Saturday 12 November 2011

Sri Lanka - Kandy


   పొద్దున్న రెస్ట్ హౌస్ లో చెకౌట్ చేసేసి పదకొండున్నరకి ఎసి మినీ బస్ తీసుకుని కాండి బయల్దేరాం.   కాండి చేరేటప్పటికి మూడైంది.  హోటల్  Suisse లో బుక్ చేసుకున్నాం.    

     కాండి చూడటంతో పాటు దానికి దగ్గరలో ఉన్న శ్రీపాద అనే కొండ కూడా ఎక్కటానికి ప్లాన్ చేసుకున్నాం.  అక్కడ నించి సన్ రైజ్ చూడాలి. సన్రైస్ జరిగేటప్పుడు  కొండ నీడ గాల్లో ట్రైఆంగిల్ ఆకారంలో నిట్ట నిలువుగా పడుతుంది. ఆ వింత చూడటానికే ముఖ్యంగా పర్యాటకులు వస్తారు.  రోజు గడిచే కొద్దీ ఆ నీడ స్లాన్టింగ్ గా మారిపోతుంది.   

   సాధారణంగా రాత్రి తొమ్మిది  పది ప్రాంతాలకి కొండ ఎక్కడం మొదలు పెడతారు . ఎక్కడానికి నాలుగు గంటలు పడుతుంది. రాత్రి కొండ మీదే ఉండి సూర్యోదయం చూసి కొండ దిగుతారు.

  హోటల్ కి వెళ్ళగానే ముందు శ్రీ పాద టూర్ గురించి కనుక్కున్నాం. అసలే మబ్బుగా ఉంది వానొస్తే కొండెక్కటం కష్టమైపోతుంది పైగా మబ్బుగా ఉంటే ఏమీ కనిపించదు పగలైతేనే  మంచిది ఎండుంటుంది కాబట్టి కొండ పైనించి వ్యూ చూడచ్చు అని చెప్పాడు.   అందులో క్రిస్మస్  న్యు ఇయర్ పీక్ టూరిస్ట్ సీజన్ కాబట్టి టూరిస్ట్లు  వేలల్లో  ఉంటారు.  పైన ఉండటానికి ఒకటో రెండో గదులు తప్ప ఇంక ఫెసిలిటీస్  ఏమీ లేవు. చలిలో వణుక్కుంటూ ఆరు బయటే నిన్చోవాల్సి రావచ్చు  అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంక చేసేదేమీ లేక పొద్దున్న బయల్దేరటానికి వాన్ మాట్లాడుకున్నాం.
          
    అతను చెప్పినట్టే ఎనిమిదింటికి వాన మొదలైంది.    కాండి చుట్టూ కొండలే కాబట్టి రాత్రి విపరీతంగా చలుంది.   ఇండియన్ రెస్టారంట్ లో తినాలనుకునే వాళ్ళకి  Devon's Captain's Table అనే మంచి రెస్టారంట్ ఉంది.
 

శ్రీ పాద/ Adam's Peak
 

Sri Pada/ Adam's Peak

   
దీని ఎత్తు ఏడు వేల అడుగులు.    దీన్నే ఆడమ్స్ పీక్ అని కూడా అంటారు.   కొండ పైన బుద్ధుడి పాద ముద్ర ఉంటుందిట.   బుద్ధుడు మూడో సారి శ్రీలంక వచ్చినప్పుడు ఈ కొండ మీద పాదం మోపాడని ఆ పాద  ముద్రే అక్కడ పడిందని బౌద్ధ మతస్తుల నమ్మకం.   క్రైస్తవం వచ్చిన తరవాత దాని పేరు ఆడమ్స్ పీక్  అయింది.    ఆ పాదం ఆడందే అని వాళ్ళ పేరు వాళ్ళు పెట్టేస్కున్నారు.

   డిసెంబర్లో పౌర్ణమి నించి మొదలు పెట్టి మేలో పౌర్ణమి వరకు భక్తులు ఈ కొండెక్కుతారు.   తరవాత  అంతా వర్షా కాలం. 

     డల్హౌసీ అనే ఊరు నించి మెట్ల దారి మొదలవుతుంది. మెట్లు ఆరు వేల పైనే. పొద్దున్నే ఆరింటికి హోటల్ నించి వాన్ లో బయల్దేరాం.  డల్హౌసీ చేరేటప్పటికి  తొమ్మిదిన్నరైంది. పార్కింగ్ లాట్ నించి మెట్ల దారి దాక నడుచుకుంటూ వెళ్ళాం.   దారికి రెండు వైపులా కొట్లే.   తిండి, సాఫ్ట్ డ్రింక్స్ , స్వెట్టర్లు, టోపీలు, మఫ్లర్లు, గొడుగులు, బొమ్మలు ఒకటేమిటి ఏది తెచ్చుకోవటం మర్చిపోతే అది దొరుకుతున్దక్కడ.


