Thursday 13 October 2011

Egypt - Desert Safari


ఈజిప్ట్ ప్లాన్ చేసినప్పుడే  డెజర్ట్ సఫారీ  చెయ్యాలనుకున్నా.   చాలా టూర్ ఆపరేటర్లు  ట్రై చేసాం కానీ ఈజిప్ట్ టూర్ పాకేజ్ లో ఎవరూ డెజర్ట్ సఫారీ  ఆఫర్ చెయ్యట్లేదు.  చివరికి సొంతగానే బయల్దేరాం.  

      ముఖ్యంగా చూడాల్సినవి బహారియా ఒయాసిస్, శివ ఒయాసిస్.  శివ చాలా దూరం.  బహారియా కొంచెం దగ్గర, పైగా అక్కడ అలెక్జాన్డర్ కట్టించిన గుడి కూడా ఉంది. రెండూ చూడాలంటే కనీసం నాలుగు రోజులు కావాలి. మా దగ్గర రెండు రోజుల కంటే సమయం కూడా లేదు. ఇంకా బహారియాలో నల్ల ఎడారి, తెల్ల ఎడారి చూడచ్చు. కాబట్టి బహారియా ఫైనలైస్ చేసాం.


 బహారియా ఒయాసిస్ ( Bahariya Oasis )
   
     కైరో హోటల్ కి పొద్దున్న ఆరింటికల్లా వాన్ వచ్చింది.  సూపర్ మార్కెట్ దగ్గర ఆగి తిండి , నీళ్ళు  కొనుక్కుని  బయల్దేరాం.  ఆరు గంటల ప్రయాణం.  పొద్దున్నే పొగ మంచు ఉంటుంది కాబట్టి స్పీడుగా వెళ్ళటానకి  కూడా ఉండదు.  సూర్యుడొచ్చిన  తరవాత ఇంక బాధ లేదు. 



రెండు వైపులా ఇసక మయం.  ఒక చెట్టు కానీ, ఇల్లు కానీ ఏమీ లేవు.  అక్కడక్కడ పోలీసు చెక్ పోస్టులు మాత్రం ఉన్నాయి.    మిరాజ్ ( ? ఎండమావులు ) ని మొదటి సారి చూసాం. 







బహారియాలోని బవీటీ అనే ఊరు చేరేసరికి మధ్యాహ్నం పన్నెండైంది.   హోటల్ " పాం స్ప్రింగ్స్" లో చెకిన్ చేసాం. బవీటి కుగ్రామం.   ఏమీ దొరకవు.  బడ్డీ కోట్లలాంటివి ఉన్నా, మనకి పని కొచ్చేవేమీ  ఉండవ్.   హోటల్ బయటికొచ్చి నాలుగడుగులేస్తే ఇదీ వాలకం.   ఇక్కడ బతికేవాళ్ళు పిచ్చెక్క కుండా ఎలా ఉన్నారా అనిపించింది.





   ఒంటి గంట కల్లా భోజనం తయారయి పోయింది.   వెజిటేరియన్ కాబట్టి స్పెషల్ గా తాయారు చెయ్యాల్సి వచ్చింది. 





అదే భోజనం.  పీటా బ్రెడ్డు, ఆలివ్లు, అన్నం, ఉడకపెట్టిన కూరలు, సాలడ్, తహీనీ డిప్.   డ్రైవర్ కూడా భోజనం చేసేసి తిరిగి కైరో వెళ్ళిపోయాడు.  

 రాత్రి ఎడారి లోనే కామ్పింగ్. బవీటి నించి బయల్దేరిన తరువాత ముందు బ్లాక్  డెజర్ట్, ఆ తరవాత వైట్ డెజర్ట్ వస్తాయి. వైట్ డెసర్ట్ లోనే క్యాంపు కాబట్టి చీకటి పడకుండా వైట్ డెసర్ట్ చేరాలి. డ్రైవర్ బ్లాక్ డెజర్ట్, వీలైనంత వైట్ డెజర్ట్ చూపించి, మిగిలింది తరవాత రోజు తిరుగు ప్రయాణంలో చూపిస్తాడు. బవీటి నించి నాలుగ్గంటలు పడుతుంది. పైగా ఇసక తిన్నేల్లోంచి ( sand dunes ) వెళ్ళాలి. కడుపులో తిప్పుతున్దనుకునే వాళ్ళు ఓ రెండు టాబ్లెట్లు మింగి బయల్దేరటం మంచిది. ఇంకా చలికాలంలో వెళ్ళే వాళ్ళు కోటు, మఫ్ఫ్లర్లు, గ్లవ్స్ తప్పకుండా తీసు కెళ్ళాలి.

 రాత్రంతా ఎడారిలోనే ఉంటాలి కాబట్టి బవీటిలో బయల్దేరే ముందు కొన్ని సెక్యురిటీ ఫార్మాలిటీస్ ఉంటాయి.  
పాస్ పోర్ట్లు ఫోటో కాపీలు,  ఇంకా బండి నెంబరు పోలీసు స్టేషన్ లో అప్పచెప్పాలి. 

