Wednesday 19 October 2011

Sri Lanka - Anuradhapura


  కిందటి న్యు ఇయర్ కి శ్రీలంక వెళ్ళాం.   తొమ్మిది రోజుల ట్రిప్పు.   అప్పటికి  ప్రభాకరన్ని చంపి ఏడు నెలలే అయింది,  గొడవలు చాలా ఎక్కువగా ఉంటాయి, వెళ్ళద్దని చాలా మంది డిస్కరేజ్ చేసినా,  మొండిగా వెళ్ళి సక్సెస్ఫుల్ గా ట్రిప్ పూర్తి చేసాం.
  బ్రహ్మానందం స్టైల్లో చెప్పాలంటే ఇండియాని టేప్ రికార్డర్ లో పెట్టి ఓ యాభై ఏళ్ళు రివైండ్ చేస్తే  శ్రీ లంక వస్తుంది.  

        పొద్దున్న పదిన్నరకి చెన్నైలో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ తీసుకున్నాం. కొలంబో చేరేటప్పటికి పదకొండున్నర అయ్యింది. రెండు దేశాలకి టైంజోన్ లో తేడా ఏమీ లేదు. దాదాపు గంటన్నర సేపు ఎదురు చూసి కొలంబో ఫోర్ట్ స్టేషన్ ( colombo fort station ) కి  ఎయిర్ పోర్ట్ షటిల్ తీసుకున్నాం.  ఎయిర్ పోర్ట్ ఊరికి చాలా దూరం. రైల్వే స్టేషన్ కి వెళ్ళటానికి గంటన్నర పట్టింది. అనూరాధపుర కి నాలుగున్న ట్రైన్ కి టికెట్ తీసుకున్నాం. అనూరాధపురకి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదైంది.

    అనూరాధపుర, కాండి, నువార ఇలియ బేస్ గా పెట్టుకున్నాం.

        డే 1  :    అనూరాధపుర 
        డే 2  :    అనూరాధపుర - శ్రీ మహా బోధి 
       
        డే 3   :   అనూరాధపుర - ఎలిఫెంట్ సఫారి, సిగిరియా, డంబుల్ల 
       
        డే 4   :  కాండీ 

        డే 5   :  కాండీ - శ్రీ పాద 

        డే 6   :  నువారా ఇలియా 

        డే 7   :  నువారా ఇలియా - సీతా కోవిల్, రావణ ఫాల్స్ 

        డే 8   :  కందపోల 

        డే 9   : కందపోల 
    
 
అనూరాధపుర

అనూరాధపురలో " నువారవేవ " ( Nuwarawewa) అనే రెస్ట్ హౌస్ లో బుక్ చేసుకున్నాం.  రెండు  రోజుల పాటూ అక్కడే. అనూరధపుర నించి చాలా ప్రదేశాలు దగ్గర కాబట్టి, అక్కడ నించే ప్లాన్ చేసుకున్నాం. పొద్దున్న టిఫిన్ తినేసి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ బయల్దేరాం. తుంపర మొదలైంది. ఓ షాప్ లో దూరి గొడుగులు కొనుక్కున్నాం. అదేమి విచిత్రమో కాని మేమేదేశం వెళ్ళినా, తీసుకెళ్ళిన రెండు గోడుగులూ ఒకేసారి పాడవటమో, లేక పోతే ఎండగానే ఉంది కదా, అనవసరమైన మోత బరువెందుకని వాటిని రూంలో వదిలేస్తే మధ్య దారిలో హోరున వర్షం రావటమో జరిగి గొడుగులు కొనాల్సొస్తుంది. అలా ఇప్పుడు మా దగ్గర శ్రీలంక గొడుగులు, పారిస్ గొడుగులు, ఇటలీ గొడుగులు ఇలా చాలా గొడుగులు చేరాయి.
    
         అనూరాధపురని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన పురాతనమైన గుళ్ళు, స్తూపాలు చాలా ఉన్నాయి. ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. ఊరు పల్లెటూరులా ఉంది.   ఇదే కాదు శ్రీలంక లో చాలా ఊళ్లు కుగ్రామాలలాగా చాలా వెనకపడి ఉంటాయి. ఉన్న డబ్బంతా ఎల్టిటిఈ కే సరిపోయిందిట. ఇప్పుడిప్పుడే కాస్త డెవలప్మెంట్ మొదలు పెట్టారు.          
   
      నడక చాలా బావుంది.  తుంపర, రోడ్డుకి రెండు వైపులా పొలాలు. 


