున్నాం. బస్ లోంచి  గ్రెగరీ లేక్ చూడచ్చు.  కావాలనుకుంటే సరదాగా బోటింగ్ కూడా చెయ్యచ్చు.    గుడికి వెళ్ళటానికి   పావు గంటో ఇరవై నిమిషాలో పట్టింది. 


Sita kovil





ఇదే సీతని బంధించి ఉంచిన  అశోక వనం.   గుడి వెనకాల కనిపించే చెట్లన్నీ అశోక వృక్షాలే.    పచ్చ రంగులో బోర్డర్ వేసున్న గుంట లాంటిది హనుమంతుడి పాదంట.   ఆ స్ట్రీం లోనే సీతా దేవి స్నానం చేసేదిట. 


Lord Hanuman's Foot Impression



















ముందు నమ్మకపోయినా అక్కడ ఉన్నప్పుడు రామాయణమంతా కళ్ళ ముందే కనిపించింది. అదేమీ విచిత్రమో కానీ అప్పుడు రావణుడు అస్సలు రాక్షసుడులానే కనిపించలేదు.  ఎత్తుకొస్తే వచ్చాడు ఎంత అందమైన ప్లేస్ లో పెట్టాడు అనిపించింది. చుట్టూ కొండలు, వనం, సరస్సులు, పక్షుల కిలకిలారావాలు అసలు కవిత్వమంతా అక్కడే ఉన్నట్లనిపించింది.   నిజం చెప్పాలంటే రావణుడి మీద కొంచెం జాలి కూడా కలిగింది.     ఎత్తుకొచ్చేసాడని నానా గగ్గోలు పెడతాం  కానీ ఇక్కడ ఆడవాళ్ళందరూ కోతుల్లా ఉంటే పాపం అతను మాత్రం ఏం చేస్తాడు అని కూడా అనిపించింది. 



view frm Sita Kovil

      న్యూ ఇయర్ కాబట్టి కొంచెం జనం ఎక్కుగా వున్నా పరిసరాల ప్రభావమో లేక నిజంగా సీత ఉన్న అశోక వనం ఇదే అన్న నమ్మకం కలగటం వల్లో కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది.  

    గుళ్ళో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వున్నారు.  పూజారిని గుడి గురించి అడిగితే బిజీగా ఉన్నా కూడా విసుక్కోకుండా చక్కగా అడిగిన వాళ్ళందరికీ చెప్పారు.  

     అర్చన చేయించుకుని ఆ స్పెషల్ కుంకాన్ని ఇక్కడి కూడా తీసుకొచ్చి అందరికీ పంచాం. 

నువార ఇలియా దగ్గర  ఉన్న ఇంకో ముఖ్యమైన  ప్రదేశం రావణ ఎల్ల. 


రావణ ఎల్ల ( Ravana Falls )


Ravana Ella


     ఎల్ల అంటే సింహళ  భాషలో వాటర్ ఫాల్స్ అనర్ధం.   ఈ ఫాల్స్ కి వాళ్ళ రాజు రావణుడి అదే మన రావణాసురుడి పేరు పెట్టుకున్నారు.   

       ఈ పేరు రావటానికి ముఖ్య కారణం ఈ వాటర్ ఫాల్స్ పైనున్న కొండమీడున్న గుహ.   దాని పేరు రావణ ఎల్లా  గుహ ( Ravana Ella Cave ).   రావణుడు సీతని ఎత్తుకొచ్చిన తరువాత  అశోక వనంలో ఉంచే ముందు మూడు ప్రదేశాలు మార్చాడుట.   వాటిల్లో ఒకటి ఈ గుహ. 