      రెండింటికల్లా ల్యాండ్ క్రూసర్లో బయల్దేరాం.   మా డ్రైవర్ కి హలో తప్ప ఇంకో ఇంగ్లీషు ముక్క రాదు.  ఆ రెండు రోజులు అతనే డ్రైవరు, వంటమనిషి, గైడ్ అన్నీ.  కామ్పింగ్ కి కావాల్సిన సామాన్లన్నీ బండి పైన ఎక్కించుకున్నాడు. చిన్న చిన్న ఇళ్ళ దగ్గర ఆగుతూ పెట్రోలు, రాత్రి మంట వేస్కోటానికి  చెక్కలు, భోజనానికి కూరలు, నూనె, బియ్యం,  టీ పౌడరు కొన్నాడు.   గానుగ కెళ్ళి  కొబ్బరి నూనె  కొన్నట్లు, ఇంటి మున్దాగి చిన్న ప్లాస్టిక్ డ్రమ్ముల్లోంచి పెట్రోల్ కొంటూంటే  చూడటం ఇదే మొదటి సారి. 

బయల్దేరే ముందే రాత్రికి ఏమి తింటామో అడిగారు.  అందులో లంచ్ కి వెజిటేరియన్ అని చెప్పేసరికి వాళ్ళు కొంచెం ఖంగారు పడ్డారు.   ఎటువంటి మాంసం కానీ, గుడ్లు కానీ తినం,  అన్నం, బ్రెడ్డు, కూరగాయలు తింటాం అన్నాక వాళ్లకి అర్థమయ్యింది.

      దాదాపు పది బళ్ల దాకా  ఒకేసారి బయల్దేరాయి.   సాండ్ డ్యూన్స్ దగ్గర ఒకట్రెండు బళ్ళు ఇసకలో కూరుకుపోతే మిగిలినవాళ్ళు తోసే పనిలో పడ్డారు.   మేము బళ్ళు  దిగి ఫోటోలు తీసుకుని,  ఆ ఇసకలో జారుడుబండ ఆడేవాళ్ళు ఆడుకుని  మళ్ళీ  బయల్దేరాం.





మొదట వచ్చేది బ్లాక్  డెసర్ట్.   నల్లటి ఇసక.

Black Desert
  


చాలా కాలం క్రితం అగ్ని పర్వతం బద్దలయ్యి ఈ ప్రాంతమంతా లావా ప్రవహించిందిట.  లావా వల్ల  వచ్చిందే నలుపు రంగు.   

తరవాత వచ్చేదే వైట్ డెజర్ట్.   ఇసుక మామూలు  రంగులోనే ఉన్నా,  తెల్ల సున్నపు రాయితో చాలా స్ట్రక్చర్స్  ఏర్పడ్డాయి.  వాటివల్లే ఆ పేరు.  అవి కుక్కగొడుగులు, చెట్లు, పక్షులు, డైనింగ్ టేబుల్  ఇలా రకరకాల ఆకారాల్లో ఏర్పడ్డాయి.  అవి ఏళ్ల  తరపడి వచ్చిన ఇసక తుఫాన్ల  వల్ల  ఎర్పడినాయిట.    వాటి  దగ్గర ఆగి ఫోటోలు తీసుకుని మళ్ళీ బయల్దేరాం. 



White Desert







ఇది కోడి, గుడ్డుట.  నాకయితే చెట్టు పక్షిలా ఉన్నాయి.    సూర్యాస్తమయం అయ్యే టైం కల్లా మంచి చోటు చూసుకుని సెటిల్ అయిపోయాం.   మా డ్రైవర్  టకటకా సామానంతా బండి పైనించి  దింపి అరగంటలో సెట్టింగ్ వేసేసాడు.   వైట్ డెజర్ట్ లోనే అందరూ కామ్పింగ్ చేసినా కూడా, చాలా దూరాలలో ఉంటాయి.  ఎవరూ ఎవరికీ కనిపించరు. 


Sunset Over The Sahara

సూర్యాస్తమయం తరవాత ఆ ఫార్మేషన్స్  ఇంకా అందంగా కనిపించాయి.




పాల సముద్రం చాలా బావుంది కదా.

చీకటి పడటం మొదలు పెట్టగానే టార్చ్ వెలుగుతో  వంట పని మొదలు పెట్టాడు.   ముందు మంచి టీ పెట్టాడు. 