శ్రీ మహాబోధి (Sri Maha Bodhi )

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోకుడి కూతురు సంగమిత్ర బౌద్ధ సన్యాసినిగా మారి, ప్రచారానికి వచ్చినప్పుడు గయలో బుద్ధుడు కూర్చుని తపస్సు చేసిన బోధి చెట్టు కొమ్మ ఒకటి తెచ్చి ఇక్కడ పాతిన్చిందిట. ఆ చెట్టుకిప్పుడు రెండు వేల ఏళ్ళు.  మనిషి నాటినట్లు  రికార్డు చేసిన వాటిలో  ప్రపంచంలో ఇదే oldest చెట్టుట.  ఈ చెట్టు విత్తనాలే ప్రపంచంలో చాలా బౌద్ధ స్థలాలలో నాటారుట. గయలో కూడా పాత చెట్టు చచ్చిపోతే అనూరాధపుర నించే తీసుకొచ్చి నాటారుట.


Entrance to the Temple




Bodhi Tree

 మేము వెళ్ళింది ఆదివారం. అందుకని చాలామందే ఉన్నారు. ఎవరో కొందరు తప్ప దాదాపు అందరూ తెల్ల డ్రెస్సుల్లోనే వచ్చారు. హిందూమతం నించే వచ్చింది కాబట్టి దాదాపుగా హిందూ సాంప్రదాయాలే. చెప్పులు గుడి బయటే వదిలెయ్యాలి. అవే ధూప, దీప, నైవేద్యాలు. గుడికి ఆదివారాలు వెళ్ళటం, తెల్ల బట్టలు వేసుకోవటం తరవాత కాలంలో క్రైస్తవ మతం తెచ్చిన ఆచారమేమో. 


The Buddha in the Main Temple

బోధి చెట్టు తర్వాత చూడాల్సిన బౌద్ధ స్తూపాలు చాలా ఉన్నాయి.   సెక్యూరిటీ గార్డ్ ని అడిగి దారి కనుక్కుని బయల్దేరాం.  


రువాన్మలి మహా స్తూప

Ruwanmali Maha Stupa


ఈ స్తూపాలు నాలుగు వైపులా మూసేసే ఉన్నాయి. లోపల బౌద్ధ మతానికి చెందిన తాళపాత్ర గ్రంథాలో, బుద్ధుడికి సంబంధించిన వస్తువులో ( relics ) పెట్టి మూసేస్తారుట. వాటికి ఆక్సెస్ ఏమీ లేదు మరి.
   
     ఇలాంటిదే కొంచెం చిన్నది తూపారామ డగోబ.  మిగిలున్న స్తూపాలలో ఇదే ప్రపంచంలో పురాతనమైన స్తూపంట. దీనిలో బుద్ధుడి కుడి కాలర్ బోన్ ఉందిట. 

      తరవాత చూసినది జేతావనారామ డగోబ.  కట్టినప్పుడు దీని ఎత్తు 400  అడుగులుట.  పైన టిప్  విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ. 

జేతావనారామ డగోబ


Jetavanarama Dagoba





Reclining Buddha in the Sanctum Sanctorum

    ఏమిటీ అన్నిటికీ చివర రామ అనుంది అనుకున్నా.  కొంచెం ఆలోచిస్తే అర్ధమయింది.  అది రామ కాదు, ఆరామ అని.  అంటే బౌద్ధ ఆరామాలు అనమాట.

       గుళ్ళల్లో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది.   హ్యాండ్ బాగ్గులు చెక్ చెయ్యటమే కాకుండా మెటల్ డిటెక్టర్ లతో కూడా చెక్ చేసారు.    గుళ్ళలోనే కాదు, దేశం మొత్తం టైట్ సెక్యురిటి ఉంది.  అనూరధపుర జాఫ్నకి దగ్గరగా ఉంది కనక, ఇక్కడ ఇంకా ఎక్కువ.
   
      ఒకొక్క గుడి ఊరంతుంది.     దీనికి తోడు స్థూపం చుట్టూ తిరగాలంటే ఓ అర కిలోమీటరు నడవాలి.   ఈ నాలుగు గుళ్ళూ తిరిగేసరికే కాళ్ళు అరిగిపోయాయి.    ఇంకా చూడాల్స్నిన  స్తూపాలు,  తవ్వకాలు జరిగిన  స్థలాలు ఉన్నా ఓపిక లేదు.   ఆటో ఏమన్నా కనిపిస్తుందేమోనని చూసాం కాని ఎక్కడో ఊరు చివర అడవిలా ఉంది.  ఆటోలేమొస్తాయి.    పొద్దున్న  ఆహా ఓహో ఈ నడక అనుకుంటూ బయల్దేరిన మేము,  మధ్యాహ్నమయ్యేసరికి  ఛి వెధవ్వూరు అని తిట్టుకుంటూ  కాళ్ళీడ్చుకుంటూ మధ్యలో దారి తప్పుకుంటూ  మొత్తానికి పది కిలోమీటర్ల  పైన  నడిచి  ఊళ్ళో పడ్డాం.   హోటల్లో తినాలనిపించక బయిట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెజ్ ఫ్రైడ్ రైస్, పళ్ళు కొనుక్కుని లంచ్ అయిన్దనిపించాం.