Reclining Buddha at the starting point

  మెట్ల దారి మొదలయ్యే చోట హాయిగా చీకూ చింతా లేకుండా నిద్ర పోతున్న బుద్ధుడు. 

         అందరూ దాదాపు రాత్రే వెళిపోతారు కాబట్టి అందరూ మెట్లు దిగేవాళ్ళే. మేమిద్దరమే ఎక్కేవాళ్ళం. కొంచెం దూరం ఎక్కాక  మాకు డౌటొచ్చింది అసలు పొద్దున్న పైకి వెళ్ళనిస్తారా అని. ఒక పది మంది అబ్బాయిలు కూడా ఎక్కటం మొదలు పెట్టేసరికి అమ్మయ్య అనుకున్నాం. మెట్లు రకరకాల సైజులు షేపుల్లో ఉన్నాయి. కొన్ని చోట్లయితే మెట్లు పూర్తిగా విగిరిపోయాయి. ఎటువంటి రిపేర్లు చెయ్యలేదు. కొన్ని చోట్ల అసలు మెట్లు లేనే లేవు ఇక్కడ ఒకప్పుడు మెట్లు ఉండేవి అని గుర్తులు తప్ప. మెట్ల పక్కన కట్టిన జారుడుబండ లాంటి గట్టు మీంచి చక్కగా జారుకుంటూ  ఎక్కాల్సొచ్చింది.  దీనికి తోడు కొన్ని చోట్ల మెట్ల నిండా నీళ్ళు.  

       రైయ్యిమని కార్ లో వెళ్ళటం తప్ప  తిరుపతి కొండ కూడా కాలి నడకన  ఎప్పుడూ ఎక్కిన పాపాన పోలేదు.   అలాంటిది ఒకేసారి ఆరు వేల మెట్లంటే  అమ్మో ఇంకేమైనా ఉందా ఎంత గుండె  ధైర్యం కావాలి.   ఆ ధైర్యం ఎవరైనా ఇస్తారేమోనని ఎదురొచ్చిన వాళ్ళని ఆపి అడిగాం.   బాబోయి మోకాళ్ళు కొట్టుకుపోయాయని ఒకళ్ళు,  ఇంత కష్టమైన మెట్లు జీవితంలో ఎక్కలేదని  ఇంకొకళ్ళు,   సింగపూర్ నించి వచ్చిన ఆడవాళ్ళ బాచ్  అయితే ఆరింటికి  దిగటం మొదలు పెట్టాం ఇప్పటికి సగం మెట్లు దిగగలిగాం ఎక్కటానికి మాకు ఏడు గంటలు  పట్టిందని ధైర్యాన్ని కాస్తా నీరు కార్చేసారు.    మెట్లు ఎప్పుడూ తిన్నగా ఎక్కకూడదు డయాగనల్ పటార్న్ లో ఎక్కితే మోకాళ్ళ మీద అంత ఎఫెక్ట్ ఉండదని  సలహా కూడా ఇచ్చారు.    మాకు ఏడు గంటల పాటు తీరిగ్గా ఎక్కటానికి టైం లేదు.   వాళ్ళల్లాగా నెమ్మదిగా ఎక్కితే ఎలా ఉండేదో  ఎండ రాకుండా కొండపైకి వెళిపోవాలని   ఒక ఊపులో  ఎక్కేసరికి మనకున్న  బలానికి   సగం పైన మెట్లు ఎక్కేసరికి కాళ్ళు పని చెయ్యటం మానేశాయి.  




   దారి పొడుగునా షాపులున్నాయి. కింద నించి తిండేమీ మోసుకుంటూ వెళ్ళఖర్లేదు. చివరి మెట్లు మాత్రం చాలా స్టీప్ గా ఉంటాయి. అవి అయిదు వందల నించి వెయ్యి దాకా ఉండచ్చు. గ్రావిటేషనల్ పుల్ వెనక్కి లాగేస్తూ ఉంటుంది. లక్కీ గా ఆ మెట్లకి మాత్రం రైలింగ్ ఉంది. ఆ స్టేజికి వచ్చేసరికి కాళ్ళు ఎటూ చచ్చు పడిపోతాయి కాబట్టి చేతులు విల్ పవర్ రైలింగ్ సహాయంతోనే ఎక్కాలి.   


ఈ మెట్ల దారి నించి మాత్రం మంచి వ్యూస్  ఉన్నాయి. 