డైనింగ్ టేబుల్,  హాయిగా కాళ్ళు బార్లా చాపుకుని కూర్చోడానికి పరుపులు.   కానీ ఏం లాభం.  గజగజ వణుకు.  పరుపులు మంచు గడ్డల్లా అయిపోయాయి.   ముడుచుకుని స్టవ్ పక్కనే కూర్చున్నాం.    కూరలు  కట్ చేసి, ఓ గిన్నెలో కూర ముక్కలు, నీళ్ళు, నూనె పోసి ఉడికిన్చేస్తే కూర అయిపోయినట్లే.  ఇంక ఉప్పులు, కారాలు ఏమి ఉండవ్.  అన్నం ఉప్పేసి వండుతారు.   వంటయిపోగానే మా కామ్పింగ్ టెంట్ రెడీ చేసి,  కాంప్  ఫైర్ వేసాడు.   
ముగ్గురం డైనింగ్ టేబుల్  దగ్గర కూర్చుని భోజనం చేసాం.  అంత చలిలో వేడివేడిగా తిన్నామేమో వంట చాలా రుచిగా అనిపిచ్చింది. 

          తిండి ప్రోగ్రాం అయిపోయాక మంట వెలుగుతున్నంత సేపు అంత్యాక్షరి ఆడుకుని తర్వాత టెంట్ లో కెళ్ళి పోయాం.   టెంట్ లో పరుపు, దాని మీద రగ్గులు పరిచి,  స్లీపింగ్ బాగ్స్ ఇచ్చాడు.  బాగ్ లో దూరి జిప్ వేసేసుకోవటమే.   నక్కలు తిరుగుతూ ఉంటాయిట.  చెప్పులు కూడా టెంట్ లోనే పెట్టుకోమన్నాడు.   మా డ్రైవర్ మాత్రం హాయిగా బయిటే ఓ దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. 

       పొద్దున్నే సూర్యోదయాని కన్నా ముందే లేచి కేమెర రెడీ చేసుకున్నాం.   డ్రైవర్ టిఫిన్, టీ కి ప్రిపరేషన్స్ మొదలు పెట్టేసాడు.   నీళ్ళు గడ్డకట్టెంత చల్లగా ఉన్నాయి.  అలాగే కష్టపడి పళ్ళు తోమేసుకుని మేము కూడా టిఫిన్ కి రెడీ అయిపోయాం.  పీటా బ్రెడ్డు,  బట్టర్, జాం, బీన్స్.  టిఫిన్ తినేసి మళ్ళీ సామాను సద్దేస్కుని బవీటి కి బయల్దేరాం.  మధ్యలో క్రిస్టల్ మౌంటైన్, అలెక్జాన్డర్ కట్టిన గుడి, గ్రేకో రోమన్ మమ్మీల ముజియుం ఉన్నాయి. 



Sunrise Over The Sahara

Crytal Mountain
Temple built during Alexander's reign for Amun and Horus

     బ్లాక్, వైట్ డెజర్ట్ ల లో రాళ్ళు చాలా విలువైనవి.  అక్కడ నించి రాళ్ళు కల్లెక్ట్ చేస్తే కేసు కూడా పెడతామని ఎక్కడికక్కడ బోర్డ్ ల మీద రాసిపెట్టారు. 

      ఫారోల తరవాత ఈజిప్ట్ ని పాలించిన గ్రీకులు, రోమన్లు కూడా చాలా కాలం మమ్మిఫికేషన్ పద్ధతి ఫాలో అయ్యేవారు.    కాఫిన్ల మీద వాళ్ళ వాళ్ళ బొమ్మ వేసి ఇంకా అందంగా తయారు చేసేవారు.   కానీ  మాకు  అప్పటికే   మమ్మీలంటే విరక్తి వచ్చేసింది.   మళ్ళీ శవాలు చూడాలన్న మూడ్ లేదు.  కానీ టికెట్టు ముందే కోనేసాం కనక బలవంతపు బ్రాహ్మనార్ధంలా ఓ చుట్టు చుట్టి అయిన్దనిపించాం.   

         డెసర్ట్ సఫారీతో  మా ఈజిప్ట్ ట్రిప్పు అయిపోయినట్లే.  ఇంక ఫైనల్ గా హోటల్ కే.   

      మధ్యాహ్నం భోజనం తరవాత రోజంతా టైమే.   బయిట తిరగటానికి  ఏమీ లేదు.   రూంలో టీవీ పనిచెయ్యట్లేదు.   ఏదో వచ్చిన వాళ్ళల్లాగా బిల్లియర్డ్స్ బోర్డ్ దగ్గర కాలక్షేపం చేస్తూ కూర్చున్నాం.

     తరవాత రోజు పొద్దున్నే నాలుగింటికి కైరో నించి తీసుకొచ్చిన డ్రైవరే తిరిగి తీసుకు వెళ్ళటానికి  వచ్చాడు.   పదిన్నరకి కైరో ఎయిర్ పోర్ట్ చేరుకున్నాం.   రెండింటికి ఫ్లైట్.  బహ్రెయిన్ లో స్టాప్ ఓవర్.   తరవాత రోజు పొద్దున్న ఆరింటికి ఇండియా చేరుకున్నాం.

       
    ఖర్చులు                          యుఎస్ డాలర్లలో                         ఈజిప్టియన్ పౌన్లలో

డెజర్ట్ సఫారీ                              725                                             __

డ్రైవర్ టిప్                                  __                                              100 * 2
     

        

No comments:

Post a Comment