        రెస్ట్ హౌస్కెళ్ళి క్రోసిన్ మింగి, తరవాత  రోజుకి వాన్ మాట్లాడుకున్నాం.  


హబరణ, సిగిరియా, డంబుల్ల :    

     పొద్దున్నే ఎనిమిదన్నరకల్లా  రెస్ట్ హౌస్ నించి వాన్ లో బయల్దేరాం.   మొదట హబరణ అనే ఊళ్ళో  ఎలిఫంట్ సఫారి.
    
       ఎలిఫంట్ సఫారి గంట సేపు.    ఒక గది ఉన్న చిన్న పెంకుటిల్లె ఆఫీస్.  బయట మాస్కులు అవీ పెట్టుకున్నాడు అమ్మటానికి.    బేరం ఆడటానికి చాలా ట్రై చేసాం కాని అస్సలు కుదరలేదు.    రోడ్డు క్రాస్ చేస్తే ఒక ఏనుగు,  దాన్ని ఎక్కడానికి మెట్లు.   ఆ ఏరియా అంతా ఇలాంటి సెట్టిన్గులే.     



             
ఎలిఫంట్ సఫారి గంట సేపు.    ఒక గది ఉన్న చిన్నపెంకుటిల్లె ఆఫీస్.  బయట మాస్కులు అవీ పెట్టుకున్నాడు అమ్మటానికి.    బేరం ఆడటానికి చాలా ట్రై చేసాం కాని అస్సలు కుదరలేదు.    రోడ్డు క్రాస్ చేస్తే ఒక ఏనుగు,  దాన్ని ఎక్కడానికి మెట్లు.   ఆ ఏరియా అంతా ఇలాంటి సెట్టిన్గులే.












ఏనుగు మెయిన్ రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా భయమేసింది. గోతుల్లో గొప్పుల్లో బండి మీది వెళుతుంటే ఎలా ఉంటుందో అలా ఊగుకుంటూ కూర్చున్నాం. దానికి తోడు రోడ్డు మీద లారీలకి  అదెక్కడ భయపడి పరిగేడుతుందో అని ఇంకో భయం.   ఎప్పుడైతే మట్టి రోడ్డులోకి వెళ్ళామో ఆ గుంటల్లో దాని నడకే మారిపోయింది. ఒక్క కుదుపు కూడా లేకుండా హాయిగా ఉంది.


















ఏనుగు  వెళ్ళే దారి దాదాపు  వన్ వే.    బాగా ట్రైన్ అప్  అయిపోయాయి కాబట్టి మధ్య మధ్యలో  ఎదురొచ్చే  ఏనుగుల  వల్ల ట్రాఫిక్ జాములు అయినా అవేమి ఖంగారు పడలా.    పక్కకి దూరే సందొచ్చే వరకు వెనక్కి నడిచి పక్కకి జరిగి ఎదురుగా వచ్చే వాటికి దారిచ్చాయి.

     సఫారీ అయిపోగానే పక్కనే ఒకడు అరటి పళ్ళ అత్తం పట్టుకుని నించున్నాడు.    అవి అమ్మడానికని మాకు తెలీలేదు.    నా దగ్గర నాలుగు అరటి పళ్ళు ఉంటే దానికి ఇచ్చా.    అదింకా ఆశగా చూసింది.   మావటి వాడు చెప్పాడు అసలు సంగతి.  పాపం వాటికి టూరిస్ట్లు పెట్టే అరటి పళ్ళే తిండేమో.   స్పెన్సర్ రేటుకి వాడి దగ్గర కొని దానికిస్తే హాపీ అయిపొయింది.

       అక్కడ నించి  సిగిరియ బయల్దేరాం.


సిగిరియ రాక్ ఫోర్ట్ :


Sigiriya Rock


దీని అసలు పేరు సింహ గిరియ.    కశ్యప  అనే రాజు  ఈ 600  అడుగుల ఎత్తైన రాతి మీద తన కోట కట్టుకున్నాడు.   1891  తవ్వకాలలో బయటపడింది.   ఈ రాయి వోల్కానిక్ ప్లగ్.    