 
   మొత్తానికి రెండు మూడు లీటర్ల కూల్ డ్రింకులు, చాలా సీసాల మంచి నీళ్ళు, అయిదారు టీలతో ఒకటింపావు కల్లా పైకి చేరుకున్నాం. పైకి చేరుకోగలిగామన్న ఆనందం ఒకటైతే కనిపించిన వాళ్ళందరూ మబ్బుల వల్ల సూర్యోదయం చూడలేకపోయామని చెప్పటం చెప్పలేనంత పైశాచికానందాన్ని కలిగించింది.

        పైన చిన్న గుడుంది.   పాదాలు ఉన్నాయన్న చోట  గుడ్డ కప్పేసారు కాబట్టి పాదాలు చూడటానికి లేదు.  దాని కింద ఎనిమిదడుగుల లోపల బుద్ధుడి పాద ముద్ర ఉందిట.   గంట కూడా ఉంది.  కొండ ఎన్ని సార్లు ఎక్కారో గంట అన్ని సార్లు కొట్టాలిట.  

      కాస్త బిస్కెట్లు తిని రెస్ట్ తీసుకుని రెండుమ్పావుకి కొండ దిగటం మొదలుపెట్టాం.   మెట్లెక్కడమే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటే దిగటం దాని తాతలా ఉంది.   కాళ్ళు చచ్చు పడిపోయాయి కాబట్టి ఇంకవి మా కంట్రోల్లో లేవు.   అడుగులు  మెట్లు విరిగిపోయిన చోట కరక్ట్ గా ఆ విరుగులోనో లేకపోతే జర్రుమని జారే చోటో లేకపోతే  గోతిలోనో వాటిష్ట మొచ్చినట్లు  పడ్డాయి. 

     ఏ   తొమ్మిదిన్టికో ఎక్కటం మొదలు పెడతారనుకుంటే లోకల్స్ చాలా మంది మధ్యాహ్నం రెండింటికే  ఎక్కటం మొదలు పెట్టారు.  పదేళ్ళ పిల్లల్నించి ఎనభై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు నెత్తి మీద వంట సామాను, దిళ్ళు దుప్పట్లు పెట్టుకుని  ఎక్కేస్తున్నారు.   అంటే ఏ ఎనిమిది గంటల సేపో ఎక్కి పైనే వంట చేసుకుని ఓ కునుకు తీస్తారనుకుంట. 



దారి పొడుగునా ట్యూబ్ లైట్లు ఉన్నాయి.   కొంచెం చీకటి పడుతున్నప్పుడే లైట్లన్నీ వేసేస్తారు.   మెట్లన్నీ దిగేసరికి రాత్రి ఏడైంది.   అప్పటికే కొండెక్కే  వాళ్ళు వందల్లో మాకు ఎదురొచ్చారు.    కొండ దిగేసాక సిద్ధలేప సీసా కొనుకున్నాం.  మన జండూ బామ్  లాంటిది.  అక్కడ హాట్ కేకుల్లా  అమ్ముడు పోతోంది.  తెలివైన వాళ్ళు ఎక్కేటప్పుడే   కొనుక్కుంటున్నారు.   ఎలా అయితేనే వాన్ దాకా కాళ్ళీడ్చుకుంటూ రాగలిగాం.  

           నీ పాడ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి.  మోకాళ్ళకి సపోర్ట్ ఉంటుంది.    ఒక విషయమైతే అర్థమైంది.  తెల్ల వాళ్ళకి  పిక్క బలాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు అరవై ఏళ్ళకి కూడా బానే ఎక్కగలుగుతారు.  వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటే ఏ గుడిసో  వేసుకుని పర్మనెంట్ గా కొండ పైనే సెట్టయిపోవాల్సోస్తుంది.  

    

కొండ మీద కనిపించే తెల్ల గీత లాంటిది మెట్ల దారి.   పైన  కనిపించే ఇల్లు లాంటిది గుడి.     

     పదిన్నరకి హోటల్ చేరుకున్నాం. కదిలే ఓపిక లేదు. రూం కే సాండ్విచెస్ తెప్పించుకుని సిద్ధలేప సీసా మొత్తం పట్టించి చెరో రెండు పెయిన్  కిల్లర్లు మింగి ఓ యుగం పాటు రెస్ట్ తీసుకోటానికి రెడీ అయ్యాం.   కొండ దెబ్బతో మోకాళ్ళు పిక్కలు పట్టేసి మామూలు స్థితికి రావటానికి పది రోజులు పట్టింది.   

    ఇంతా ప్లాన్ చేసుకుని  కాళ్ళ నెప్పులని రూంలో తొంగుంటే కుదరదు  కదా.   ఆ రోజే నువార ఇలియా అనే ఊరు  కూడా వెళ్ళాలి.  పొద్దున్న టిఫిన్ తినేసి కాండీ  ఊరు చూడటానికి బయల్దేరాం.   కాండీలో ముఖ్యంగా చూడాల్సింది Tooth Relic Temple. 