 గుహ చూడాలంటే రెండు వేల మెట్లు ఎక్కాలి. మెట్లు చాలా క్రుకెడ్ గా ఉన్నాయి. అరగంట పడుతుండట ఎక్కడానికి. ఆడమ్స్ పీక్ దెబ్బతో పిక్కలు పట్టేసి మెట్టు అన్న మాటే ఒక నైట్ మేర్ గా తయారైంది. నాలుగైదు మెట్లు చూసినా అమ్మో ఇన్ని మెట్లే అని గుండె దడ దడా కొట్టుకోవటం మొదలెట్టేది. అసలే సీతని పెట్టిన గుహ. ఈ గుహ కోసం మళ్ళీ శ్రీలంక రాలేము. ఎలా అయినా చూడాలి. ఇద్దరం మొహ మొహాలు చూసుకుని నువ్వు వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని కొంచెం సేపు వాదించుకుని ఇద్దరికీ ఓపిక లేక చక్కా వచ్చాం. ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఆడమ్స్ పీక్ ఎక్కక పోతే ఇది చూసే వాళ్ళం కదా అని. ఆడమ్స్ పీక్ ఎక్స్పీరియన్సే వేరు, జీవితంలో మళ్ళీ అలాంటిది రాదు, అయినా నిజంగా ఇక్కడ సీత ఉందని ఎవరు చూసారులే అని సమాధాన పడుతూ ఉంటాను.
 
   నువార ఇలియా నించి రావణ ఎల్లాకి డైరెక్ట్ బస్ లేదు.  మొత్తం మూడు బస్సులు మారాల్సుంటుంది. నువారా ఇలియాలో బస్ తీసుకుంటే వెల్లవాయ ( Wellawaya ) దగ్గర, మళ్ళీ బండారువేల ( Bandarawela )  దగ్గర బస్సులు  మారాలి.  నువార ఇలియా నించి వెల్లవాయ వెళ్ళే దారి లోనే సీతా కోవిల్ వస్తుంది.

       బండారువేల బస్సు రావణ ఎల్లాకి నాలుగడుగుల దూరంలో ఆపాడు.   కాస్త బస్సు  ఎక్కటం దిగటం తప్ప  నడవాల్సిన అవసరం అస్సలు రాలేదు కాబట్టి బానే ఉంది.   తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం రావణ ఎల్లాలో బస్ దొరకలేదు.   ఎంత సేపు నించున్నా అసలు బస్సులే రాలేదు.   ఎల్లా అనే ఊరిదాకా నడిచి అక్కడ బస్సెక్కాం.   మళ్ళీ మూడు బస్సులు మారి రాత్రి ఎనిమిదిన్నరకి నువార ఇలియా చేరుకున్నాం. 

మేము వెళ్ళినప్పుడు తెలీదు కానీ ఇప్పుడు శ్రీలంక టూరిజం రామాయణ టూర్లు ఆఫర్ చేస్తోంది. రావణుడు శివుడ్ని ప్రసన్నం చేసుకోవటానికి పేగులు తీసి వీణ వాయిన్చాడని చెప్తారు కదా. అది exaggeration అనుకున్నా
అతను మంచి సంగీత విద్వాన్సుడుట.  అతను కనిపెట్టిన ఆ వీణ లాంటి దాని పేరు రావణ హట్ట.   శ్రీలంకలో దాని గురించి అందరూ మర్చపోయారు కాబట్టి దాన్ని మళ్ళీ  లైం లైట్ లోకి  తీసుకురావాలని ఒకతను ట్రై చేస్తున్నాడని ఈ మధ్యే ఏదో ఆర్టికిల్లో చదివా.    రాజస్థాన్ ఎడారిలో వైలిన్ లాంటి ఫోక్ వాయిద్యం వాయిస్తున్న వాళ్ళని టీవీల్లో చూస్తాం కదా.  రావణ హట్ట కూడా అలానే ఉంటుందిట. 

తమిళనాడుకి జాఫ్న దగ్గర కాబట్టి అనూరధపుర చుట్ట పక్కల ప్రాంతాలలో అరవ వాళ్ళు ఎక్కువ ఉంటారనుకున్నాం కానీ చాలా తక్కువగా కనిపించారు.   వాళ్ళు కూడా శ్రీలంక తమిళ్ తప్ప ఇక్కడి తమిళ్ మాట్లాడలేకపోయారు. 