          అనురాధాపుర రాజు ధాతుసేనకి ఇద్దరు కొడుకులు.   పెద్దవాడు కశ్యప,  రెండో వాడు ముఘల.   ముఘల రాణి కొడుకు, కశ్యప ఒక వేశ్య  కొడుకు.  రాజు ముఘలని వారసుడిగా ప్రకటించాడుట.   దోసిళ్ళతో నీళ్ళు తీసుకుని పైకి ఎగరేసి కశ్యపతో ఇదే నేను నీకిచ్చే ఆస్తి వ్యవసాయం చేసుకో అన్నాట్ట.    అతనికి కోపం వచ్చి ధాతుసేనని అక్కికక్కడే చంసేసాడు.   ముఘల ఇండియా పారిపోయాట్ట .   కశ్యప  తన కోట ఈ రాయి మీద కట్టుకుని పద్దెనిమిదేళ్ళు పాలించాడు ( 5th century A.D ).   ముఘల బలం పుంజుకుని తిరిగొచ్చాక   కశ్యపతో  యుద్ధానికి దిగేడు.   యుద్ధం  హబరణలో జరిగింది.   ఆ రణం నించే దానికా పేరు.  యుద్ధంలో కశ్యప  సైన్యం పారిపోయిందిట.   ఓడిపోయాడని తెలిసి కశ్యప  కూడా  పొడుచుకుని చచ్చిపోయాడు.  ముఘల సింహగిరియాని బౌద్ధ సన్యాసులకి ఇచ్చేసి అనురాధాపుర నించి పాలించాడుట.   అప్పటి నించీ ఇది బౌద్ధ భిక్షువులకి  మెడిటేషన్ పాయింట్  అయింది.   సిగిరియా ని పాలించిన ఒకే ఒక్క రాజు కశ్యప.


  కోటకి వెళ్ళే దారిలో రెండు వైపులా గార్డెన్, ఫౌంటైన్లు, రాయల్ బాత్స్  ఉన్నాయి.   కొండ రాళ్ళు రకరకాల జంతువుల ఆకారాలలో ఏర్పడ్డాయి.    చాలా గుహలు కూడా ఉన్నాయి.   ఆ గుహలలోనే బౌద్ధ సన్యాసులు తపస్సు చేసుకునేవారుట.
 
cobra hood rock 
 






మొత్తం మెట్లు పన్నెండు వందలు.  ఇంకా ఎక్కువ కూడా ఉండచ్చు.   వీటిలో అక్కడక్కడా అయిదు, పది  చప్పున దాదాపు రెండు వందల  దాకా   గార్డెన్ లోనే ఉంటాయి.   ముందు రోజు వానొచ్చిందని జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఇక్కడ విపరీతంగా ఎండ.   వెళ్ళిన పావుగంటకే తీస్కెళ్ళిన మంచినీళ్ళు అయిపోయాయి.   బాటిల్ కొనాలంటే మళ్ళీ ఓ మైలు దూరం నడవాలి.    బాగ్ వెతికితే రెండు కమలాలు కనిపించాయి.   అన్ని మెట్లూ  రెండు కమలాలతో మేనేజ్ చేసేసాం.

           రాతి పైకి మెట్లు ఎక్కుతుంటేనే మధ్య మధ్యలో చూడాల్సినవి చాలా ఉంటాయి.   పైనించి గార్డెన్, ఫౌంటైన్ల మంచి వ్యూ కనిపిస్తుంది.    దూరంలో బుద్ధుడి విగ్రహం. 
 
 
 
దాదాపు సగం దూరం ఎక్కాక  మిర్రర్ వాల్,  పెయింటింగులు  వస్తాయి.    మిర్రర్ వాల్  మూడు మీటర్ల ఎత్తు గోడ.  దీన్ని అద్దం లాగా నున్నగా పోలిష్ చేసారుట.   
 

Mirror Wall

ఇప్పుడు షైన్ దాదాపు  పోయి మామూలు గోడ లాగే ఉంది.   

       గోడల మీద ఆ కాలం నాటి పెయింటింగులు ఉన్నాయి.      అయిదు వందలు ఉండేవిట,  ఇప్పుడు దాదాపు ఇరవై మిగిలాయి.   బౌద్ధ సన్యాసులొచ్చాక   ఫ్రెస్కోస్ బాలేవని చేరిపేసారుట. 
 
 
 
 తరవాత వచ్చేదే లయన్ ప్లాట్ ఫాం.  సింహ గిరియ అనే పేరు దీన్నించే వచ్చింది.   ఇవే ఫైనల్ మెట్లు, కష్టమైన మెట్లు కూడా.    హైట్ ఫోబియ ఉన్న వాళ్లకి ఇంకా కష్టంగా ఉంటుంది.  
 