దలద మలిగవ ( Dalada Maligawa )

Tooth Relic Temple, Kandy

   దలిద మలిగవ అనేది శిన్హళా భాషలో ఆ గుడి పేరు.  ఈ గుడి బుద్ధుడి పన్ను పెట్టడానికి కట్టారు.  బుద్ధుడు పోయిన తరవాత అతని చితిలో  పన్ను మాత్రం కాలకుండా ఉండిపోయిందిట.    ఆ పన్ను తీసి భద్రపరిచారు.  ఆ పన్ను ఏ రాజు దగ్గరుంటే ఆ రాజుకి అదృష్టం పడుతుందని నమ్మే వాళ్లుట.   ఆ  పన్ను కోసం యుద్ధాలు కూడా జరిగాయిట.  అది రకరకాల రాజుల చేతులు మారిందిట.   ఇండియాలో బౌద్ధ మతానికి కష్ట కాలం వచ్చేసరికి ఒరిస్సా రాణి తన జుట్టులో పన్ను దాచి  శ్రీలంకకి స్మగుల్  చేసిందిట.   అక్కడ కూడా అది చాలా ఊళ్ళు మారి ఫైనల్ గా కాండీలో సెటిల్ అయ్యింది. 

         మేము వెళ్ళిన రోజు పౌర్ణమి.    లోపలకి వెళ్ళాలనిపించలేదు.  కొండవీటి చాంతాడంత  క్యూ ఉంది.  రెండు మూడు గంటలు లైన్ లో నించుని లోపలి కెళితే  చివరికి ఏ గుడ్డో కప్పి దాని కింద పన్నుంది అంటారేమో అనిపించింది. 

      కాండీ  చాలా అందమైన ఊరు.   చుట్టూ కొండలు ఊరి మధ్యలో సరస్సు  చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.







ఊరు ఎంజాయ్ చేసేసి హోటల్కెళ్ళి లగేజ్ తీసుకుని నువార ఇలియ బయల్దేరాం. కాండీ నించి నువార ఇలియాకి డైరెక్ట్ ట్రైన్ లేదు. ముందు కాండీ నించి పెరడీనియా ( Peradeniya ) వెళ్ళాలి. పొద్దున్న 9.50 కి రైలు. పది నిమిషాలే ప్రయాణం. అక్కడ నించి నాను ఓయ ( Nanu Oya ) అనే ఊరికి 10.45 కి వేరే రైలు తీసుకోవాలి.     నాను ఓయ చేరటానికి మూడు గంటలు పడుతుంది. నువార ఇలియాకి రైల్వే స్టేషన్ నించి వాన్ లు ఉంటాయి.
   
      రైళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి.   ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి ఏసి తప్ప తేడా ఏమీ లేదు.   ఒకే రకమైన సీట్లు.   సీట్ల రంగులోనే మురికి కూపాల్లాంటి కర్టెన్లు.   కొలంబో నించి అనూరధపురకి ఫస్ట్ క్లాస్ లో వెళ్ళి విరక్తి తెచ్చుకున్నాం.   అందుకని ఈ సారి సెకండ్ క్లాస్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం.   ఇంక థర్డ్ క్లాస్ అయితే ఉట్టి చెక్క బెంచీలే. 

 





రైళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివే.  ఇంక రైలు పట్టాల మీద వెళ్ళదు.  గాలిలో ఊగుకుంటూ వెళుతుంది.   మొదటి అరగంటా చాలా భయమేసింది.  డెఫినెట్ గా పట్టాలు తప్పుతున్దనుకున్నాం.   కుదుపులు అలవాటు అయిపోయాక   టీ ప్లాన్టేషన్స్, వాటర్ ఫాల్స్  కొండలు లోయలు చూస్తుంటే అసలు టైమే తెలీలేదు.  అచ్చు స్విట్జెర్లాండ్ లో ఉన్నట్టుంది. 


















నువార ఇలియాలో ఉన్న హోటల్ పేరు Windsor. అప్పటి కలోనియల్ పెరియడ్ కి గుర్తుగా కట్టడాలు, పేర్లు అలానే ఉంచేసారు. సాయింత్రం ఇంటర్నెట్ సెంటర్ లో , మార్కెట్ తిరుగుతూ గడిపేసాం. శాకాహారులకి అమ్బల్స్ (Ambals) అనే ఫుడ్ ప్లేస్ బావుంటుంది. అక్కడ దోశ కొబ్బరి పచ్చడితో భోజనం చేసాం.  అక్కడ ఉన్న రెండు రోజులు అమ్బల్స్ లోనే తిన్నాం.   ఇండియా నించి ఎవరినా వస్తుంటే మా హోటల్ గురించి చెప్పండని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు.

    


     

No comments:

Post a Comment