   సౌత్ కొస్తున కొద్దీ తమిళియన్లు చాలా మంది కనిపించారు. నువార ఇలియాలో అయితే ఇంక చెప్పఖరలేదు. వీళ్ళ భాష దాదాపు ఇక్కడి తమిళ్ లానే ఉంది.   భాష సంగతేమో కానీ ముందు లుంగీలలో, స్కిర్ట్లలో అమ్మాయిలని చూసీ చూసీ విసిగిపోయి ఉన్నామేమో ఇక్కడ చీరల్లో కనిపించేసరికి హాయిగా అనిపించింది.   కాకపోతే వాళ్ళు సింహళ పద్ధతిలో కట్టుకున్నారు. 

       శ్రీలంక బయల్దేరే ముందే మా అక్క అక్కడ మాస్కులు చాలా పొపులర్ తెచ్చుకోండి నాకు కూడా ఒకటి తీసుకురండని చెప్పింది.   ఎటూ నాకు సువనీర్లు కలక్ట్ చేయటం హాబీ కాబట్టి శ్రీలంక ఎయిర్ పోర్టు లో అడుగు పెట్టినప్పటి నించీ మాస్కుల వేటలో పడ్డా.    అనూరధపురకి అంత సీన్ లేదు. అదసలే పల్లెటూరు లాంటిది. కాండీలో మేమున్న హోటల్ సువనీర్ షాపులో అయితే పట్టుమని పది మాస్కులు లేవు, వేలల్లో చెప్పాడు. చెక్కతో చేసి రంగులు పూసిన వస్తువు ఇలా వేలల్లో ఉంటుందని తెలిసేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. కాండీ లోనే ఇలా ఉంటే ఇంక నువార ఇలియా అసలే హిల్ స్టేషన్. అక్కడ లక్షల్లో ఉంటుందేమో ఇక్కడే కొనేద్దామా అని చాలా ఆలోచించాము కానీ కొనటానికి చేతులు రాలేదు.

   నువారా ఇలియాలో మొదటి రోజు బిజీ గా గడిచిపోయింది. ఇంక అక్కడ మాకుంది ఒక పూట. టెన్షన్ మొదలైపోయింది. దాదాపు పది షాపుల దాకా తిరిగాం. ఆ మాస్కులు షాపులకి దిష్టి బొమ్మల్లాగా తగిలించారు. అవి కొనాలనుకుంటున్నాం ఎక్కడ దొరుకుతాయని అడిగాం.   చాలా షాపులు అరవ వాళ్ళవే కాబట్టి భాషకి ప్రాబ్లం రాలేదు. మేము కూడా అరవ వాళ్ళమని అనుకున్నట్లున్నారు. ఒక షాపులో అయితే వాళ్ళు వెళ్లాడ తీసుకున్న దిష్టి మాస్కుని  తీసి దుమ్ము దులిపి మాకు ఫ్రీ గా ఇచ్చేయటానికి సిద్ధపడ్డారు.   అవి మూడు నాలుగు వందల కంటే ఎక్కువ వుండవుట.   చివరికి ఎక్కడ దొరుకుతాయో తెలిసింది.  ఒకతను  ఒద్దన్నా వినిపించుకోకుండా  మమ్మల్ని షాపుకి తీసుకెళ్ళి రేటు ఎంత పెట్టాలో ఒకటికి పది సార్లు చెప్పాడు.  అలా  హోటల్ గ్రాండిస్ సువనీర్ షాపులో ఆరు వందల శ్రీలంక రూపాయిలతో పెద్ద మాస్కులు కొన్నాం.

మనసు శాంతిన్చాక ఇంక ఆత్మా రాముడ్ని కూడా శాంత పరచడానికి అమ్బల్స్ వెళ్ళి బఫే తిన్నాం.  హోటల్ కెళ్ళి సామాను తీసుకుని ఆటోలో కందపోల అనే ఊరు బయల్దేరాం. రెండు వైపులా టీ గార్డన్లు. టాక్సీ కంటే ఆటో అయితే బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. కందపోల ప్రత్యేకత అక్కడున్న హోటల్ " ది టీ ఫ్యాక్టరీ". ఫ్రెండ్ ముందే చెప్పింది టీ ఫ్యాక్టరీ లో ఎక్స్పీరియన్స్ చాల బావుంటుంది మిస్ అవద్దు అని. చాలా ఖరీదైన హోటల్ కాబట్టి ఒక రోజుకి బుక్ చేసుకున్నాం.

No comments:

Post a Comment