 
సింహం నోటిలోంచి లోపలి వెళ్ళేటట్లు మెట్లు కట్టారు.   ఇప్పుడు నోరు, మొహం అన్నీ పోయాయి.  సింహం paws  మాత్రం  మిగిలాయి.   కనిపించే రాతి మెట్లే ఒరిజినల్ వి.  
 
 
 

Summit

 
 
పైన దాదాపు నాలుగెకరాలుట.    ఇప్పుడు చూడటానికి కోట ఏమీ మిగలక పోయినా,   అంత కష్టపడి ఎక్కినందుకు  పైనించి మంచి 360  డిగ్రీ వ్యూ ఉంది.    ఇక్కడ ఎండ కొండ ఏమీ లేదు.  చల్లటి గాలి.   హాయిగా కొంచెం సేపు కాళ్ళు బార్లా జాపుకు కూర్చుని మళ్ళీ దిగటం మొదలు పెట్టాం.   సిగిరియ రాయి ఎక్కి దిగటానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. 

          అక్కడ నించి డంబుల్ల బయల్దేరాం.   తిండి తినే టైం లేదు.    మళ్ళీ గుడి మూసేస్తారని డ్రైవర్ భయపెట్టేసరికి ఏమీ తినకుండానే ఉండి పోవాల్సొచ్చింది. 

 డంబుల్ల - గోల్డెన్ టెంపుల్
 
 
Golden Temple, Dambulla

 
దీని ఎత్తు 100  అడుగులు.    ప్రపంచంలో ఉన్న బుద్ధుడి విగ్రహాలలో ఇదే పెద్దదని అక్కడ రాసుంది కానీ నాకు డౌటే.  

      వలగంబ అనే రాజు తన రాజ్యం మీదకి వేరే రాజు  దండయాత్రకి వచ్చినప్పుడు అనురాధపుర నించి పారిపోయి ఈ గుహలలో పదిహేనేళ్ళ పాటూ దాక్కునాడుట.     అంత కాలం పాటు బుద్ధుడే తనని రక్షించాడు కాబట్టి, తన రాజ్యం తిరిగి పొందేక,   క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో ఈ గుహలని బుద్ధుడి గుడిగా మార్చాడు.    తరవాతి రాజులు బుద్ధుడి విగ్రహాలు  కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయారు. 

         గుహలు చూడటానికి టికెట్లు కొన్నాం.    షరా మామూలే.   కొండెక్కాలి.  కొండ మీద  వేరే కొండ రాయికి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నాయి గుహలు.   ఎక్కేటప్పుడు మెట్ల దారి లేదు.   స్లోపీగా ఉన్న కొండ రాతి మీంచే ఎక్కాలి.    మధ్యమధ్యలో ఐస్ క్రీములు, అవీ అమ్ముతూ వుంటారు.  కొనేదాకా వాళ్ళు వదలరు, కొన్న తరవాత కోతులు వదలవ్.
 
 
Dambulla Cave Temple

 
మొత్తం అయిదు గుహలు.  వీటి నిండా బుద్ధుడి విగ్రహాలే.  ఇద్దరో, ముగ్గురో హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారు.   సీలింగ్ మీద కూడా బుద్ధుడి పెయింటింగులు వేసారు.  
 
 
 
 
 

 
దిగే దారి మాత్రం మెట్ల దారి.   నాలుగు వందల మెట్లని డ్రైవర్ చెప్పాడు. 
 
 
 
 
 
 
మెట్లు దిగే శ్రీలంక ఆడవాళ్ళ డ్రెస్సులు చూసారా. అక్కడ అందరూ అవే డ్రెస్సులు. చిన్న వాళ్ళ నించీ ముసలి ముతక దాకా షర్టు స్కర్టు. కొందరు స్కర్టు బదులు హాయిగా లుంగీలు కట్టేస్కున్నారు. డ్రైవర్ నడిగా ఏమిటీ ఎవరూ చీరల్లో కనిపించట్లేదు అసలు మీ నేషనల్ డ్రెస్ ఏది అని. ఈ రోజుల్లో అందరివీ ఇవే డ్రస్సులు ట. గయ చూడటానికి ఇండియా వచ్చినప్పుడు లుంగీలు లాట్ లో కొనుక్కు వెళతారుట. ఇండియా లో లుంగీలు చాలా చవకట. కండీ, నువార ఇలియల లో మాత్రం చాలా మంది చీరల్లో కనిపించారు.
 

No comments:

Post a Comment